మోదీ ప్రచారంలో 370 సీట్ల ముచ్చట మాయం!

ఆర్టికల్‌ 370 రద్దు చేశాం. జమ్ము కశ్మీర్‌ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించాం. శతాబ్దాల తర్వాత రాముడికి సొంత గుడి కట్టిచ్చాం. కాబట్టి మాకు 370 సీట్లు ఇవ్వాలి

  • Publish Date - April 29, 2024 / 07:16 PM IST
  • మొదటి, రెండో దశ పోలింగ్‌ తర్వాత మారిన స్వరం
  • రాజ్యాంగాన్ని మార్చబోమని హామీలు..
  • రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటూ వివరణలు
  • ప్రధాని ప్రచారంలో కాంగ్రెస్‌పై నిందలకే ప్రాధాన్యం
  • తాజాగా పాకిస్థాన్‌, బాలాకోట్‌ దాడుల ప్రస్తావ

విధాత ప్రత్యేకం: ‘ఆర్టికల్‌ 370 రద్దు చేశాం. జమ్ము కశ్మీర్‌ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ప్రసాదించాం. శతాబ్దాల తర్వాత రాముడికి సొంత గుడి కట్టిచ్చాం. కాబట్టి మాకు 370 సీట్లు ఇవ్వాలి’ అంటూ బీజేపీ నేతలు ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. 400 సీట్ల సాధిస్తామంటున్న ఆ పార్టీ ఈ ఎన్నికల్లో సొంతంగా 443 స్థానాల్లో పోటీ చేస్తున్నది. మిగిలిన 100 స్థానాల్లో మిత్రపక్షాలతో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకున్నది. బీజేపీ 1996లో 471 స్థానాల్లో పోటీ చేసింది. ఆ తర్వాత ఇన్ని సీట్లలో పోటీ చేయడం ఇదే ప్రథమం. అలాగే ఇప్పటివరకు ఎన్నడూ గెలువని స్థానాలపై ఫోకస్‌ పెట్టిన ఆ పార్టీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందు హడావుడి చేసింది. మొదటి, రెండో దశ పోలింగ్‌ తర్వాత బీజేపీ నేతల స్వరం మారింది. రాజ్యాంగాన్ని మార్చబోమని, రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటూ వివరణ ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో పెట్టిన అంశాలను రెండు విడతలు పూర్తయ్యాక పక్కనపెట్టడం గమనార్హం. ఇప్పుడు తాజాగా పాకిస్థాన్‌పై ఎయిర్‌ స్ట్రయిక్స్‌ అంశాన్ని ప్రస్తావించడం విశేషం.

లక్షద్వీప్‌, కశ్మీర్‌లో పోటీకి దూరం
ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించి అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్న ఫొటో మాల్దీవులు, భారత్‌ మధ్య వివాదానికి కారణమైంది. తీరాచూస్తే ఇప్పుడు అక్కడ బీజేపీ పోటీ చేయడం లేదు. ఆ స్థానాన్ని ఎన్సీపీ (అజిత్‌ పవార్‌)కు కేటాయించింది. ఇక 370 అధికరణను పార్లమెంటు ద్వారా 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత పాలిత ప్రాంతాలుగా విభజించింది. మోదీ ప్రధాని అయ్యాక జమ్ములో ఒక్క రాయి వేయడానికి కూడా ఎవరూ సాహించడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. కేంద్రం అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉన్నదని అంటున్నది. మరి అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదనే విపక్షాల ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పడంలేదు. ఆర్టికల్‌ 370 రద్దు చేశాక కశ్మీర్‌ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలకు బీజేపీ దూరంగా ఉన్నది. 370 రద్దు పట్ల కశ్మీర్‌ లోయలోని ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, అది లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని, దాని ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనా పడుతుందని బీజేపీకి అర్థమయ్యే ఇక్కడ పోటీకి దూరంగా ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మణిపూర్‌లో మైతేయిలను ఎస్టీ జాబితాలో చేర్చడంపై ఆగ్రహించిన అక్కడి గిరిజన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. దీంతో అక్కడ ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని మేఘాలయ, నాగాలాండ్లపై ఆ ప్రభావం ఉంటుందని తెలిసి అక్కడ మిత్రపక్షాలకు కేటాయించి పోటీ నుంచి తప్పుకున్నదనే అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎదురీదుత!
బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యూపీ (80 స్థానాలకు గాను 75 చోట్ల) రాష్ట్రాల్లో మొత్తం స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఈ రాష్ట్రాలతోపాటు గత ఎన్నికల్లో కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్‌, పంజాబ్‌, ఢిల్లీలో మెజారిటీ స్థానాలను, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మెరుగైన స్థానాలను బీజేపీ దక్కించుకున్నది. ఈసారి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎదురీదే పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. దీంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోనూ సిట్టింగుల మార్పుతో, కర్ణాటకలో జేడీఎస్‌తో, బీహార్‌లో జేడీయూతో పొత్తుతో మెజారిటీ మార్క్‌ను చేరుకోవడానికి యత్నిస్తున్నది. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీని, కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఎదుర్కొని ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చూస్తున్నది. అందుకే ప్రధాని యూపీ, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న కాంగ్రెస్‌.. ఓబీసీలకు కేటాయించిన 27శాతం రిజర్వేషన్ల కోటాలోకి ముస్లింలను జొప్పించిన కర్ణాటక మోడల్‌ను దేశమంతా విస్తరించాలని చూస్తున్నదని ఆరోపించారు. మహారాష్ట్రలో ఉద్ధవ్‌ఠాక్రే పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతితో మహాయుతి (ఎన్డీయే) సీట్లకు భారీగా గండి పడే అవకాశం ఉన్నదని గ్రహించిన మోదీ.. హిందూత్వవాదం, భావోద్వేగాల ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే.. ‘నకిలీ శివసేన నేతలు (ఉద్దవ్‌ను ఉద్దేశించి) ఔరంగజేబును ఆరాధించేవారితో చేతులు కలిపారు’ అని ఆరోపించారు. అంతేకాదు మిలింద్‌ దేవర, అశోక్‌ చవాన్‌ వంటి కాంగ్రెస్‌ నేతలను బీజేపీలో చేర్చుకున్నా నమ్మకం కుదరడం లేదేమో.. అందుకే ముంబై నార్త్‌ సెంట్రల్‌ నుంచి 2014, 2019లో రెండు సార్లు భారీ మెజారిటీతో గెలిచిన పూనమ్‌ను తప్పించింది. ముంబై ఉగ్రవాద దాడి (26\11) కేసులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించిన ఉజ్జ్వల్‌ నికమ్‌ను బరిలోకి దింపిందనే అభిప్రాయం ఉన్నది. అలాగే గత ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన కమలనాథులకు కాంగ్రెస్+ఆప్ అలయెన్స్ సవాల్ విసురుతున్నది. అందుకే ఇండియా కూటమిలో సంక్షోభం సృష్టించే ఎత్తుగడలో భాగమే కేజ్రీవాల్‌ అరెస్ట్‌ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రధాని ప్రచారంలో కాంగ్రెస్‌పై నిందలకే ప్రాధాన్యం
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు అనేకసార్లు కామెంట్స్‌ చేశారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో బీజేపీకి ఇబ్బందిగా మారిన ఈ అంశాన్ని అధిగమించడానికి ప్రధాని, అమిత్‌ షా ఆపసోపాలు పడుతున్నారు. రిజర్వేషన్ల అంశం అన్ని రాష్ట్రాల్లో ప్రభావం చూపిస్తుందని తెలిసే కాంగ్రెస్‌ పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. యూపీలో మొదటి రెండు దశల్లో జరిగిన నష్టం మూడో దశలోనూ జరిగే అవకాశం ఉందని గ్రహించి ఎస్పీ, కాంగ్రెస్‌ కూటమిపై ఎదురుదాడి చేస్తున్నది. దీనిపై స్పందించిన అఖిలేశ్‌.. యూపీలో రిజర్వేషన్లు తొలిగించిన బీజేపీ ఇప్పుడు వాటిని ఎవరు తొలిగించినా ఊరుకోబోమని నిస్సిగ్గుగా చెబుతున్నదని, ఈ విషయాన్ని ఓటర్లు నిలదీయాలని పిలుపునిస్తున్నారు. తప్పుడు ప్రకటనలు యూపీ ఓటర్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తాయని, మూడో దశలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న వారిని ప్రజలు మార్చేస్తారని చెప్పారు. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనుకుంటున్న ఆ పార్టీ.. బీజేపీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని, అది ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా అని ప్రచారం చేస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇది తమ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతీస్తుందో అని ఆయనతో హైదరాబాద్‌లో మీటింగ్‌ పెట్టించి.. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెప్పించిందని అంటున్నారు.

ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప్రచారం
మూడో దశ ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్నకొద్దీ ఆందోళనలో ఉన్న కమలనాథులు ప్రచారశైలిని పూర్తిగా మార్చేశారు. 370 రద్దు గురించి మాట్లాడం లేదు. 370 సీట్ల గురించి ప్రస్తావించడం లేదు. రామ మందిర నిర్మాణం ఊసెత్తడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నారు. విపక్ష కూటమికి మూడంకెలూ కష్టమే అంటున్న ప్రధానికి సొంతంగా అధికారానికి అవసరమైన మెజారిటీ రాదని అర్థమైందని, అందుకే ఆయనతో సహా ఆ పార్టీ కీలక నేతలంతా ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీని నిందించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇంత చేసినా బీజేపీ ఆశిస్తున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉందా? లేదా? అనే అంశంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.