భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్తను అందించింది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను మార్గాల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వీటిలో ధరలు ఎక్కువగా ఉన్నాయని.. సామాన్యులకు అనుకూలంగా లేవనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సామాన్యుల కోసం సాధారణ్ రైళ్లను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ సాధారణ్ రైళ్లకు పుష్‌పుల్‌గా నామకరణం చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రైళ్లు సిద్ధమవుతున్నాయి. సిద్ధమైన ఒక రైలు ఇప్పటికే ముంబయిలోని వాడి బందర్ యార్డ్‌కు చేరుకున్నది.
తేలని ట్రయల్ రన్ రూట్
వారంలోగా ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రైలును ముంబయి – ఢిల్లీ మార్గంలో నడిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే, ముంబయి – నాసిక్ మార్గంలో ట్రయల్ జరిగే అవకాశాలున్నాయని పలునివేదికలు పేర్కొన్నాయి. దీనిపై అధికార వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఈ పుష్‌పుల్ రైళ్లను ఐదుమార్గాల్లో నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి – ఢిల్లీ మధ్య సాధారణ్ రైలు నడువనున్నది. వీటితో పాటు మరో 13 మార్గాల్లో నడిపేందుకు ప్రతిపాదనలు ఉండగా.. ఇందులో హైదరాబాద్ – నాగర్ కోయిల్ రూట్‌లోనూ నడిపేందుకు ప్రతిపాదన ఉన్నది. రైల్వే బోర్డు ఈ ప్రతిపాదనలకు ఆమోదం వేస్తే పేదల రైలు పట్టాలెక్కనున్నది.
వందే భారత్ తరహాలోనే ఫీచర్లు..
వందే సాధారణ్ రైలు ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహాలోనే ఉంటాయి. కాషాయం, నలుపు రంగుల్లో రానున్నాయి. వందేభారత్ తరహాలోనే పుష్‌పుల్ ఇంజిన్లతో నడుస్తున్నాయి. వందేభారత్‌లో ఇంజిన్లు విడివిగా ఉండవు.. రైలులోనే అంతర్భాగంగా ఉంటాయి. సాధారణ్ రైలులో డబ్ల్యూపీ-5 లోకో మోకోవెటివ్‌లను ముందు ఒకటి.. వెనుక ఒకటి అమరుస్తారు.
ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లేదుకు అనువుగా తీర్చిదిద్దారు. ఈ రైళ్లల్లో 22 నాన్ ఏసీ కోచ్‌లుంటాయి. ఇందులో రైలులో 1800 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, ప్రతీ సీట్ వద్ద ఛార్జింగ్ పాయింట్, ఫోల్డింగ్ స్నాక్ టేబుల్స్, లగేజీ ర్యాక్, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలున్నాయి. ఈ రైలు 8.36 నిమిషాల్లో 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 9.2 నిమిషాల్లో 130 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుందని అధికారులు పేర్కొన్నారు.