ప్రధాని బస చేశారు.. కానీ.. 80.6 లక్షలు బిల్లు కట్టలేదు!
ప్రధాని నరేంద్రమోదీ 2023 ఏప్రిల్‌లో మైసూరు పర్యటన సందర్భంగా అక్కడి రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో బస చేశారు. అయితే.. ఆయన బస చేసినదానికి అయిన హోటల్ ఖర్చు 80.6 లక్షల రూపాయలు ఇంకా బకాయి ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఏడాదిగా బకాయి చెల్లించని కేంద్ర ప్రభుత్వం
న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్న మైసూర్ హోటల్
ప్రధాని నరేంద్రమోదీ 2023 ఏప్రిల్‌లో మైసూరు పర్యటన సందర్భంగా అక్కడి రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో బస చేశారు. అయితే.. ఆయన బస చేసినదానికి అయిన హోటల్ ఖర్చు 80.6 లక్షల రూపాయలు ఇంకా బకాయి ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. పదే పదే అడిగినా బకాయిలు చెల్లించకపోవడంతో ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని సదరు హోటల్ యాజమాన్యం భావిస్తున్నట్టు హిందూ పత్రిక పేర్కొన్నది. ప్రాజెక్ట్ టైగర్ 50 వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని గత ఏడాది మైసూరు వచ్చారు.
ఈ కార్యక్రమం కోసం కేంద్రం రాష్ట్ర అటవీశాఖకు 3 కోట్ల నిధులు ఇచ్చింది. అయితే.. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారులు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథార్టీ అధికారుల తదుపరి ఆదేశాలతో చేసిన ఏర్పాట్లతో ఆ ఖర్చు కాస్తా 6.33 కోట్లకు పెరిగింది. కేంద్రం తొలుత మూడు కోట్లు ఇచ్చింది. కాగా.. మిగిలిన 3.33 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలుస్తున్నది. ఈ అంశాన్ని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వన్యప్రాణి) తొలుత ఎన్టీసీఏ వద్ద గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రస్తావించారు.
అయితే.. ఆ ఖర్చు మీరు భరించుకోవాలని సదరు అథార్టీ 2024 ఫిబ్రవరిలో చల్లగా చెప్పేశారు. అయితే.. తమ హోటల్‌కు చెల్లించాల్సిన బిల్లు పెండింగ్‌లో ఉన్నదని రాడిసన్ యాజమన్యం కోరడంతో మరోసారి ఈ అంశాన్ని కొత్త ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మార్చి నెలలో మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ.. హోటల్ బిల్లు 80.6 లక్షలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు ఆ పత్రిక తెలిపింది. జూన్ 1వ తేదీ నాటికి తమ పెండింగ్ బిల్లు విషయాన్ని తేల్చకపోతే చట్టపరంగానే దీనిని పరిష్కరించుకుంటామని హోటల్ యాజమాన్యం చెబుతున్నదని సమాచారం.