Rahul Gandhi | బీజేపీ తప్పుడు విధానాలకు మూల్యం చెల్లించుకుంటున్న సైనికులు : రాహుల్‌గాంధీ
దోడా జిల్లాలో నలుగురు జవాన్లు వీరమరణం పొందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. భద్రతాపరమైన లోపాలు పదేపదే తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు

న్యూఢిల్లీ: దోడా జిల్లాలో నలుగురు జవాన్లు వీరమరణం పొందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. భద్రతాపరమైన లోపాలు పదేపదే తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతులకు నివాళులర్పించిన రాహుల్ గాంధీ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి భయానక ఘటనలు తీవ్ర విచారాన్ని, ఆందోళనలను కల్గిస్తున్నాయని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో దిగజారుతున్న పరిస్థితులకు ఈ వరుస దాడులు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాలకు మన సైనికులు, వారి కుటుంబాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని ఎక్స్‌లో పేర్కొన్నారు. పదేపదే చోటు చేసుకుంటున్న భద్రతాపరమైన లోపాలకు పూర్తి బాధ్యత భారత ప్రభుత్వం తీసుకోవాలనేది ప్రతి ఒక్క దేశభక్త భారతీయుడి డిమాండ్. ఈ లోపాలకు భారతదేశంలో కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో యావత్ దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
నటిస్తున్న మోదీ సర్కార్
ఒక అధికారి సహా నలుగురు జవాన్లు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. వారు భారత మాత సేవ కోసం అత్యున్నత బలిదానాలు చేశారని నివాళులర్పించారు. గాయపడిన జవాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదుల దాడి పిరికిపందల చర్యగా అభివర్ణించారు. గత 36 రోజులుగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు పెచ్చరిల్లుతున్నాయని ఖర్గే తెలిపారు. మన భద్రతా వ్యూహాన్ని జాగ్రత్తగా పునఃపరిశీలించుకోవాలని అన్నారు. అంతా మామూలుగానే ఉన్నట్టు మోదీ ప్రభుత్వం నటిస్తున్నదని ఖర్గే విమర్శించారు. ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము ప్రాంతం పెద్ద ఎత్తున ఉగ్రవాదుల దాడులకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. భారతీయ జవాన్ల పక్షాన కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతున్నదని తెలిపారు. 78 రోజుల వ్యవధిలో జమ్ముకశ్మీర్‌లో 11 ఉగ్రవాద దాడులు జరిగాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘ఇదంతా పూర్తిగా కొత్త పరిణామం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా నిలబడటమే కాకుండా.. ఒక ప్రశ్న కూడా అడగాలి. స్వీయ అభిషిక్త.. నాన్ బయోలాజికల్ ప్రధాని, తనకు తాను చాణిక్యుడిగా చెప్పుకొనే వారి డాంబికాలు ఏమయ్యాయి? అని ఆయన తన పోస్టులో రాశారు.