ఇంత దిగజారుడు ప్రధానిని చూడలేదు : మన్మోహన్‌సింగ్
ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ద్వారా, ఉపన్యాసాల గౌరవాన్ని, ప్రధాని కార్యాలయం ప్రతిష్ఠను నరేంద్రమోదీ దిగజార్చారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విమర్శించారు.

గతంలో ఎవరూ ఇంతటి విద్వేష ప్రసంగాలు చేయలేదు
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం ద్వారా, ఉపన్యాసాల గౌరవాన్ని, ప్రధాని కార్యాలయం ప్రతిష్ఠను నరేంద్రమోదీ దిగజార్చారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విమర్శించారు. జూన్ 1న జరుగనున్న ఏడో దశ పోలింగ్ నేపథ్యంలో పంజాబ్ ఓటర్లను ఉదేశించి ఆయన ఒక సందేశం విడుదల చేశారు. మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మన్మోహన్.. ‘ఎన్నికల ప్రచారంలో ఉపన్యాసాలను నేను నిశితంగా పరిశీలిస్తున్నాను. అత్యంత దుర్మార్గమైన విద్వేషపూరిత ప్రసంగాలను మోదీ చేస్తున్నారు. అవన్నీ పూర్తిగా విచ్ఛిన్నకరమైనవే.
ప్రజా ఉపన్యాసాల గౌరవాన్ని, ప్రధాని కార్యాలయ ప్రాముఖ్యాన్ని ఇంతగా దిగజార్చిన తొలి ప్రధాని మోదీ. సమాజంలోని నిర్దిష్ట సెక్షన్లు లేదా ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని గతంలో ఏ ప్రధాన మంత్రి కూడా ఇంతటి విద్వేషపూరిత ప్రసంగాలు, అప్రజాస్వామిక, ముతక మాటలు మాట్లాడలేదు. నాకు కూడా కొన్ని తప్పుడు ప్రకటనలు ఆపాదించారు. నా జీవితంలో నేను ఎన్నడూ ఒక సమాజం నుంచి మరో సమాజాన్ని వేరు చేసి చూడలేదు. అది పూర్తిగా బీజేపీకి ఉన్న కాపీరైట్’ అని మన్మోహన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇవన్నీ దేశ ప్రజలు గమనిస్తున్నారని మన్మోహన్ అన్నారు. ‘ఈ తరహా అమానవీయత ఉచ్ఛస్థితికి చేరుకున్నది.
మన ప్రియమైన దేశాన్ని ఇటువంటి విధ్వసంకర శక్తుల నుంచి కాపాడుకునే బాధ్యత ఇప్పుడు మనదే’ అని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం భద్రంగా ఉండే వృద్ధి ఆధారిత ప్రగతిశీల భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన చెప్పారు. సాయుధ దళాలకు సంబంధించి పనికిమాలిన అగ్నివీర్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన తప్పుపట్టారు. దేశభక్తి, సాహసం, సేవల విలువ నాలుగేళ్లు మాత్రమేనని బీజేపీ భావిస్తున్నదని మండిపడ్డారు.
ప్రచారం తొలి నుంచీ నోటికొచ్చిన మాటలే!
వికసిత్ భారత్ అని చెప్పుకొన్న ప్రధాని మోదీ.. తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచే అంశాలు, రాముడి గుడి, 370 ఆర్టికల్ రద్దు తదితర అంశాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే ఎన్నికల సంఘం విద్వేష ప్రసంగాలకు పాల్పడవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. కానీ.. మోదీ యథేచ్ఛగా దానిని ఉల్లంఘిస్తూ పోతూ ఉంటే.. చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది.
మధ్యలో కాంగ్రెస్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా ప్రధాని కార్యాలయానికి నోటీసులు పంపకుండా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి పంపి చేతులు దులుపుకొనడంతోనే ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ప్రాత్ర పోషిస్తున్నదో.. పోషించనున్నదో ప్రజలకు అర్థమైపోయింది. మంగళ సూత్రాలు గుంజుకుపోతారు.. అధిక సంతానం ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచిపెడతారు.. అనే వ్యాఖ్యలు మొదలు.. మీ ఆస్తిని లాగేసుకుంటారు.. మీ ఇళ్లను స్కాన్ చేస్తారు.. మీ పోపుల డబ్బాలు వెతుకుతారు.. అంటూ అనేక వివాదాస్పద, విద్వేషపూరిత, అర్థరహిత వ్యాఖ్యలు చేసినా.. ఈసీ కంటికి అవి కనిపించనే లేదు.