రాష్ట్రాల నిధుల్లో కోతపెట్టేందుకు మోదీ రహస్య ప్రయత్నం!

2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో గణనీయంగా కోత పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని తెలుస్తున్నది.

రాష్ట్రాల నిధుల్లో కోతపెట్టేందుకు మోదీ రహస్య ప్రయత్నం!
  • అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాల వనరులపై కత్తి
  • వ్యతిరేకించిన నాటి ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ వైవీ రెడ్డి
  • దాంతో తొలి బడ్జెట్‌లోనే సంక్షేమ పథకాల నిధుల్లో కోత
  • ఇష్టారాజ్యంగా సెస్సులు, సర్‌చార్జీలు విధించిన కేంద్రం
  • జీఎస్టీ తర్వాత అనేక రాష్ట్రాలకు తగ్గిన సొంత రాబడులు
  • ఓ సెమినార్‌లో గుట్టు బయటపెట్టిన నీతి ఆయోగ్‌ చైర్మన్‌
  • పీఎంవోను వివరణ కోరితే.. సదరు వీడియో డిలీట్‌
  • అల్‌జజీరా వెబ్‌సైట్‌ సంచలన కథనం

న్యూఢిల్లీ: 2014లో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాలకు కేటాయించే నిధుల్లో గణనీయంగా కోత పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని తెలుస్తున్నది. ఈ విషయమై ఫైనాన్స్‌ కమిషన్‌తో రహస్యమంతనాలు జరిపారని, కానీ అవి విఫలమయ్యాయని తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను నిర్ణయించే రాజ్యాంగయుతమైన స్వతంత్ర సంస్థ అయిన ఫైనాన్స్‌ కమిషన్‌ అధిపతి అందుకు నిరాకరించారని తెలిసింది. దీంతో విధిలేక ఆ ప్రయత్నాన్ని మోదీ విరమించుకున్నారని సమాచారం. ఫైనాన్స్‌ కమిషన్‌ గట్టిగా నిలబడటంతో కేంద్ర నిధులను నిలుపుకొనే అవకాశం లేదని తేలిన మోదీ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో 48 గంటల్లోనే మార్పులు చేపట్టి.. సంక్షేమ పథకాలకు భారీగా నిధుల్లో కోత పెట్టారని తెలియవచ్చింది. ఈ మేరకు అల్‌జజీరా వార్తా సంస్థ ఒక సంచనల కథనాన్ని వెలువరించింది. పైగా.. రాష్ట్రాలకు పన్నులో వాటాలపై ఫైనాన్స్‌ కమిషన్‌ చేసిన ప్రతిపాదనలను తాను స్వాగతించానని మోదీ పార్లమెంటులో తప్పుడు ప్రకటన చేశారని ఆ కథనం తెలిపింది.


అనుసంధాన కర్తగా సుబ్రమణ్యం

ఆనాటి తెర వెనుక ప్రయత్నాలకు మోదీ ప్రభుత్వానికి, అప్పటి ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ వైవీ రెడ్డికి మధ్య అనుసంధాన కర్తగా నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం ఉన్నారని అల్‌ జజీరా కథనం పేర్కొన్నది. ప్రభుత్వం తరఫున బీవీఆర్‌ సుబ్రమణ్యం తెరవెనుక సంప్రదింపులు జరిపారని తెలిపింది. రాష్ట్రాల ఆర్థిక వనరులను పిండివేసేందుకు ప్రధాన మంత్రి, ఆయన బృందం మొదటి నుంచీ ప్రయత్నించిందని కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలోని ఉన్నతాధికారి ధృవీకరించడం ఇదే మొదటిసారని అల్‌జజీరా తెలిపింది. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందడం లేదని మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ప్యానెలిస్టుగా పాల్గొన్న సందర్భంగా ఈ అంశాలను సుబ్రమణ్యం వెల్లడించారని తెలిపింది. ప్రభుత్వేతర మేధో సంస్థ సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనమిక్‌ ప్రోగ్రెస్‌ ఈ సెమినార్‌ను నిర్వహించింది. అనేక బడ్జెట్‌లలో వాస్తవాలను తొక్కిపట్టేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా ఆయన ఈ సెమినార్‌లో బయటపెట్టారు. ఈ అంశాలను వెలుగులోకి తేవాలంటే హిండెన్‌బర్గ్‌ లాంటి సంస్థ అవసరమని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఖాతాలన్నీ పారదర్శకంగా ఉంటే.. ప్రభుత్వ విత్త పరిస్థితులను బయటపెట్టేందుకు వీలుంటుందని, అది జరగాలంటే అదానీ గ్రూపు విషయంలో జరిగినట్టే హిండెన్‌బర్గ్‌ లాంటి సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. సుబ్రమణ్యం చెప్పిన అంశాలను దశాబ్దకాలం క్రితం పత్రాలను తనిఖీ చేయడం ద్వారా ‘ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ సంస్థ ధృవీకరించిందని అల్‌జజీరా తన కథనంలో వెల్లడించింది. ఒక దశలో ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపైనా ఆయన వివరాలు బయటపెట్టడం విశేషం. పైగా వీటన్నింటినీ ‘ఫన్నీ కేస్‌’ అంటూ తేల్చేయడం గమనార్హం.

మరుగునపడిపోయి.. మాయమైన వీడియో

నిజానికి పతాక శీర్షికలకెక్కి, దేశంలో రాజకీయ దుమారం రేపగల ఈ అంశాలు ఉన్న యూట్యూబ్‌ వీడియో మరుగున పడి ఉండటం, ఈ వ్యాసాన్ని అల్‌జజీరా ప్రచురించే సమయానికి 500 వ్యూస్‌ మాత్రమే కలిగి ఉండటం విశేషం. విచిత్రం ఏమిటంటే.. ఈ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయాన్ని రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ వివరాలు కోరుతూ సంప్రదించగా.. ఆ వెంటనే సీఎస్‌ఈపీ యూట్యూబ్‌ చానల్‌లో సదరు వీడియో మటుమాయం అయిపోయింది. బీవీఆర్‌ సుబ్రమణ్యం, ఆర్థిక శాఖ, పీఎంవో సైతం ఈ విషయంలో స్పందించేందుకు నిరాకరించాయని అల్‌జజీరా కథనం తెలిపింది. వివిధ రంగాలకు చెందిన ఆర్థికవేత్తలు, పబ్లిక్‌ ఫైనాన్స్‌ నిపుణులతో కూడిన స్వతంత్ర సంస్థ అయిన ఫైనాన్స్‌ కమిషన్‌.. కేంద్రం సెస్‌, సర్‌ చార్జీలు మినహా వసూలు చేసే పన్నుల నుంచి ఏయే రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలో నిర్ణయిస్తుంది. ఈ సంస్థ రాజ్యాంగం ప్రకారం ఏర్పడింది.


ఆనాడు 50శాతం కోరి.. అధికారంలోకి రాగానే 33శాతానికి పరిమితం చేయాలని..

14వ ఆర్థిక సంఘం 2013లో ఏర్పడింది. ఆ సమయంలో నరేంద్రమోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధాని మంత్రి పదవి కోసం ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం వాటా ఇవ్వాలని ఆనాడు మోదీ ఆర్థిక సంఘాన్ని డిమాండ్‌ చేశారు. 2014 డిసెంబర్‌లో ఆర్థిక సంఘం సమర్పించిన నివేదికలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 42శాతం వాటా ఇవ్వాలని ప్రతిపాదించింది. అది గతంలో 32 శాతంగా ఉంటే.. పది శాతం పెంపుదలను ప్రతిపాదించింది. కానీ.. మోదీ ప్రధాని అయిన తర్వాత కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 33శాతానికంటే తక్కువగా ఉంచేందుకు, కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ వాటా ఉండేందుకు ప్రయత్నించారని అల్‌జజీరా కథనం పేర్కొన్నది.

అవకాశం లేకపోయినా ఆర్థిక సంఘంతో బేరసారాలు!

రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంఘం చెప్పిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి రెండే రెండు మార్గాలు ఉంటాయి. అందులో ఒకటి ఆర్థిక సంఘం సిఫారసులను ఆమోదించడం లేదా తిరస్కరించి, కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేయడం. ఆర్థిక సంఘంతో వాదించడానికి, చర్చించడానికి, లేదా అధికారికంగా లేదా అనధికారికంగా సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వానికి అవకాశం లేదు. కానీ.. అప్పటి ఆర్థిక సంఘం చైర్మన్‌ వైవీ రెడ్డితో మోదీ ప్రభుత్వం తెరవెను సంప్రదింపులు జరిపినట్టు ఇప్పుడు బయటకు వచ్చింది. రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ కూడా అయిన వైవీరెడ్డి, మోదీ సంప్రదింపుల్లో ఉన్న మూడో వ్యక్తి తానేనని సుబ్రమణ్యం చెప్పడం విశేషం. తాను దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపినా, వైవీరెడ్డి వైఖరి సడలించుకోలేదని సుబ్రమణ్యం తెలిపారు. ‘అప్పా.. వెళ్లి మీ బాస్‌కు చెప్పు.. ఆయనకు మరో మార్గం లేదని’ అని వైవీ రెడ్డి చెప్పారని సుబ్రమణ్యం గుర్తు చేసుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 42 శాతం వాటా ఇచ్చేందుకు ఆమోదించాల్సి వచ్చింది.


పార్లమెంటులో ఇలా..

కానీ.. పార్లమెంటులో మాత్రం ఈ అంశంపై మోదీ 2015 ఫిబ్రవరి 27న మాట్లాడుతూ.. ‘దేశాన్ని బలోపేతం చేయాలంటే ముందుగా రాష్ట్రాలను బలోపేతం చేయాలి. ఆర్థిక సంఘం సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని మేం అవకాశంగా తీసుకోవచ్చు. కానీ మేం చేయలేదు. కానీ.. రాష్ట్రాలు సుసంపన్నమయ్యేందుకు, బలోపేతమయ్యేందుకు మేం కట్టుబడి ఉన్నాం. మేం వాటికి కేంద్ర పన్నుల్లో 42 శాతం ఇచ్చాం’ అని చెప్పారు. అదే సమయంలో మోదీ ఒక వెటకారపు మాట కూడా మాట్లాడారు. ‘ఇంత డబ్బు దాచుకోవడానికి కొన్ని రాష్ట్రాలకు తగిన ఖజానా కూడా లేదు’ అని మోదీ అన్నప్పుడు.. అధికార బీజేపీ సభ్యులు పగలబడి నవ్వేశారు. చప్పట్లు కొట్టారు. ఆ ఏడాది బడ్జెట్‌లో సంక్షేమానికి మోదీ సర్కార్‌ భారీగా కోతలు పెట్టింది. మొత్తం 21వేల కోట్లకుపైగా సంక్షేమ పద్దు ఉంటే.. దాదాపు సగానికి తగ్గించింది. అంతకు ముందు ఏడాదికంటే విద్యారంగానికి 18.4 శాతం నిధులు తగ్గించింది.


సర్‌చార్జీల మోత

రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా తగ్గించే అవకాశాలు లేవని తేలిపోవడంతో మోదీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సెస్సులు, సర్‌చార్జీలు బాదడం మొదలు పెట్టింది. ఈ ధోరణి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఎందుకంటే.. వీటిలో రాష్ట్రాలకు కేంద్రం ఎలాంటి వాటా ఇవ్వనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచేందుకు క్రమంగా సర్‌చార్జీలు, సెస్సులు పెంచుకుంటూ పోయినట్టు సుబ్రమణ్యం తన ఉపన్యాసంలో చెప్పారు. 2015 నుంచి మోదీ ప్రభుత్వం సర్‌చార్జీలు, సెస్సుల ద్వారా వసూలు చేసిన మొత్తాలను గమనిస్తే ఎంత స్థాయిలో ఈ బాదుడు ఉన్నదో అర్థం అవుతుంది. 2015లో 13.49శాతం ఉంటే 2016లో 12.22% ఉన్నది. అక్కడి నుంచి వరుసగా పెరుగుకుంటూ పోయింది. 2017లో 13.47%, 2018లో 13.89%, 2019లో 19.86%, 2020లో 15.56%, 2021లో 20.48%, 2022లో 18.42%, 2023లో 17.37%గా ఉన్నది. అంతకు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011-12లో మొత్తం వసూలు చేసిన కేంద్ర పన్నుల్లో సర్‌చార్జీలు, సెస్సుల వాటా 10.4శాతంగా ఉన్నది. అంటే 2017-18, 2021-22 మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం వసూలు చేసిన సెస్సులు, సర్‌చార్జీలు గతంకంటే రెట్టింపు అయ్యాయి. అంటే.. 2.66 లక్షల కోట్ల రూపాయల నుంచి 4.99 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. వీటిలో ఒక్క పైసా కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం కేంద్రానికి లేకుండా పోయింది. పెట్రోల్‌ డీజిల్‌పై 2018-19 బడ్జెట్‌లో ఎక్సయిజ్‌ డ్యూటీని లీటర్‌కు 9 రూపాయలు తగ్గించామని గొప్పగా చెప్పినా.. అంతే మొత్తంలో రోడ్డు సెస్‌ను పెంచేశారని సెంటర్‌ ఫర్‌ బడ్జెట్‌ అండ్‌ గవర్నెన్స్‌ అకౌంటబిలిటీకి చెందిన ఆర్థిక నిపుణురాలు మాలిని చక్రవర్తి పేర్కొన్నారు.


జీఎస్టీ తర్వాత రాష్ట్రాలకు తగ్గిన ఆదాయం

2023 జనవరిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీలోని పరిశోధనకులు ఒక పత్రం సమర్పించారు. అందులో ఆయా రాష్ట్రాల ఆదాయాలను విశ్లేషించారు. 18 రాష్ట్రాల ఆదాయాలను విశ్లేషిస్తే.. అందులో 17 రాష్ట్రాల సొంత పన్ను ఆదాయాలు జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత గణనీయంగా తగ్గిపోవడాన్ని వారు తమ పత్రంలో పేర్కొన్నారు.