గెలిపిస్తే మధ్యప్రదేశ్‌లో కులగణన: రాహుల్‌ గాంధీ

  • Publish Date - October 10, 2023 / 09:43 AM IST
  • అల్ప సంఖ్యాకుల పరిస్థితికి అది ఎక్స్‌-రే
  • బీజేపీ ప్రయోగశాలలో రైతుల ఆత్మహత్యలు
  • ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే కుల గణన చేపడుతామని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. షాడోల్‌లో మంగళవారం ఆయన ఒక ఎన్నికల సభలో మాట్లాడారు. కుల గణన చేపడితే.. అల్పసంఖ్యాక వర్గాలు, దళితులు, మైనారిటీల స్థితిగతులు ఎక్స్‌-రే తీసినంత స్పష్టంగా కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కేంద్రంపై వత్తిడి తెస్తామని చెప్పారు. ‘ఈ రోజు ఆదివాసీలకు ఏం హక్కులు కల్పించాల్సి ఉన్నది? ఓబీసీలు, ఎస్టీ క్యాటగిరీల వారికి ఏం వాటా ఇవ్వాల్సి ఉన్నది? ఇప్పుడివి దేశం ముందున్న ప్రశ్నలు. అందుకే మేం కుల గణన గురించి మాట్లాడుతున్నాం. మా ప్రభుత్వంలో కుల గణన చేపట్టి తీరుతాం’ అని రాహుల్‌గాంధీ చెప్పారు.


అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతూ.. బీజేపీ తన ప్రయోగశాలగా చెప్పుకొంటున్న మధ్యప్రదేశ్‌లో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న వ్యాపం కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. కోటి మంది యువత కలలను ఛిద్రం చేశారని, 40 మంది ప్రాణాలను బలిగొన్నారని మండిపడ్డారు. ఎంబీబీఎస్‌ సీట్లను 15 లక్షల చొప్పున అమ్ముకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ ప్రయోగశాలలో 18 ఏళ్లలో 18వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారని అన్నారు. ‘ఇదే బీజేపీ ప్రయోగశాలలో వారి నాయకులు ఆదివాసీల ముఖంపై మూత్రం పోశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ-ఆరెస్సెస్‌ ప్రయోగశాలను నిర్మిస్తామని అద్వానీ చెప్పింది ఇదేనా? అని నిలదీశారు.