విధాత : ప్రసిద్ధ కన్నడ నవలా రచయిత, తత్వవేత్త, సినీ రచయిత ఎస్ ఎల్. భైరప్ప బుధవారం బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. ఆయనకు 94 సంవత్సరాలు. ఎస్ ఎల్. భైరప్పగా ప్రసిద్ధి చెందిన శాంతశివర లింగన్నయ్య ఆగస్టు 20, 1931న కర్ణాటకలోని హసన్‌లో జన్మించారు. ఆయన 25 సంవత్సరాలకు పైగా కన్నడ భాషలో అనేక రచనలు చేశారు. ఆయన రచనలు హిందీ, ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. ఆయన కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, పద్శశ్రీ, పద్మ భూషణ్, సరస్వతి సమ్మాన్ వంటి పురస్కారాలు అందుకున్నారు.
ఎస్ఎల్. భైరప్ప మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఎస్ ఎల్. భైరప్ప మరణంతో, మన మనస్సాక్షిని కదిలించిన, భారతదేశ ఆత్మలోకి లోతుగా వెళ్ళిన ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం కోల్పోయామమన్నారు. కాలాలకు అతీతంగా..నిర్భయమైన తన ఆలోచనాత్మక రచనలతో కన్నడ సాహిత్యాన్ని ఎంతో సుసంపన్నం చేశారని కొనియాడారు. ఆయన రచనలు తరతరాలుగా సమాజాన్ని ప్రతిబింబించడానికి, ప్రశ్నించడానికి ప్రేరణగా నిలుస్తాయన్నారు. మన చరిత్ర, సంస్కృతి పట్ల ఆయనకున్న అచంచలమైన మక్కువ రాబోయే సంవత్సరాల్లో మనస్సులను ప్రేరేపిస్తూనే ఉంటుందన్నారు.