దీపావళికి ముందే మరిన్ని రూట్లలో వందేభారత్‌..! కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ..!

దీపావళికి ముందే మరిన్ని రూట్లలో వందేభారత్‌..! కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ..!

విధాత‌: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 30కిపైగా రూట్లలో సెమీ హైస్పీడ్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. పలు మార్గాల్లో ఆయా రైళ్లకు భారీగా డిమాండ్‌ ఉంటున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరికొన్ని మార్గాల్లోనూ ఈ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. ఇటీవల ఒకేసారి తొమ్మిది మార్గాల్లో సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రారంభించిన రైల్వేశాఖ.. దీపావళికి ముందే మరో తొమ్మిది రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నది. ఇందులో మూడు సెంట్రల్‌ రైల్వే నెట్‌వర్క్‌లో పట్టాలెక్కించే అవకాశాలున్నాయి.


ఏయే మార్గాల్లో రైళ్లను నడుపనున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం పొటెన్షియల్‌ రూట్స్‌ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. అయితే, తొమ్మిది రైళ్లలో మూడు మార్గాలు ముంబయి – కొల్హాపూర్‌, ముంబయి – జాల్నా, పుణే – సికింద్రాబాద్‌ మధ్య నడిచే అవకాశాలున్నాయని తెలుస్తున్నది. ఆయా మార్గాలో నడుపనున్న రైళ్లతో ఆయా ప్రాంతాల మధ్య కనెక్టివిటీని భారీగా పెంచుతుందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మిగతా రైళ్లను ఏయే మార్గాల్లో నడుపబోతున్నారనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.


ఇదిలా ఉండగా.. త్వరలోనే జార్ఖండ్‌లోని టాటానగర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మధ్య సెమీ హైస్పీడ్‌ రైలు అందుబాటులోకి రానున్నది. ఈ రైలు వందేభారత్‌ సిరీస్‌లో 35వ రైలు అని, త్వరలో అందుబాటులోకి వచ్చే ఈ రైలు వారణాసిని కలుపుతూ వేసిన రెండో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ కానుండడం విశేషం. ప్రస్తుతం న్యూఢిల్లీ – వారణాసి మధ్య తొలి రైలు నడుస్తుండగా.. దేశంలో 34 సెమీ హైస్పీడ్‌ రైళ్లు వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి.


అయితే, కొత్త రైలును దసరా పండుగకు ముందే ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ రైలుకు టాటానగర్, పురూలియా, బొకారో సిటీ, గయా, పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, వారణాసి స్టేషన్లలో ఆగనున్నది. టాటానగర్ జంక్షన్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి.. 7.50 గంటల్లో 574 కిలోమీటర్లు దూరంలో ఉన్న వారణానికి మధ్యాహ్నం 1.50 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 2.35 గంటలకు బయలుదేరి.. రాత్రి 10 గంటలకు టాటానగర్‌ చేరుకుంటుందని రైల్వేశాఖ వర్గాలు వివరించాయి.