ఇండియా గెలిస్తే.. ప్ర‌ధాని ఎవ‌రంటే..

  • Publish Date - October 17, 2023 / 10:47 AM IST
  • రేసులో రాహుల్ గాంధీ లేదా ఖ‌ర్గే
  • కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ వ్యాఖ్య‌లు


తిరువ‌నంత‌పురం: రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మి విజయం సాధిస్తే కాంగ్రెస్ నుంచి రాహుల్‌గాంధీ లేదా మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్ర‌ధాని అభ్య‌ర్థి రేసులో ఉంటార‌ని ఆ పార్టీ ఎంపీ శ‌శిథ‌రూర్ చెప్పారు. తిరువ‌నంత‌పురంలో మంగ‌ళ‌వారం ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌జ‌ల‌తో ముచ్చ‌టించారు. ప్ర‌ధానిగా ఎవ‌రు ఉండాల‌నేది ఇండియా కూట‌మి నేత‌లు నిర్ణ‌యిస్తార‌న్న శ‌శిథ‌రూర్‌.. త‌న ఉద్దేశంలో రాహుల్ లేదా ఖ‌ర్గే రేసులో ఉంటార‌ని పేర్కొన్నారు.


ఖ‌ర్గే ప్ర‌ధాని అయితే.. దేశానికి తొలి ద‌ళిత ప్ర‌ధాని అవుతార‌ని అన్నారు. కుటుంబం రీత్యా చూసుకుంటే రాహుల్ రేసులో ఉండే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపారు. ఇండియా కూట‌మి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రినీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా పేర్కొన‌డం లేదు. ఈ విష‌యంలో ఇండియా కూట‌మిని అధికార ఎన్డీయే విమ‌ర్శిస్తున్న‌ది. కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్‌గాంధీ ఉంటార‌ని ఆగ‌స్ట్ నెల‌లో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్న్ విష‌యం తెలిసిందే.


ప్ర‌ధాని ఎవ‌ర‌న్న విష‌యంలో పార్టీ అగ్ర‌నాయ‌కులు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌కున్నా.. కూట‌మిలోని వివిధ ప‌క్షాల నాయ‌కులు మాత్రం త‌లో అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బీహార్ ముఖ్య‌మంత్రి, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌కు మించిన ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌రుంటార‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీని తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కులు ముందుకు తెస్తున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌-మే నెల మ‌ధ్య‌లో జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ది.