కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న పురస్కార ప్రకటన వెనుక ఇదీ మోదీ ప్లాన్!
తాను ఒకప్పుడు సైద్ధాంతికంగా వ్యతిరేకించిన, ఒకప్పుడు తనను సైద్ధాంతికంగా వ్యతిరేకించిన రాజకీయ దిగ్గజాలను తన ఖాతాలో వేసేసుకోవడం బీజేపీకి వెన్నతోపెట్టిన విద్య

విధాత ప్రత్యేకం: తాను ఒకప్పుడు సైద్ధాంతికంగా వ్యతిరేకించిన, ఒకప్పుడు తనను సైద్ధాంతికంగా వ్యతిరేకించిన రాజకీయ దిగ్గజాలను తన ఖాతాలో వేసేసుకోవడం బీజేపీకి వెన్నతోపెట్టిన విద్య. మతోన్మాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన, ఆరెస్సెస్‌వాది చేతిలో హతమైన మహాత్మాగాంధీని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ పేరుతో భుజానికెత్తుకున్నది. హిందూత్వవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు గుజరాత్‌లో ఏకంగా ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించి, ఆయన పేరును తన ఖాతాలో వేసేసుకున్నది. ఎన్టీఆర్ పేరునూ స్మరిస్తుంటుంది. మతోన్మాదాన్ని కడదాకా వ్యతిరేకించి, మరణం వేళ సైతం నాస్తికుడిగానే ఉన్న భగత్‌సింగ్‌ను సైతం ఆరెస్సెస్ ఎప్పుడో హైజాక్ చేసేసింది. బోసునూ వదల్లేదు. ఇప్పుడు తాజాగా 1978లోనే సామాజిక న్యాయాన్ని అమలు చేస్తూ ప్రభుత్వోద్యోగాల్లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్ కల్పించిన కర్పూరీఠాకూర్‌కు భారత రత్న పురస్కారం ప్రకటించడం ద్వారా ఆ మహానాయకుడి వారసత్వాన్ని సైతం హైజాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనతా పార్టీలోని బీజేపీకి పూర్వరూపమైన జనసంఘ్ వర్గం మద్దతుతో కర్పూరీ ఠాకూర్ తన ప్రభుత్వాన్ని నడిపించారు. ఆ ప్రభుత్వంలో బీహార్‌లో జనసంఘ్ వ్యవస్థాపకుడు కైలాశ్‌పతి మిశ్రా ఆనాటి ఠాకూర్ మంత్రివర్గంలో ఆర్థికశాఖ నిర్వహించారు. బడుగు వర్గాలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు సంఘ్‌పరివార్ నుంచి అనేక అవమానాలను ఠాకూర్ ఎదుర్కొన్నారని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు, వెటరన్ సోషలిస్టు నేత శివానంద్ తివారి గుర్తు చేసుకున్నారు. ‘ఈ వర్గం ఎమ్మెల్యేలు బహిరంగంగా వీధుల్లోకి వచ్చి, ఠాకూర్‌ను వ్యతిరేకిస్తూ, ఆయనపై దుర్భాషలాడారు’ అని ఆయన ఒక వార్తా సంస్థకు చెప్పారు. అగ్రవర్ణాల వారు ఎక్కువగా ఉండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు ‘యే రిజర్వేషన్ కహా సే ఆయీ? కర్పూరీ కే మాయి బియాయి? (ఈ రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కర్పూరీ తల్లి వాటిని కన్నదా?) అంటూ నినాదాలు చేశారు. ఠాకూర్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత అనేక ప్రాంతాల్లో సంఘ్‌పరివార్ శక్తులు హింసకు దిగడంతో రక్తపాతం చెలరేగింది. దీని పరిణామాలతో 1979లో ఠాకూర్ ప్రభుత్వం పడిపోయింది. కానీ.. ఠాకూర్ జాతీయ స్థాయిలో సామాజిక న్యాయ ఉద్యమానికి దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగల ఒక నమూనాను మాత్రం అందించగలిగారు.
ఇటీవల బీహార్ ప్రభుత్వం కుల సర్వే చేయించింది. బీసీ జనాభా అసలు లెక్కలు తొలిసారి బయటకు వచ్చాయి. ఈబీసీలు 36.01శాతం, ఓబీసీలు 27.12 శాతం ఉన్నట్టు తేలింది. వారి జనాభాకు అనుగుణంగా బీసీ కోటాను 65శాతానికి బీహార్ ప్రభుత్వం పెంచింది. దీంతో బీహార్‌లో నితీశ్ సర్కార్‌పై పైచేయి సాధించే ఉద్దేశంతో, జాతీయ స్థాయిలో కూడా బడుగు వర్గాలకు తాము గుర్తింపును ఇస్తున్నామన్న అభిప్రాయం కలుగజేసేందుకే కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో మండల్ కమిషన్ సిఫారసులను 1990లో నాటి వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేసేందుకు పునుకొన్న సమయంలో అద్వానీ రథయాత్ర పేరుతో బయల్దేరారు. అప్పట్లో మండల్ వర్సెస్ కమండల్ అనే చర్చ జరిగింది. ఇప్పుడు కూడా అయోధ్య ఆలయాన్ని ప్రారంభించిన మోదీ.. బడుగు వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకే కర్పూరీ ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించారనే అభిప్రాయాలు రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీని ద్వారా ఇండియా కూటమి బీసీ కుల గణన నినాదాన్ని మసకబార్చాలనేది మోదీ ప్రయత్నంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే సామాజికన్యాయ పోరాట వారసత్వాలను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. నిజానికి ఈ పురస్కారం ప్రకటించడానికి ముందే నితీశ్ కుమార్ సర్కార్ జనవరి 24న కర్పూరీ ఠాకూర్ శతజయంతిని పురస్కరించుకుని భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. సదరు కార్యక్రమాన్ని పూర్వపక్షం చేసేందుకు కూడా మోదీ ఈ ఆలోచన చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మోదీ ఆశలు ఫలించి, బడుగు వర్గాల ఓట్లు బీజేపీకి పడతాయా? వేచి చూడాలి.