మంటగలిసిన ప్రజాస్వామ్యం!

పార్లమెంటులో అసాధారణ చర్యకు అధికార బీజేపీ పాల్పడింది. ప్రజాస్వామ్య దేవాలయంగా భాసిల్లాల్సిన పార్లమెంటు ఉభయసభల్లో అప్రజాస్వామిక క్రీడకు తెర తీసింది. ప్రశ్నించడాన్ని సహించలేని సర్కారు

మంటగలిసిన ప్రజాస్వామ్యం!

– ఉభయ సభల నుంచి 78 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌

– పార్లమెంటు చరిత్రలోనూ మునుపెన్నడూ లేని సందర్భం

– భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటనకు విపక్షం పట్టు

– ఇదే అంశంపై సభల్లో వివరణాత్మక చర్చకు డిమాండ్‌

– వరుసపెట్టి సస్పెండ్‌ చేయించిన కేంద్ర ప్రభుత్వం

– ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనన్న విపక్షాలు

– బీజేపీ పాలనలో తీవ్ర స్థాయికి చేరిన నియంతృత్వం

– పార్లమెంటుకు ప్రధాని, హోం మంత్రి జవాబుదారీ కాదా?

– మోదీ-షాపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం


న్యూఢిల్లీ : పార్లమెంటులో అసాధారణ చర్యకు అధికార బీజేపీ పాల్పడింది. ప్రజాస్వామ్య దేవాలయంగా భాసిల్లాల్సిన పార్లమెంటు ఉభయసభల్లో అప్రజాస్వామిక క్రీడకు తెర తీసింది. ప్రశ్నించడాన్ని సహించలేని సర్కారు.. యథేచ్ఛగా సస్పెన్షన్ల పర్వానికి తెరలేపింది. సోమవారం ఒక్కరోజే ఉభయ సభల నుంచి 78 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేసి.. ప్రశ్నలకు ఇక్కడ చోటు లేదని చాటింది. ఇందులో లోక్‌సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది ఉన్నారు.


వీటితో కలుపుకొని గత కొద్ది రోజులుగా సస్పెండ్‌ అయిన వారి సంఖ్య దాదాపు 90కి చేరుకున్నది. డిసెంబర్‌ 13న ఇద్దరు యువకులు లోక్‌సభలో చొరబడి పసుపు రంగు పొగలు వెదజల్లి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే పార్లమెంటులోకి పొగ డబ్బాలతో సాధారణ యువకులే ప్రవేశిస్తే ఇక ఉగ్రవాదుల సంగతేంటన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో పాసులు జారీ చేసిన బీజేపీ ఎంపీపైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.


ఇదే ప్రతిపక్ష ఎంపీ తరఫున పాసులు పొంది ఉంటే.. ఈపాటికి బీజేపీ సర్కారు రచ్చరచ్చ చేసి ఉండేదని, ఇండియా కూటమికి ఉగ్రవాదులతో సంబంధాలు కలిపివేసేదని పలువురు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా సభకు వచ్చి సమగ్ర ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిని సహించలేని అధికార పార్టీ.. ఏకంగా ఒకే రోజు 78 మంది సభ్యులను సస్పెండ్‌ చేస్తూ దుస్సాహసానికి పాల్పడిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

64 మందిపై సమావేశాలు ముగిసేంత వరకూ

క్రమశిక్షణ చర్యలకు గురైనవారిలో 64 మందిని శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్‌ చేశారు. సీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 22 వరకూ కొనసాగనున్నాయి. మిగిలినవారిపై సభా హక్కుల కమిటీ నిర్ణయం మేరకు వ్యవహరించనున్నారు. భద్రతా వైఫల్యంపై లోక్‌సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేసినందుకు కాంగ్రెస్‌ సభ్యులు అధీర్‌రంజన్‌ చౌదరి, టీఆర్‌ బాలు, సౌగతరాయ్‌ను సస్పెండ్‌ చేశారు. మరోవైపు రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేశ్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ తదితరులను ఇదే కారణాలతో సస్పెండ్‌ చేశారు.



 


సమర్థించుకున్న అధికారపక్షం

మునుపెన్నడూ లేని విధంగా ఇంత మంది సభ్యులను సస్పెండ్‌ చేయడాన్ని అధికార పక్షం గట్టిగా సమర్థించుకున్నది. కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల సభ్యులు తమ ప్రవర్తన ద్వారా లోక్‌సభ స్పీకర్‌ను, రాజ్యసభ చైర్మన్‌ను అవమానించారని రాజ్యసభ నాయకుడు పీయూశ్‌ గోయల్‌ విమర్శించారు. గతవారం కూడా లోక్‌సభ నుంచి 13 మందిని, రాజ్యసభ నుంచి ఒకరిని.. మొత్తం 14 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా 90 మందికిపైగా ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్‌ చేసినట్టయింది.

పార్లమెంటు మొదలైనప్పటి నుంచీ గందరగోళమే

ఉదయం పార్లమెంటు ప్రారంభమైనప్పటి నుంచే ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంటులో భద్రతావైఫల్యంపై పలువురు ప్రతిపక్ష సభ్యలు నిరసనలు వ్యక్తం చేస్తుండగానే ఉభయ సభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు అధికారపక్షం ప్రయత్నించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్పీకర్‌ ఆదేశాల మేరకు సభ్యుల సస్పెన్షన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. అనంతరం కూడా ప్రతిపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. అనంతరం రాజ్యసభలోనూ ఇదే తరహా తీర్మానం ఆమోదించారు.

తేలిగ్గా తీసుకున్న అధికారపక్షం

పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. గతంలోనూ ఇటువంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయంటున్న అధికార బీజేపీ.. దీన్ని చాలా చిన్న విషయంగా కొట్టిపారేస్తున్నది. పార్లమెంటు భద్రతను లోక్‌సభ సెక్రటేరియట్‌ చూస్తున్నదని, స్పీకర్‌ ఆదేశాలను పాటిస్తున్నదని చెబుతున్నది. కానీ.. ప్రతిపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నది. అయితే.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా దీనిపై సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. కొందరైతే వారిద్దరూ రాజీనామా చేయాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. మణిపూర్‌ మండిపోతుంటేనే సభకు వచ్చి ప్రకటన చేసేందుకు ఇష్టపడని మోదీ.. దీనిపై సభలో స్పందించే అవకాశాలపై చర్చ జరుగుతున్నది.

ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు

ఎంపీల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. నియంతృత్వం తీవ్రస్థాయికి చేరుకున్నదని విమర్శించింది. ముఖ్యమైన బిల్లులపై చర్చ లేకుండానే బుల్డోజ్‌ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మండిపడింది. ప్రస్తుత ప్రధాని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన గుజరాత్‌ అసెంబ్లీని ప్రస్తావిస్తూ.. గుజరాత్‌ అసెంబ్లీకి పొడిగింపుగా లోక్‌సభ మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మొదట చొరబాటుదారులు పార్లమెంటుపై దాడి చేశారు. ఆ తర్వాత మోదీ పార్లమెంటుపైనా, ప్రజాస్వామ్యంపైనా దాడి చేశారు’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. కేంద్రంలోని నియంతృత్వ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామిక విలువలను చెత్తబుట్టలో పడేసిందని ఖర్గే సస్పెన్షన్ల అనంతరం మండిపడ్డారు.


పార్లమెంటు పట్ల కనీస జవాబుదారీతనంతో కూడా కేంద్ర ప్రభుత్వం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భారీ డిమాండ్లు ఏమీ చేయలేదని, కేవలం భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటనను, ఇదే అంశంపై వివరణాత్మక చర్చను చేపట్టాలని మాత్రమే కోరామని ఆయన పేర్కొన్నారు. వార్తా పత్రికలకు మోదీ ఇంటర్వ్యూలు ఇస్తారని, అమిత్‌షా టీవీ చానళ్ల వద్దకు వెళతారని చెప్పిన ఖర్గే.. ప్రజలు ప్రాతినిథ్యం వహించే పార్లమెంటుకు మాత్రం వీళ్లు జావాబుదారీగా ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

M-మర్డర్‌ O-ఆఫ్‌ D-డెమోక్రసీ ఇన్‌ I- ఇండియా: జైరాం రమేశ్‌

‘లోక్‌సభలోనే కాదు.. రాజ్యసభలోనూ రక్తపాతం సాగింది. డిసెంబర్‌ 13 నాటి భద్రతా వైఫల్యంపై హోం మంత్రి నుంచి స్టేట్‌మెంట్‌ డిమాండ్‌ చేసినందుకు, ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరినందుకు ఇండియా కూటమి సభ్యులను సస్పెండ్‌ చేశారు’ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది ‘మర్డర్‌ (M) ఆఫ్‌ (O) డెమోక్రసీ (D) ఇన్‌ ఇండియా(I)’ అని అభివర్ణించారు.

ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే : సీపీఐ నేత సంతోష్‌కుమార్‌

ప్రజాస్వామ్యానికి ఇవాళ చీకటిదినమని సీపీఐ నాయకుడు పీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. భారత పార్లమెంటు చరిత్రలోనే ఇటువంటి ఉదంతం లేదని చెప్పారు. ఇవాల్టి ప్రజాస్వామిక చీకటి కాలంలో సస్పెన్షన్‌ అనేది ఒక గౌరవ హోదా. ఎందుకంటే? మేం హోం మంత్రి నుంచి అధికారికంగా స్టేట్‌మెంట్‌ కోరుతున్నాం’ అని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ ఝా వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం గొంతు నొక్కాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ విమర్శించారు. ఈ విషయాన్ని తాము మంగళవారం జరిగే ఇండియా కూటమి పక్షాల సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఈ ఘటనతో ఇండియా కూటమి సభ్యులు మరింత దగ్గరయ్యారని వ్యాఖ్యానించారు.

1989లో చివరిసారిగా 63 మంది ఎంపీల సస్పెన్షన్‌

ఇంతమందిని సభ నుంచి సస్పెండ్‌ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి అయినప్పటికీ.. అంతకాకున్నా.. 63 మందిని రాజీవ్‌గాంధీ హయాలో 1989లో లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ సమయంలో టక్కర్‌ కమిషన్‌పై చర్చల సందర్భంగా ఈ చర్య తీసుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యపై జస్టిస్‌ ఎంపీ ఠక్కర్‌ విచారణ కమిషన్‌ నివేదికను బయటపెట్టాలంటూ మూడు రోజులపాటు ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేయగా.. మార్చి 15న 63 మందిని సస్పెండ్‌ చేశారు.