మృత్యు ర‌హ‌దారులు.. నిరుడు 1.68 ల‌క్షల మంది మృతి

  • Publish Date - November 1, 2023 / 08:57 AM IST
  • 12 శాతం పెరిగిన రోడ్డు ప్ర‌మాదాలు
  • కేంద్రం తాజా నివేదిక‌లో వెల్ల‌డి


విధాత‌: దేశంలో రోడ్డు ప్రమాదాలు ప్ర‌తిఏటా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది క్ష‌త‌గాత్రుల‌వుతున్నారు. అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపడం, పొగ మంచు వంటి కారణాలతో దేశవ్యాప్తంగా ఏటా 4 లక్షలకు పైనే రోడ్డు ప్రమాదాలు జ‌రుగుతున్నాయి. గ‌త ఏడాది రోడ్డు ప్ర‌మాదాలు 12 శాతం పెరిగిన‌ట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన నివేదిక‌లో వెల్ల‌డించింది. 2020, 2021 లాక్‌డౌన్ ప్రభావిత సంవత్సరాల్లో దేశంలో రోడ్డు ప్ర‌మాదాలు త‌గ్గ‌గా గ‌తేడాది 2022లో 11.9 శాతం పెరిగాయి. మృతులు, క్ష‌త్ర‌గాత్రుల సంఖ్య కూడా పెరిగింది.


దేశంలో 4,61,312 రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదాల్లో 1,68,491 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. 4,43,366 మంది గాయ‌ప‌డ్డారు. 2021 సంవ‌త్స‌రంతో పోలిస్టే 2022లో ప్ర‌మాదాలు 11.9 శాతం, మ‌ర‌ణాలు 9.4 శాతం, క్ష‌త‌గాత్రుల సంఖ్య 15.3 శాతం పెరిగింది. ప్రతి 10 ల‌క్ష‌ల మంది (మిలియన్) జనాభాకు 122 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. 1970 నాటి నుంచి ఇదే అత్యధిక మ‌ర‌ణ రేటు అని నివేదిక వెల్ల‌డించింది.


2022లో 3.3 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాలు అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్‌ డ్రైవ్‌, ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన కారణంగానే చోటు చేసుకున్నట్లు నివేదికలో వెల్లడైంది. మొత్తం ప్రమాదాల్లో 71.2 శాతం మరణాలు అతివేగం వల్లే చోటు చేసుకున్నాయి. రాంగ్‌ సైడ్‌లో ప్రయాణం వల్ల 5.4 శాతం మంది మరణించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దాదాపు 10,000 ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.


2022లో హెల్మెట్ లేని ప్ర‌యాణంలో 50,000 మంది మరణించారు. ‘2022లో హెల్మెట్ ధరించకుండా ప్రమాదం బారిన పడి మొత్తం 50,029 మంది వ్యక్తులు మరణించారు. అందులో 35,692 (71.3%) మంది వ్యక్తులు డ్రైవర్లు కాగా, 14,337 (28.7%) మంది వెనుక కూర్చున్న ప్రయాణికులు’ అని నివేదిక వెల్ల‌డించింది. వాహనాల్లో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా 16,715 మంది మరణించారు. ఇందులో 8,384 మంది డ్రైవర్లు కాగా, 8,331 మంది ప్రయాణికులు ఉన్నారు.


ఇక మొత్తం రోడ్డు ప్రమాదాల్లో జాతీయ రహదారుల్లో 32.9 శాతం కాగా, రాష్ట్ర రహదారుల్లో 23.1శాతం, మరో 43.9 శాతం ప్రమాదాలు ఇతర రహదారులపై జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా తమిళనాడులో చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోనే న‌మోద‌య్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మాత్రం ఉత్తరప్రదేశ్‌లో అధికంగా ఉన్న‌ది. మొత్తంగా దేశంలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జ‌రుగుతున్నాయి. అందులో గంటలకు 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.