విధాత : పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన బీజేపీ శాసన సభ పక్ష సమావేశంలో సీఎం అభ్యర్థిగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎన్నిక చేశారు. సీనియర్ నేత భట్టాచార్య సీఎంగా సువేందు పేరును ప్రతిపాదించారు. ఒక మహిళ సహా ఇద్దరు నేతలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.
రేపే సువేందు అధికారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం
రేపు శనివారం రవీంద్ర నాథ్ ఠాగూర్ జయంతి సందర్బంగా ప శ్చిమ బెంగాల్ లో సీఎం సువేందు అధికారి సారధ్యంలో బీజేపీ తొలి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఉదయం 11 గంటలకు బ్రిగెడు పరేడ్ గ్రౌండ్స్ లో సువేందు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ఎన్డీఏ సీఎంలు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 206 సీట్లు గెలుచుకుని అసెంబ్లీలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించి, టీఎంసీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికింది.
టీఎంసీ లో నెంబర్ టూ.. ఇప్పుడు బీజేపీకి బెంగాల్ తొలి సీఎం
సువేందు అధికారి 2020 వరకు టీఎంసీలో మమతా బెనర్జీ తర్వాత పార్టీలో నంబర్ టూగా ఉండేవారు. అయితే అభిషేక్ బెనర్జీకి ఆమె ప్రాధాన్యతనివ్వడం నచ్చని సువేందు 2021 ఎన్నికలకు ముందు టీఎంసీకి గుడ్ బై కొట్టి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన నాలుగు నెలలకే జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని 3 సీట్ల నుంచి 77 సీట్లకు చేర్చడంలో సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. నందిగ్రామ్ స్థానంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగడమే కాకుండా పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అప్పట్లో కేంద్ర నాయకత్వం ‘అబ్‌కీ బార్ దో సౌ పార్’ (ఈసారి రెండు వందలు దాటాలి) అనే నినాదం ఇచ్చినప్పటికీ, ఆ లక్ష్యం నెరవేరలేదు. అయితే 3 సీట్ల నుంచి 77 స్థానాలకు పెరగడం పార్టీకి పెద్ద విజయంగానే నిలిచింది.
2021 ఎన్నికల విజయం తర్వాత సువేందు అధికారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేస్తూ, తృణమూల్ కంచుకోటలుగా భావించే ప్రాంతాల్లో సైతం తన ఉద్యమాలతో బీజేపీని బలోపేతం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత బెంగాల్‌లోని మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి..బీజేపీ 206 సీట్లను సాధించడంలో కీలక పాత్ర పోషించి పార్టీ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సువేందు పోషించిన భూమిక ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. మరోసారి సీఎం మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు ఓడించడం గమనార్హం.
పుదుచ్చేరి సీఎంగా మరోసారి రంగస్వామి
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాట్లు సాధించిన ఎన్డీఏ కూటమి శాసన సభ పక్ష నేతగా ఎన్. రంగస్వామి మరోసారి ఎన్నికయ్యారు. ఉప నేతగా ఓం నమశ్శివాయం ఎన్నికయ్యారు.
