నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు , రెండు రోజుల పాటు కొత్త ఎంపీల ప్రమాణం … 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక
నేటీ నుంచి 18వ పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాజ్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన కొత్తగా ఎన్నికైన 543మంది ఎంపీలతో ప్రమాణం చేపించనున్నారు

ఇక సభాసమరం!
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
సమాన శక్తులుగా అధికార, విపక్షాలు
వాడిగా వేడిగా చర్చలు జరిగే అవకాశం
రెండు రోజులు కొత్త ఎంపీల ప్రమాణాలు
26వ తేదీన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక
27న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
జూలై 3న ఆర్థిక సర్వే సమర్పించనున్న కేంద్రం
విపక్షం అమ్ములపొదిలో అనేక అంశాలు
నీట్, బెంగాల్ రైలు ప్రమాదం, స్టాక్‌మార్కెట్ వివాదంపై నిలదీసేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: గత పదేండ్లు ఒక ఎత్తు.. ఈ ఐదేండ్లు ఒక ఎత్తు! నాడు అధికార పార్టీదే బలం బలగం! ఇప్పుడు మెజార్టీ లేని అధికార పక్షం.. రెండు ఊతకర్రలపైనే ఆధారం.. మరోవైపు బలపడిన ప్రతిపక్షం! పదేళ్ల తర్వాత మరోసారి దేశ రాజకీయాల్లో సంకీర్ణ యుగం మొదలైంది. తామే భువికధినాథులమని జబ్బలు చరుచుకునే పరిస్థితి అధికారపక్షానికి లేకుండా పోయింది. ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ.. తన భాగస్వామ్యపక్షాలతోనే కాదు.. ప్రతిపక్షంతో కూడా సంయమనంతో వ్యవహరించాల్సిన పరిస్థితి! సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందా? లేక తనదైన దుండుడుకు స్వభావాన్ని కొనసాగిస్తుందా? అనే అంశంలో ఆసక్తి నెలకొన్న వేళ.. సోమవారం నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దానితోపాటే రాజ్యసభ కూడా సమావేశాలు నిర్వహించనున్నది. ప్రొటెం స్పీకర్‌గా ఎంపికైన భర్తృహరి మెహతాబ్‌తో సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం ఆయన పార్లమెంటుకు చేరుకుని.. కొత్తగా ఎన్నికైన 543మంది ఎంపీలతో ప్రమాణం చేయించనున్నారు. తొలి రోజు ప్రధాని నరేంద్ర మోదీ, తర్వాత ప్రతిపక్ష నేత, ప్యానల్ స్పీకర్లు, కేంద్ర మంత్రులు సహా 280మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మంగళవారం తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. రాష్ట్రం పేరు ఆంగ్ల అక్షరంతో మొదలయిన చోట నుంచి సభ్యుల ప్రమాణం ఉంటుంది. చివరిగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శతాబ్దిరాయ్ ప్రమాణం చేస్తారు.
జూన్ 26న స్పీకర్ ఎన్నిక
జూన్ 26న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఏకాభిప్రాయంతో స్పీకర్‌ను ఎన్నుకునేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఓం బిర్లాకే మళ్లీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలంటూ విపక్ష కూటమి, ఎన్డీఏ మిత్రపక్షాలు కోరుతున్నాయి. ప్రతిపక్షానికి లేదా మిత్ర పక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. 2014లోని 16వ లోక్‌సభలో అన్నాడీఎంకే ఎంపీ తంబిదురైకు బీజేపీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చింది. 17వ లోక్ సభలో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవిని ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది. ఈ దఫా బీజేపీకి సంపూర్ణ మెజార్టీ లేని నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. జూలై 3వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నాయి.
27న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి జూన్ 27న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఆ తరువాత, జూలై 3 వ తేదీన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జులై 22 వ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ వేసవిలో లోక్ ఎన్నికలకు ముందు 2024, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధిక సీట్లను కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్క్ చేరలేకపోవడంతో మిత్రపక్షాలకు అనివార్యంగా ఆధారపడాల్సి వచ్చింది. ఇక ఇండియా కూటమికి కూడా ఊహించినదాని కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను కాంగ్రెస్ దక్కించుకుంది. 18వ లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఇక నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని వారు ఎప్పటికప్పుడు నిలదీయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే విపక్ష నేత రాహుల్‌గాంధీ నీట్ అవకతవకలపై విద్యార్థుల తరఫున సభలో గళం విప్పుతానంటూ హామీ ఇచ్చారు. అటు బెంగాల్ రైలు ప్రమాదం, కొత్త నేర చట్టాల అమలు, ఎగ్జిట్ పోల్స్ తర్వాత షేర్ మార్కెట్ పెరిగి, ఫలితాల రోజు పడిపోవడం వంటి అంశాలను ఇండియా కూటమి లేవనెత్తిన పక్షంలో 18వ పార్లమెంటు తొలి సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.