భారత్‌పై అస్సలు ఆగేట్టు లేరుగా!

- పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్
- ఏన్సియంట్ కాదు.. క్లాసికల్ హిస్టరీ
- హిందూ విజయాలను ప్రముఖంగా చాటాలి
- ఎన్సీఈఆర్టీ ప్యానెల్ సిఫారసులు
న్యూఢిల్లీ : ఏ క్షణాన ఇండియా పేరును భారత్‌గా మార్చనున్నారన్న వార్తలు బయటకు పొక్కాయో.. అప్పటి నుంచి ఎక్కడెక్కడ ఇండియాను తొలగించాలన్న అంశంలో వివిధ సంస్థలు చర్చల్లో పడ్డాయి. జీ 20 సదస్సు సందర్భంగానే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతరిక్షంలో నెలకొల్పబోయే స్పేస్ స్టేషన్‌కు కూడా భారత స్పేస్‌స్టేషన్ అని నామకరణం చేసేశారు. ఇప్పడు ఎన్సీఈఆర్టీ కూడా అదే బాటపట్టింది.
సామాజిక శాస్త్రాలపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఒకటి.. స్కూలు పాఠ్యపుస్తకాల్లో ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని మార్చాలని సిఫారసు చేసింది. పురాతన చరిత్ర (ఏన్సియెంట్ హిస్టరీ) బదులు ‘సంప్రదాయక చరిత్ర’ను ప్రవేశపెట్టాలని సూచించినట్టు కమిటీ చైర్‌పర్సన్ సీఐ ఐజాక్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఏడుగురు సభ్యుల కమిటీ ఏకగీవ్రంగా నిర్ణయించిందని చెప్పారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1(1)లో ‘ఇండియా.. అనగా భారత్’ అని పేర్కొంటున్నది. దీనిని మార్చాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు సంకల్పించింది. భారత్ అనేది పురాతన పేరని, సుమారు ఏడు వేల ఏళ్లకిందటి విష్ణుపురాణంలో భారత్ అనే పదం కనిపిస్తుందని ఐజాక్ అన్నారు. ఈస్టిండియా కంపెనీ దేశంలోకి ప్రవేశించిన తర్వాత, 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత ఇండియా అనే పదం వాడుకలోకి వచ్చిందని తెలిపారు.
అందుకే పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ అని మార్చాలని తాము సిఫారసు చేసినట్టు వివరించారు. ఇండియా స్థానంలో భారత్ అనే పదం రానున్నదనే సంకేతాలను జీ20 సదస్సు సందర్భంగానే వెల్లడించారు. ఆ సమావేశాల విందు ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. ఆ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ నేమ్ ప్లేట్‌లో కూడా ఇండియా బదులు.. భారత్ అని ఉన్నది.
ఇకపై.. సంప్రదాయ చరిత్ర
వివిధ పాఠ్యాంశాలు, ఇతివృత్తాలపై పొజిషన్ పత్రాలను సమర్పించేందుకు ఎన్సీఈఆర్టీ 2021లో 25 కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో సామాజిక శాస్త్రాలపై కమిటీ ఒకటి. ఈ కమిటీ.. పాఠ్యపుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులుగా.. సంప్రదాయ చరిత్రను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసిందని ఐజాక్ తెలిపారు. భారతదేశ చరిత్రను బ్రిటిష్ పాలకులు ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలు.. అనే మూడు భాగాలుగా విభజించారని ఆయన చెప్పారు.
భారతదేశం అంధకారంలో ఉండేదని, శాస్త్రీయ జ్ఞానం, అభివృద్ధి లేదనే భావంతో ఆ పని చేశారని పేర్కొన్నారు. కానీ.. సౌర వ్యవస్థ నమూనాపై ఆర్యభట్ట చేసిన కృషి సహా అనేక ఉదాహరణలు భారత గొప్పతనాన్ని చాటుతున్నాయని చెప్పారు. అందుకే మధ్యయుగ, ఆధునిక కాలాలతోపాటు.. భారత సంప్రదాయ చరిత్రను బోధించాలని తాము సిఫారసు చేసినట్టు వివరించారు.
హిందూ విజయాలను పాఠ్య పుస్తకాల్లో ప్రముఖంగా చెప్పాలని కూడా కమిటీ సిఫారసు చేసిందన్నారు. మన వైఫల్యాలే ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయని, కానీ.. మొఘల్, సుల్తాన్‌లపై సాధించిన విజయాలు లేవని ఐజాక్ అన్నారు. భారతీయ చరిత్ర పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్)లో కూడా ఐజాక్ సభ్యుడిగా ఉన్నారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారసు చేసింది. జాతీయ విద్యావిధానానికి (ఎన్ఈపీ) అనుగుణంగా స్కూలు పాఠ్యపుస్తకాల పాఠ్యాంశాలను సవరించే పనిలో ఎన్సీఈఆర్టీ ఉన్నది.