ఇక లోక్‌సభ సమరానికి సన్నాహాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీల దృష్టి పార్లమెంటు ఎన్నికలపై పడింది. పార్లమెంటు ఎన్నికలు ఈ దఫా ఒకటి రెండు నెలలు ముందే రావచ్చన్న

- 24న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం
- 28న బీజేపీ భేటీకి అమిత్‌షా, నడ్డా
- ఎదురుదెబ్బకు బీఆరెస్ వ్యూహారచన
విధాత : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీల దృష్టి పార్లమెంటు ఎన్నికలపై పడింది. పార్లమెంటు ఎన్నికలు ఈ దఫా ఒకటి రెండు నెలలు ముందే రావచ్చన్న ఆలోచనతో పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల సన్నాహాలు చేపట్టింది. లోక్‌సభ స్థానాల వారీగా ఇప్పటికే మంత్రులను ఇన్‌చార్జులుగా, ఏఐసీసీ నాయకులను పరిశీలకులుగాను నియమించింది. ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన పీసీసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి ఏఐసీసీ నేతలతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. మండల, బ్లాక్, నియోజకవర్గ నాయకులను కూడా ఈ భేటీకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మెజార్టీ ఎంపీ స్థానాలను గెలువాల్సిన అవసరాన్ని పార్టీ శ్రేణులకు వివరించి, వారిని ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమల్లోకి తెచ్చింది. మరో రెండు గ్యారెంటీలను ఈ నెల 28న అమలు చేస్తారని తెలుస్తున్నది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశం ద్వారా మార్గదర్శకం చేయనున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశంపై ఈ సమావేశంలో చర్చించవచ్చని తెలుస్తోంది. ఇండియా కూటమిలో పెద్దన్నగా వ్యవహరించి అధికారంలోకి వస్తే ప్రభుత్వానికి సారథ్యం వహించాలంటే కూటమిలో కాంగ్రెస్ ఎక్కువ ఎంపీ స్థానాలను గెలవడం ద్వారా పెద్ద పార్టీగా అవతరించాల్సివుంది. ఇందుకోసం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మెజార్టీ ఎంపీ సీట్లను గెలువాలని ఏఐసీసీ రాష్ట్రాల నాయకత్వానికి నిర్దేశించింది. దీంతో తెలంగాణలో 17ఎంపీ స్థానాల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించాల్సిందేనని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.
28న బీజేపీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనెల 28న బీజేపీ లోక్‌సభ ఎన్నికల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా లేదా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల అందరిని ఆహ్వానిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లను గెలిచిన బీజేపీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ముందెన్నడూ లేని రీతిలో 8అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఓటింగ్ శాతాన్ని కూడా భారీగా పెంచుకుంది. వీటి ఆధారంగా మరిన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలో ఇతర పార్టీలకు, బీజేపీకి వచ్చిన ఓట్ల వివరాలను పార్టీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, ఎంపీలు అర్వింద్, సంజయ్, ఈటల రాజేందర్.. అమిత్ షా, నడ్డాలకు వివరించారు. వాటి ఆధారంగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలకు కమలదళం పదును పెట్టనుంది. 28న జరిగే బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు లోక్‌సభ ఎన్నికల దిశగా మార్గదర్శకం చేయనున్నారు.
గ్రేటర్‌తో ఆరంభించిన బీఆరెస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయిన బీఆరెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి తమ సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల దిశగా బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లతో, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో దాదాపు క్లీన్ స్వీప్ చేసినట్లుగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ అన్ని స్థానాలు గెలువాలని కేటీఆర్ వారికి పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎంపీ సీట్లను గెలవడంతో పాటు రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించడం ద్వారా అధికార కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వాలని గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఎంపీ ఎన్నికల్లో బదులివ్వాలని బీఆరెస్ పట్టుదలతో ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైంది.