ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్‌ల హ్యాకింగ్‌!

ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్‌ల హ్యాకింగ్‌!
  • ప్ర‌యత్నాలు జ‌రిగాయ‌న్న‌ ఆపిల్‌
  • ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు ఉన్నవారిప‌నేన‌ని వెల్ల‌డి
  • ప‌లువురు ఆపిల్ యూజ‌ర్ల‌కు సందేశాలు
  • హ్యాక‌ర్ల వెనుక ఏ ప్ర‌భుత్వ‌మో చెప్ప‌లేమ‌ని వెల్ల‌డి
  • మెసేజ్ వ‌చ్చిన‌వారిలో రేవంత్‌, కేటీఆర్ కూడా!
  • ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించ‌డానికే ఈ చ‌ర్య‌లు
  • కేంద్రంపై మండిప‌డిన రాహుల్‌గాంధీ



న్యూఢిల్లీ : మ‌రికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు, మ‌రుస‌టి ఏడాది లోక్‌స‌భ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో మ‌రోమారు మొబైల్‌ ఫోన్‌ల హ్యాకింగ్ ఉదంతం దేశంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఫోన్‌ల‌ను హ్యాక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని ప‌లువురు ఎంపీలు, కీల‌క నాయ‌కుల ఫోన్‌ల‌కు ఆపిల్ సంస్థ మెసేజ్‌లు పంపించ‌డంతో గ‌గ్గోలు రేగింది. ‘మీపైన ప్ర‌భుత్వ వ‌ర్గాల మ‌ద్ద‌తు ఉన్న హ్యాక‌ర్ల‌ నుంచి మీ మొబైల్‌ను హ్యాక్ చేసేందుకు ప్ర‌య‌త్నం జ‌రిగింది’ అని ఆ సందేశం పేర్కొన్న‌ది. ‘


మీరు, మీ హోదా కార‌ణంగా హ్యాక‌ర్లు మిమ్ముల‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసే అవ‌కాశం ఉన్న‌ది. ప్ర‌భుత్వ ప్రాయోజిత హ్యాక‌ర్లు వేరే ప్రాంతం నుంచి మీ ఫోన్‌లోకి చొర‌బ‌డి, మీ సున్నిత‌మైన వివ‌రాల‌ను, క‌మ్యూనికేష‌న్ల‌ను కొల్ల‌గొట్టే ప్ర‌మాదం ఉన్న‌ది. ఆఖ‌రుకు కెమెరా, మైక్రోఫోన్‌ను కూడా వారు యాక్సెస్ చేసే అవ‌కాశం ఉన్న‌ది’ అని తెలిపింది. ఇది త‌ప్పుడు హెచ్చ‌రిక కూడా అయి ఉండ‌వ‌చ్చ‌ని, కానీ.. ఈ హెచ్చ‌రిక‌ను తీవ్రంగానే ప‌రిగ‌ణించాల‌ని సూచించింది.


అయితే.. నిర్దిష్టంగా ఫ‌లానా ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుదారుల‌ని తాము పేర్కొన‌లేమ‌ని తెలిపింది. ఈ సందేశం అందుకున్న‌వారిలో రాహుల్‌గాంధీ కార్యాల‌యంలో ప‌నిచేసే అనేక‌మందితోపాటు.. ది వైర్ సంపాద‌కుడు సిద్ధార్థ వ‌ర‌ద‌రాజ‌న్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌, తెలంగాణ మంత్రి కేటీ రామారావు, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి త‌దిత‌రులు ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. వీరంతా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని తీవ్రంగా విమ‌ర్శించేవారే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు మండిప‌డ్డాయి. మోదీ ప్ర‌భుత్వం త‌మ ఫోన్‌ల‌ను హ్యాక్ చేసేందుకు ప్ర‌య‌త్నించిందంటూ ప‌లువురు ఎంపీలు గురువారం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటి హ్యాకింగ్ వ్య‌వ‌హారాల‌తో దేశంలో ఉన్న స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని విమ‌ర్శించారు. ‘నా కార్యాల‌యంలో చాలా మంది సిబ్బందికి ఆపిల్ నుంచి ఈ అల‌ర్ట్ మెసేజ్ వ‌చ్చింది. కేసీ వేణుగోపాల్‌, సుప్రియా సూలే, ప‌వ‌న్ ఖేడా త‌దితరులూ ఈ అల‌ర్ట్‌ను అందుకున్నారు’ అని రాహుల్ పేర్కొన్నారు. వారికి (బీజేపీ) ఏది కావాలంటే అది చేసుకోవ‌చ్చ‌ని త‌న‌కు ఎలాంటి భ‌యం లేద‌ని ఆయ‌న స‌వాలు చేశారు.


తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మొయిత్రా మాట్లాడుతూ స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్‌, ఆమ్ ఆద్మీ పార్టీ నాయ‌కుడు రాఘ‌వ్ చ‌ద్దా, సీపీఎం జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీతారాం ఏచూరిల‌కు ఈ అల‌ర్ట్ వ‌చ్చింద‌ని తెలిపారు. ‘ఎవ‌రో తెలిసింది. సిగ్గు ప‌డాల్సిందే’ అంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ శివ‌సేన నాయ‌కురాలు ప్రియాంక చ‌తుర్వేది ఎక్స్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ కూడా ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. ‘నా లాంటి వాళ్ల‌ నుంచి వ‌చ్చే ప‌న్నుల‌ను, స‌మర్థులైన అధికారుల‌ను ఇలాంటి ప‌నుల‌కే ఉప‌యోగించాలా? ఇంత కంటే ప‌నులేమీ లేవా? అని ఎక్స్‌లో ప్ర‌శ్నించారు. దీనిపై ప్ర‌తి భార‌తీయుడూ దిగులు చెందాల్సిందే. ఎందుకంటే ఈ రోజు నేను.. రేపు మీరే కావొచ్చు’ అంటూ వ్యాఖ్యానించారు.

ఆపిల్ ఏమంది?


భార‌త్‌లో జ‌రుగుతున్న ఈ వ్య‌వ‌హారంపై ఆపిల్ వివ‌ర‌ణ ఇచ్చింది. తమ మొబైల్స్ ఇచ్చిన అల‌ర్ట్ సందేశం ప్ర‌కారం.. అది ఏ ప్ర‌భుత్వం అనేది చెప్ప‌లేమ‌ని తెలిపింది. భార‌త ప్ర‌భుత్వమే హ్యాకింగ్ చేస్తోంద‌న్న ఎంపీల విమ‌ర్శ‌ల‌ను అది కొట్టిప‌డేసింది. వారికి వ‌చ్చిన మెసేజ్‌కు అర్థం అది కాద‌ని తెలిపింది. ఇలాంటి అల‌ర్ట్ మెసేజ్‌లు.. థ్రెట్ ఇంటెలిజెన్స్ సిగ్న‌ల్స్ ఆధారంగా వ‌స్తాయని పేర్కొంది. అయితే థ్రెట్ ఇంటెలిజెన్స్ సిగ్న‌ల్స్ అసంపూర్ణ‌మైన‌వ‌ని, అస్ప‌ష్ట‌మైన‌వ‌ని స్ప‌ష్టం చేసింది. కాబ‌ట్టి ఆ అల‌ర్టులు.. త‌ప్పుడు హెచ్చ‌రిక‌లు కూడా కావొచ్చ‌ని సూచించింది. అయితే తాజా ఘ‌ట‌న‌లో ఇలా ఎందుకు మెసేజ్‌లు వ‌చ్చాయ‌న్న అంశాన్ని తాము చెప్ప‌బోమ‌ని.. ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తే హ్యాక‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపింది.


అల్ట‌ర్ అందుకున్న‌వారిలో..


1. మహువా మోయిత్రా (తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ)

2. ప్రియాంక చతుర్వేది (శివసేన (ఉద్ధ‌వ్‌) ఎంపీ)

3. రాఘవ్ చద్దా (ఆప్ ఎంపీ)

4. శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ)

5. అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం ఎంపీ)

6. సీతారాం ఏచూరి (సీపీఎం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ)

7. పవన్ ఖేరా (కాంగ్రెస్ అధికార ప్రతినిధి)

8. అఖిలేశ్‌ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు)

9. సిద్ధార్థ్ వరదరాజన్ (వ్యవస్థాపక సంపాదకుడు, ది వైర్)

10. శ్రీరామ్ కర్రి (రెసిడెంట్ ఎడిటర్, డెక్కన్ క్రానికల్)

11. సమీర్ శ‌ర‌ణ్‌ (ప్రెసిడెంట్, అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్)

12. రేవతి (స్వతంత్ర జర్నలిస్టు)

13. కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్ ఎంపీ)

14. సుప్రియా శ్రీనాటే (కాంగ్రెస్ అధికార ప్రతినిధి)

15. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయంలో పనిచేసే అనేక మంది వ్యక్తులు

16. రేవంత్ రెడ్డి (కాంగ్రెస్ ఎంపీ)

17. టీఎస్. సింగ్‌డియో (ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత‌)

18. రవి నాయర్ (జర్నలిస్ట్, ఓసీసీఆర్పీ)

19. కేటీ రామారావు (తెలంగాణ మంత్రి, బీఆరెస్ నేత‌)

20. ఆనంద్ మంగ్నాలే (రీజిన‌ల్ ఎడిట‌ర్‌, దక్షిణాసియా, ఓసీసీఆర్పీ)


ఈ ఉదంతంపై కేంద్ర ప్ర‌భుత్వం స్పందించింది. ఎంపీల‌కు వ‌చ్చిన అల‌ర్ట్ నోటిఫికేష‌న్ల‌పై విచార‌ణ జ‌రుపుతామ‌ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ఆపిల్ మెసేజ్‌లో నిర్దిష్ట‌త లేద‌ని అన్నారు. అస‌లు ఆపిల్ ఫోన్లు సుర‌క్షిత‌మైన‌వేనా? అని ప్ర‌శ్నించారు. త‌మ విచార‌ణ‌లో ఆపిల్ సంస్థ కూడా భాగ‌స్వామి కావాల‌ని కోరారు.