అభివృద్ది కోణంలోనే ‘హమ్ సే మిలో’ మాటలు : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీ ‘హమ్ సే మిలో’ పిలుపును అభివృద్ధి కోణంలో స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రంతో కలిసి తెలంగాణ అభివృద్ధికి పనిచేస్తామని స్పష్టం చేశారు.

అభివృద్ది కోణంలోనే ‘హమ్ సే మిలో’ మాటలు : సీఎం రేవంత్ రెడ్డి

‘హమ్ సే మిలో’ అంటూ తమతో కలిసి రావాలన్న ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నానని, ఆయన వ్యాఖ్యలను అభివృద్ధి కోణంలోనే చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదని, అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు మాకు అభ్యంతరం లేదన్నారు. వికసిత్ భారత్ తరహాలోనే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తామనని… 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి సాగుతున్నామని రేవంత్ తెలిపారు.

మా పార్టీలు, సిద్దాంతాలు వేరైనా అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని, రాజ్యాంగం చెప్పిన ఫెడరల్ విధానంలో కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళితేనే కేంద్ర రాష్ట్రాల అభివృద్ది ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణకు సంబంధించిన అభివృద్ది ప్రాజెక్టులపై ఎన్నో సార్లు కలిసినా కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని 2 గంటలు సమయమిస్తే మా ప్రణాళికను ప్రధానికి వివరిస్తానని మరోసారి రేవంత్ గుర్తు చేశారు. మెట్రో పాలిటన్ నగరాలకు సంబంధించిన అభివృద్ది పనుల అనుమతులు, నిధుల మంజూరు ప్రక్రియ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరడం జరిగిందన్నారు. తుమ్మడి హట్టి పై ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖ రాశామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేలా చూడాలని ప్రధాని మోదీకి నేను లేఖ రాశానని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు ప్రధాని పెద్దరికం వహిస్తే బాగుంటుందని, మహారాష్ట్ర సీఎంతో మాట్లాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కోరుతున్నామని రేవంత్ పేర్కొన్నారు.

మావోయిస్టులపై మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరం

మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని, మనుషులను చంపడంతో మావోయిజం పరిష్కారం కాదని, ప్రాణం విలువ తెలిసు కనుకే లొంగుబాటుకు చొరవ తీసుకున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఏ సమస్యలపై కొట్లాడారో మేం వాటిపై చట్టాలు చేశామన్నారు. సమస్యలు తగ్గడం వల్లే మావోయిస్టులు తగ్గిపోయారని, బుల్లెట్ కాదు బ్యాలెట్ అని మేం చెప్పామని చివరకు మావోయిస్టులు మా దారికి వచ్చారన్నారు. మావోయిస్టులు, ముస్లింలు ఈ దేశంలో భాగస్వాములు అని, ముస్లింలను వేరు చేసి చూపించడం మంచింది కాదన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి దేశ ప్రజలు కలిసి ఉండాలమాట్లాడాలి కానీ విడగొట్టాలని మాట్లాడటం దురదృష్టకరం అన్నారు. ఇదే బీజేపీ విధానం, వివక్ష అని విమర్శించారు.

పశ్చిమాసియా యుద్ద సంక్షోభం భారత్ పై ప్రభావ చూపుతుందని, ప్రజలు త్యాగాలకు సిద్ద పడాలని ప్రధాని మోదీ చెప్పడం..వారి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇస్తున్న ఉచిత సలహాలుగా కనిపిస్తున్నాయని, రాహుల్ గాంధీ ఆరు నెలల క్రితమే దీనిపై మాట్లాడారని గుర్తు చేశారు.

చట్టం తన పని తాను చేస్తుంది.. ఎవరికి మినహాయింపులు లేవు..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం ఎవరిపై కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశామని తెలిపారు. ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయాలి అనేది తన చేతుల్లో లేదని, అది పూర్తిగా దర్యాప్తు సంస్థలు, కోర్టుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి మాత్రమే చర్యలు ఉంటాయని, విచక్షణారహితంగా రాజకీయ కక్ష్యతోనో.. ఎప్పుడూ విచారణలకు ఆదేశించబోనని స్పష్టం చేశారు. ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, చట్టపరమైన నిబంధనల ప్రకారమే విచారణ జరుగుతుందని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేసు విషయంలోనూ చట్టం తనపని తాను చేసుకపోతుందని, దీనిపై ఇప్పటికే డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, సిట్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వ స్కూల్స్ ఓపెనింగ్ రోజు పిల్లలతో యాంటీ డ్రగ్ ప్రమాణం కోసం రాష్ట్ర గవర్నర్‍ను ఆహ్వానిస్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ఇంటర్ పైన తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

జమిలి ఎన్నికలు రావచ్చు…

జమిలి ఎన్నికలు 2029లో వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జెమిని సర్కస్‍లా బీజేపీ ఎన్నికల విధానం ఉంటుందని, ఎస్ఐఆర్‍ను బీజేపీ ఆయుధంగా ఉపయోగిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎంతగా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసినా.. కేరళలో 3 సీట్లు ,తమిళనాడులో 2 సీట్లు మాత్రమే గెలుచుకుందన్నారు. పశ్చిమబెంగాల్‍లో 90 లక్షల ఓట్లను తొలగించారని ఏ రాష్ట్రంలో గెలవాలంటే అక్కడ SIR ను ప్రయోగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ రాలేదు అని, మున్సిపాలిటీల్లో బీజేపీ పరిస్థితి ఏమిటీ చూశాం అని..రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్‍ను దేనికి సంబంధం లేకుండా అమలు చేయడానికి అవకాశం ఉందని, 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రేవంత్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన 543 లోక్ సభ సీట్లను దామాషా ప్రకారం చేసేందుకు అవకాశం ఉందన్నారు. 50 శాతం పెంపు అన్న దానికి కూడా ఇక ఫార్ములా లేదని సీట్ల పెంపకంపైనే అందరికీ అభ్యంతరాలు ఉన్నాయని, దక్షిణాదికి, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగవద్దన్నదే మా విధానం అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ధాన్యం దిగుబడి విపరీతంగా రావడంతో కొనుగోలులో సమస్యలు ఎదురవుతున్నాయనయి, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. అకాల వర్షాల కారణంగా కొన్ని ఇబ్బందులున్నాయని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. పంట మార్పిడిపైన విస్తృత చర్చ జరగాల్సి అవసరం ఉందని క్షేత్రస్థాయిలో రైతులకు పంట మార్పిడిపైన అవగాహాన కల్పిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

జర్నలిస్టుల ఇళ్లపై జూన్ 2 లోపు నిర్ణయం : సీఎం రేవంత్ రెడ్డి
కవిత టీఆర్ఎస్ జోరు.. మే 20 నుండి జెండా పండుగ