విధాత: హర్యానాలోని యమునానగర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి రెండు రోజుల వ్యవధిలోనే తాగి ఆరుగురు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఒక చోట మంగళవారం రాత్రి కల్తీ మద్యం తాగడంతో మరణాలు సంభించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మరణాలకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు.
“ఒక వ్యక్తి మరణించినట్టు దవాఖాన నుంచి బుధవారం మధ్యాహ్నం మాకు సమాచారం అందింది. ఇది అనుమానాస్పద మద్యం మరణానికి సంబంధించిన కేసుగా నమోదు అయింది” అని యమునానగర్ పోలీసు అధికారి గంగా రామ్ పునియా వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని తెలిపారు.
మృతుల కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు పేర్కొన్నారు. కల్తీ మద్యంపై సమీప గ్రామాల్లో ఆరా తీస్తున్నట్టు వెల్లడించారు. మిగిలిన ఐదుగురి కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాలను దహన సంస్కారాలు నిర్వహించారని, అందువల్ల పోస్ట్‌మార్టం పరీక్షలు నిర్వహించలేదని ఆయన తెలిపారు.
జిల్లాలోని రెండు గ్రామాల్లో మంగళవారం ముగ్గురికి, బుధవారం మరో ఇద్దరికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం పోలీసులకు తెలియకుండా, పోస్టుమార్టం నిర్వహించకుండా కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తిచేశారు. అనుమానాస్పద స్థితిలో మరణించినందున ఈ ఐదు కేసులపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్పీ తెలిపారు.