జులై 1నుంచి అమలులోకి వీబీ జీ రామ్ జీ పథకం
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ పథకం జులై 1 నుంచి అమల్లోకి రానుంది. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్ధ ఉపాధి హామీ ఇవ్వనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ, స్థానిక ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’(MGNREGA)ను రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’ (VB-G RAM G Act)ను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త చట్టాన్ని జులై 1నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల చట్టబద్ధమైన వేతన ఉపాధికి హామీ ఇస్తుందని తెలిపింది. వేతన చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం, పని కేటాయింపు నిబంధనలు, పరిపాలనా వ్యయం వంటి ఇతర విషయాల గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదిస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వాటిని ప్రచురిస్తామంది. వేతనాలను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాలు లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లోకి బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.
జీవనోపాధి భద్రత, గ్రామీణ ప్రజలకు ఆదాయ కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రజల్లో పరివర్తనను తీసుకురావడమే ఈ చట్టం లక్ష్యమని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి కొత్త విధానానికి మారే ప్రక్రియలో కార్మికులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కొత్త గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డులు జారీ అయ్యే వరకు ప్రస్తుతం ఉన్న ఇ-కేవైసీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డులే చెల్లుబాటులో ఉంటాయని కేంద్రం పేర్కొంది. జాబ్ కార్డులు లేని కార్మికులు గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలని సూచించింది. పథకం అమలు ప్రక్రియలో జలభద్రత, మౌలికవసతుల కల్పన, జీవనోపాధి సృష్టి, వాతావరణ మార్పులను తట్టుకొని నిలిచే నిర్మాణ పనులపై దృష్టి సారిస్తారు.
ఇవి కూడా చదవండి :
అభివృద్ది కోణంలోనే ‘హమ్ సే మిలో’ మాటలు : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం స్టాలిన్ తో సీఎం విజయ్ భేటీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram