కేంద్ర ఎన్నికల సంఘం 10 రాష్ట్రాలకు సంబంధించి 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నిర్వహణపై సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌లలో 4 స్థానాల చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు, జార్ఖండ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలలో ఒక్కో స్థానం చొప్పున ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 18న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 8వ తేదీ వరకూ నామినేషన్ల ధాఖలు, 9న పరిశీలన, జూన్ 11వ తేదీన ఉపసంహరణ, 18న పోలింగ్, ఫలితాల వెల్లడి నిర్వహిస్తారు. జూన్ 20నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీ సమావేశం
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల ఖరారుకు ప్రధాని మోదీ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ‘పీఎం సేవా తీర్థ్’ (ప్రధాని నివాసంలో)లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ ఆదివారం నిర్వహించారు. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సీఈసీ సభ్యులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, సంతోష్, జేపీ నడ్డా, డా. లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 11స్థానాలకు బీజేపీ, 6 స్థానాలకు మిత్రపక్షాలతో కలిసి బీజేపీ పోటీ చేయనుంది. మరో స్థానాలలో సైతం కూటమి బలాబలాలను అనుసరించి పోటీకి నిర్ణయించాలని నిర్ణయించారు.
నేడు బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ
మరోవైపు పార్టీ చీఫ్ నితిన్ నబీన్ అధ్యక్షతన సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీ కొనసాగుతుంది. ఇందులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్), నేషనల్ జనరల్ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు, స్టేట్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ 12 ఏండ్లు పూర్తి చేస్తుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా చేపట్టే కార్యకమాలపై ఇందులో చర్చించనున్నారు. నితిన్ నబీన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించలేదు. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలను ఖరారు చేయనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
రాజ్యసభలో పెరుగనున్న బీజేపీ బలం
ప్రస్తుతం 245 స్థానాలున్న రాజ్యసభలో బీజేపీకి ఉన్న 113 స్థానాలతో ఎన్డీఏ కూటమి బలం 148గా ఉంది. బీజేపీ మరో 10 సీట్లను సొంతంగా గెలుచుకుంటే సొంతంగానే మెజారిటీ మార్కు 123ను దాటుతుంది. రాజ్యాంగ సవరణల వంటి కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైన 163 సీట్ల మార్కును దాటాలంటే ఎన్డీఏకు మరో 15 సీట్లు కావాలి. ప్రస్తుతం 10రాష్ట్రాలలో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో జరిగే ఎన్నికల ద్వారా బీజేపీ, ఎన్డీఏ అదనంగా మరో 17 నుంచి 21 సీట్లను గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
రాజ్యసభలో మెజారిటీ మార్క్ (122) దాటడం వలన బీజేపీ పార్టీ నిర్ణయాల మేరకు బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం కానుంది. యూసీసీ (UCC), వక్ఫ్ సవరణ, వన్ నేషన్, వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, జడ్జీల నియామక విధానం, ట్రిబ్యునళ్ల వ్యవస్థ, కోర్టు పరిపాలన వంటి అంశాల్లో మార్పులు, ఎన్నికల సంస్కరణలు, కేంద్ర–రాష్ట్ర అధికారాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక అంశాలపై బిల్లులకు మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి. దీంతో ఆయా బిల్లులను ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా ఆమోదింపజేసుకోవడానికి బీజేపీకి తగిన మెజార్టీ సాధించేందుకు తాజా ఎన్నికల ద్వారా పావులు కదుపుతుంది.
