ట్రక్‌ డ్రైవర్‌ ప్రాణం తీసిన పంకజ ముండే ఓటమి.. ఎలాగంటే..

బీద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పంకజ ముండే ఓడిపోతే తాను బతకనని వీడియో చేసిన ఒక ట్రక్కు డ్రైవర్‌ (38) బస్సు చక్రాల కింద నలిగి చనిపోయాడు. ఆయనది అనుమానాస్పద ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు

  • Publish Date - June 9, 2024 / 08:47 PM IST

ముంబై: బీద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పంకజ ముండే ఓడిపోతే తాను బతకనని వీడియో చేసిన ఒక ట్రక్కు డ్రైవర్‌ (38) బస్సు చక్రాల కింద నలిగి చనిపోయాడు. ఆయనది అనుమానాస్పద ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి బార్‌గావ్‌ పాటి వద్ద అహ్మద్‌పూర్‌.. అంధోరి రోడ్‌పై చోటు చేసుకున్నది. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక బస్సుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతుడిని సచిన్‌ కొండిబా ముండేగా గుర్తించారు. అతడిది లాతూర్‌లోని అహ్మద్‌పూర్‌ సమీపంలోని ఎస్తేర్‌ గ్రామం. ‘ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అరెస్టు చేశాం. ఇది ప్రమాదమా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

యల్దెర్‌వాది నైట్‌హాల్ట్‌ బస్సు బోర్‌గావ్‌ పాటి వద్ద ఆగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నదని తెలిపారు. సచిన్‌ ఆ బస్సు వెనుక నిలబడి ఉన్నాడని, బస్సు రివర్స్‌ తీసుకుంటుడగా.. దానికి కిందపడి చనిపోయాడని చెప్పారు. మృతుడు అవివాహితుడని, తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉంటున్నాడని కింగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ బహువాసాహెబ్‌ ఖండేర్‌ చెప్పారు. బీజేపీ అభ్యర్థి పంకజ ముండే బీడ్‌ నియోజకవర్గంలో ఓడిపోతే తాను బతకనని ఫలితాలకు ముందు సచిన్‌ ఒక వీడియో రూపొందించాడని ఆయన తెలిపారు. ఆ వీడియో బాగా వైరల్‌ అయింది.
బీడ్‌ నియోజకవర్గంలో పంకజ ముండే తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బజరంగ్‌ సోనవాన్‌ చేతిలో 6,553 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాలుగో తేదీన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టినా.. బీద్‌ సీటు ఫలితాన్ని మరుసటి రోజు జూన్‌ 5వ తేదీ తెల్లవారుజామున ప్రకటించారు. ఫలితాల తర్వాత సచిన్‌ బాగా కుంగిపోయాడని, ముభావంగా మారిపోయాడని అతని సోదరుడు చెప్పాడు. శనివారం ఉదయం గ్రామంలోనే అతడి అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపాడు.

 

 

Latest News