వందే సాధారణ్ రైలు వచ్చేస్తోంది..!

విధాత: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 30కిపైగా రూట్లలో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే, ప్రయాణికుల నుంచి రైళ్లకు భారీ డిమాండ్ ఉండడంతో మరిన్ని రూట్‌లలో వీటిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. అయితే, ఈ రైళ్లలో టికెట్ల ధరలు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో లేవనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రైలులో ఎకనామిక్స్, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కేటగిరిలున్నాయి.
ప్రస్తుతం సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్‌లో ఎకనామిక్స్ చైర్‌కార్‌లో రూ.1680 ఉండగా.. ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ రేటు రూ.3080 ధర ఉన్నది. అయితే, ఈ క్రమంలో సాధారణ ప్రజలకు సైతం వందే భారత్ తరహాలో ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు రైల్వేశాఖ వందే సాధారణ్ రైళ్లను తీసుకువస్తున్నది. నాన్ ఏసీ రైళ్లు మూడు నెలల్లో పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తున్నది.
ఇప్పటికే రైలు కోచ్ లుక్‌ను విడుదల చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో వచ్చే జనవరి నాటికి తొలి రైలు సిద్ధమవుతుందని రైల్వే అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైలు రెడీ అయ్యాక ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఏ రూట్‌లో ప్రారంభించే విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న శతాబ్ది రైళ్లను తొలగించి వాటి స్థానంలో వందే భారత్ రైళ్లను తీసుకురావాలని రైల్వేశాఖ యోచిస్తున్నది.
త్వరలో వందేభారత్‌లో స్లీపర్ వెర్షన్ రైళ్లను సైతం రైల్వేశాఖ తీసుకురాబోతున్నది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చిత్రాలను విడుదల చేయగా.. లుక్ అందరినీ ఆకట్టుకుంటున్నది. ఈ రైళ్లను రాజధాని రైలు స్థానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తున్నది. అలాగే సాధారణ రైళ్ల స్థానంలో సాధారణ్ రైళ్లను దశలవారీగా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవీ వందే భారత్ సాధారణ్ ప్రత్యేకతలు..
వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సంప్రదాయ నాన్ ఏసీ రైళ్లకు భిన్నంగా ఉండనున్నాయి. వందేభారత్ తరహాలో పుష్‌పుల్ పద్ధతిలో ముందు, వెనక ఇంజిన్లు ఉంటాయి. గరిష్ఠంగా 24 చొప్పున లింక్ హాఫ్‌మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. సంప్రదాయ రైళ్లలోని సీట్లతో పోలిస్తే వీటిల్లో మెరుగ్గా ఉంటాయి. ప్రతి బెర్త్ వద్ద చార్జింగ్ పాయింట్లు సైతం ఏర్పాటు చేయనున్నారు.
వందేభారత్ రైళ్లలో ఉన్నట్టుగానే ప్రయాణికులకు కోచుల్లో అనౌన్స్‌మెంట్ స్క్రీన్లు, ఆడియో వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా బిగించనున్నారు. వందేభారత్ రైళ్లలో ఉన్నట్టుగా ఆటోమేటిక్ డోర్లు ఉండనున్నాయి. నీట్‌గా ఉండేలా చూడడంతో పాటు దుర్వాసన రాకుండా ఉండేందుకు బయో వాక్యుమ్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నారు.