Abhujmad encounter । అబూజ్‌మాడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి

మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న అబూజ్‌మాడ్‌లో ఈ ఏడాది భద్రతా దళాలు ‘మాడ్‌ బచా్‌ అభియాన్‌’ పేరుతో భారీ ఆపరేషన్లు చేపట్టాయి. మాడ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వందమందికిపైగా మావోయిస్టులు భద్రతాదళాల కాల్పుల్లో చనిపోయారు.

Abhujmad encounter । అబూజ్‌మాడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి

Abhujmad encounter । ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో ఉన్న అబూజ్‌మాడ్‌ అడవుల్లో గురువారం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి కొన్ని గంటలపాటు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌ సుమారు 7 గంటలపాటు కొనసాగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇంకా ఎవరన్నా చనిపోయారా? ఆయుధాలు వదిలేసి వెళ్లారా? అనేది నిర్ధారించుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అబూజ్‌మాడ్‌ దక్షిణ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్నది. నారాయణ్‌పూర్‌, బీజాపూర్‌, దంతెవాడ జిల్లాల పరిధిలో అబూజ్‌మాడ్‌ ప్రాంతం విస్తరించి ఉన్నది. దశాబ్దాలుగా ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటలా నిలిచింది.

మావోయిస్టుల ఉనికిపై సమాచారం అందటంతో కొండగావ్‌, బస్తర్‌, నారాయణ్‌పూర్‌, దంతేవాడ జిల్లాల నుంచి డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్‌ (DRG)తో కూడిన భారీ బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ (STF), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ (CRPF) కూడా పాల్గొన్నాయి. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ  సాయుధ విభాగం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (PLGA)కు చెందిన ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న అబూజ్‌మాడ్‌లో ఈ ఏడాది భద్రతా దళాలు ‘మాడ్‌ బచా్‌ అభియాన్‌’ పేరుతో భారీ ఆపరేషన్లు చేపట్టాయి. మాడ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వందమందికిపైగా మావోయిస్టులు భద్రతాదళాల కాల్పుల్లో చనిపోయారు. అక్టోబర్‌లో దక్షిణ అబూజ్‌మాడ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ ఘటనలో భారీ ఎత్తున మందుగుండు సామగ్రి లభించింది. మావోయిస్టు ప్రభావిత బస్తర్‌ ప్రాంతంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన ఎన్‌కౌంటర్లలో 18 మంది భద్రతా సిబ్బంది, 207 మంది మావోయిస్టులు చనిపోయారు. నక్సల్స్‌ చేతిలో 67 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ వారిని మావోయిస్టులు చంపివేశారు.