కులగణనపై మోదీ వక్రీకరణ?

కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశ సంపదను చొరబాటుదారులకు, అధిక సంతానం ఉన్నవారికి పంచిపెడుతుందని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగినా.. సోమవారం కూడా మోదీ తగ్గేదే లే అంటూ వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు

  • Publish Date - April 22, 2024 / 08:46 PM IST

‘దర్యాప్తు’ జరుపుతారంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో చెప్పిందేంటి?
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశ సంపదను చొరబాటుదారులకు, అధిక సంతానం ఉన్నవారికి పంచిపెడుతుందని ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగినా.. సోమవారం కూడా మోదీ తగ్గేదే లే అంటూ వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. చొరబాటుదారులు, అధిక సంతానం కలిగినవారు అనే పదాలు ముస్లింలను ఉద్దేశించి చేసినవేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇది విద్వేష ప్రసంగమేనంటూ పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అలీగఢ్‌లో ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ.. ‘ఎవరు ఎంత సంపాదించారు? మీకు ఎంత ఆస్తి ఉంది? మీ వద్ద ఎంత సొమ్ము ఉన్నది? మీకు ఎన్ని ఇళ్లు ఉన్నాయి? అనే అంశాలపై కాంగ్రెస్‌ యువరాజు విచారణ జరుపుతారట. ఆ ఆస్తి మొత్తాన్ని తీసేసుకుని, దాన్ని అందరికీ పంచేస్తామని చెబుతున్నారు. మన తల్లులు, చెల్లెళ్ల వద్ద బంగారం ఉన్నది. అది స్త్రీధనం. అది చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. చట్టం కూడా దానికి రక్షణ కల్పిస్తున్నది. వారి కళ్లు మీ మంగళసూత్రాలపై పడ్డాయి’ అంటూ అటు కుల గణన స్ఫూర్తిని వక్రీకరించడమే కాకుండా, భావోద్వేగాలు రెచ్చగొట్టేలా, ఒక మతం పట్ల విద్వేషం పెంచే విధంగా మాట్లాడారు. ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన కాంగ్రెస్‌.. వాటిపై తాము ప్రధానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. ప్రధాని సమయం ఇస్తే తాను స్వయంగా వచ్చి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రధానికి అర్థమయ్యేలా వివరిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కౌంటరిచ్చారు.

అసలు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ఏం చెప్పింది?
న్యాయ్‌ పత్ర్ర్‌ పేరిట కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. ఇందులో ఎక్కడా సంపదను పంచడం అనే నిర్దిష్ట ప్రసక్తి లేదు. అయితే.. తమను గెలిపిస్తే.. సంపద, ఆదాయం పెరుగుదలలో అసమానతలను తగిన విధానపరమైన మార్పుల ద్వారా పరిష్కరిస్తామని ప్రకటించింది.
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో తొలి అధ్యాయం సమానత పేరుతో ఉంటుంది. ఇందులో కుల వివక్ష అనేది ఒక వాస్తవం అని ప్రస్తావించారు. దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తమ దామాషా ప్రకారం ఉన్నతస్థాయి వృత్తులు, సర్వీసులు, వ్యాపారాలలో చాలా తక్కువ అవకాశాలు పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కులాలు, ఉప కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సామాజిక ఆర్థిక, కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. ఆ వివరాల ఆధారంగా సమర్థ కార్యాచరణ కోసం ఎజెండాను బలోపేతం చేస్తామని పేర్కొన్నది.

మైనార్టీలకు సంబంధించి.. ‘భారతదేశ పూర్తి శక్తిసామర్థ్యాలకు వాస్తవరూపం తీసుకురావాలంటే.. మైనార్టీలకు ఆర్థిక సాధికారత కల్పించడం అవశ్యమైన అడుగు’ అని తెలిపింది. ఈ క్రమంలో వారికి ఎలాంటి వివక్ష లేకుండా సంస్థాగత రుణాలు బ్యాంకులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దానితోపాటు.. విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రభుత్వోద్యోగాలు, పబ్లిక్‌ వర్క్‌ కాంట్రాక్టులు, నైపుణ్యం పెంపుదల, క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాల్లో మైనార్టీలకు ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ప్రజా ఆస్తులపై రాహుల్‌ విచారణ జరుపుతారని మోదీ ఎందుకు అంటున్నారు?
ఈ ఎన్నికల క్యాంపెయిన్‌తోపాటు.. తరచూ కుల గుణన గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నారు. 2024 మార్చి 9న ఆయన ఒక ట్వీట్‌ చేస్తూ.. బీహార్‌లో కులగణ గురించి వివరించారు. ‘ఆ రాష్ట్రంలో 88శాతం మంది దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలవారేనని సర్వేలో తేలింది. దేశ వాస్తవ స్థితిగతులకు బీహార్‌ సర్వేలో వెల్లడైన వివరాలు ఒక చిన్న నిదర్శనం మాత్రమే. దేశంలోని పేద ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో మనకు కనీస అవగాహన కూడా లేదు. అందుకే మేం రెండు చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నాం. కుల గణన, ఆర్థిక స్థితిగతుల బేరీజు. వీటి ఆధారంగా రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని ఎత్తివేస్తాం’ అని వివరించారు. అదే నెలలో 12వ తేదీన మహారాష్ట్రలోని గిరిజనులు అధికంగా నివసించే నందుర్బార్‌ జిల్లాలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే కుటగణన, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ రెండూ విప్లవాత్మక చర్యలని ఆయన పేర్కొన్నారు. వాటిని తమ మ్యానిఫెస్టోలో కూడా చేర్చుతామని రాహుల్‌ స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 6వ తేదీన హైదరాబాద్‌లో పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసే సందర్భంగా కూడా దేశంలో బీసీలు, దళితులు, గిరిజనులు, ఇతర కులాల్లోని పేదలు, వారితోపాటు మైనార్టీల వాటా ఎంతో తెలుసుకుంటామని చెప్పారు. దేశ సంపద ఎవరి చేతుల్లో ఉన్నదో, ఏ వర్గం చేతిలో ఉన్నదో అప్పుడే మనకు తెలుస్తుందన్నారు. దాని తర్వాత మీ హక్కు మేరకు మీకు అందేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆదాయాల్లో అసమానతల గురించి కాంగ్రెస్‌ నేత గతంలోనూ అనేక సందర్భాల్లో మాట్లాడారు. దేశ సంపద మోదీ ప్రభుత్వ హయాంలో అదానీ, అంబానీ గ్రూపుల వంటి కొద్ది మంది చేతిలో ఉన్నదని విమర్శించారు. అయితే.. కులగణన ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌ వ్యాఖ్యలు కానీ, కులగణన, ఆర్థిక సర్వే కానీ.. పేదల స్థితిగతులు తెలుసుకునేందుకు ఉద్దేశించిందే తప్ప.. ఎక్కడా ప్రజల సంపదను లాక్కుంటామన్న భావన లేదని, కానీ.. మోదీ అతి తెలివితో కులగణను విచారణ, ఇన్వెస్టిగేషన్‌ అంటూ వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Latest News