విధాత: మనుషులను కూర్చొబెట్టి చేతులతో లాగే బండి (హ్యాండ్‌కార్ట్)లో భార్యబిడ్డలను కూర్చొబెట్టి రైల్వే గేటు దాటుతుండగా, వందే భారత్ రైలు బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య ఇద్దరు బిడ్డలు చనిపోగా, భర్త తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని కంకర్‌ఖేర ప్రాంతానికి చెందిన నరేశ్ హ్యాండ్ కార్ట్ నడుపుతాడు. ఆదివారం సాయంత్రం భార్య బిడ్డలను తన హ్యాండ్ కార్ట్‌ల కూర్చొబెట్టి కాసంపూర్ లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటబోయాడు. అతడు గేటు దాటాడు కానీ, బండి పట్టాలపై ఉండటంతో రైలు హ్యాండ్‌కార్ట్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నరేశ్ భార్య మోనా (40) వీరి ఇద్దరు బిడ్డలు, మనీషా (14) చారు (7) అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.