కడుతుండగానే కూలిన 8 కోట్ల బ్రిడ్జి

- యూపీలోని బల్లియాలో ఘటన
- మగాయ్ నదిపై నిర్మిస్తున్న
- 80 మీటర్ల వంతెన భీమ్ విరిగి ఘటన
విధాత: నిర్మాణంలో ఉన్న రూ.8 కోట్ల విలువైన వంతెన కూలిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. కఠారియా-ఫిరోజ్‌పూర్‌లను కలిపేందుకు మాగై నదిపై 80 మీటర్ల పొడవైన వంతెనను సేతు నిగమ్ సంస్థ నిర్మిస్తున్నది. వంతెనలో భాగంగా నిర్మించిన ఒక బీమ్‌కు పగుళ్లు ఏర్పడి విరిగింది.
దాంతో సగం వంతెన నిట్టనిలువునా కూలిపోయింది. ఈ దిగ్భ్రాంతికర ఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా నివేదిక అందజేసేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.
“మాగై నదిపై 8 కోట్ల 15 లక్షల రూపాయలతో 80 మీటర్ల పొడవైన వంతెనను నిర్మిస్తున్నారు. నిన్న బీమ్ విరిగిపోవడంతో వంతెన కూలిపోయింది’’ అని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు. ముగ్గురు సభ్యుల కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వానికి పంపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తంగంజ్ వంతెన జూన్‌లో కూలిపోయింది. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ కోరుతూ పాట్నా హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఆగస్టులో మిజోరాంలోని ఐజ్వాల్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలి 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.