సీఎం సీటే న‌న్న వ‌దల‌ట్లేదు: అశోక్ గెహ్లాట్‌ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు

ఎన్నిక‌ల‌కు ముంగిట రాజ‌స్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్‌, సీనియ‌ర్ స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య విభేదాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి

సీఎం సీటే న‌న్న వ‌దల‌ట్లేదు: అశోక్ గెహ్లాట్‌ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు
  • అస‌మ్మ‌తి నేత రాజేశ్ పైల‌ట్‌నుద్దేశించే?

జైపూర్ : ఎన్నిక‌ల‌కు ముంగిట రాజ‌స్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్‌, సీనియ‌ర్ స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య విభేదాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి. తాను ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోరుకోలేద‌ని, సోనియా గాంధీయే త‌న‌ను ఎంపిక చేశార‌ని చెప్పిన అశోక్ గెహ్లాట్‌.. సీఎం సీటును నేను వ‌దిలిపెట్టాల‌నుకున్నా అది న‌న్ను వ‌ద‌ల‌టం లేద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. భ‌విష్య‌త్తులో కూడా త‌న‌ను వ‌దిలిపెట్ట‌బోదేమోన‌ని అన్నారు.

‘ఇటీవల ఓ మహిళ మీరు నాలుగోసారి సీఎం కావాలని నాతో అన‌ర్న‌ది. నేను సీఎం పదవిని వదిలి పెట్టాలని అనుకుంటున్నాను. కానీ సీఎం పదవి నన్ను వదలడం లేదు. భవిష్యత్తులో కూడా సీఎం పదవి నన్ను వదలదు అని ఆమెకు చెప్పాన‌ని మీడియా స‌మావేశంలో వ్యాఖ్యానించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిందంటే నాలో ఏదో విశేషం ఉండాలి కదా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వర్గ పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి పార్టీ సీనియర్ నేత సచిన్ పైల‌ట్‌ను ఆహ్వానించ‌లేదు. ఈ విష‌యంలో అనేక ఊహాగానాలు చెల‌రేగాయి.

టికెట్ల కేటాయింపు విష‌యంలోనూ అసంతృప్తి స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. ఈ స‌మ‌యంలో భ‌విష్యత్తు సీఎం గురించి గెహ్లాట్ మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. బీజేపీ కుతంత్రాల వ‌ల్లే రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు తలెత్తుతున్నాయని గెహ్లాట్ ఆరోపించారు. అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. సచిన్ పైలట్ మద్దతుదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తామంతా ఐక్యంగానే ఉన్నామని, టికెట్ పంపిణీలో విభేదాలు లేవని స్పష్టం చేశారు. పైలట్ వర్గంలోని ఏ ఒక్కరినీ తాను వ్యతిరేకించలేదని తెలిపారు.