తమిళనాడు అసెంబ్లీలో టీవీకే అధినేత, సీఎం చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రభుత్వం బల పరీక్షలో విజయం సాధించింది. విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా..వ్యతిరేకంగా 22మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5గురు బీజేపీ, పీఎంకే సభ్యులు ఐదుగురు తటస్థంగా ఉండి ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. డీఎంకే ఎమ్మెల్యేలు, ఇతరులు 61మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ ను బహిష్కరించారు. విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు ప్రొటెం స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.
తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయ్ ప్రభుత్వానికి టీవీకే ఎమ్మెల్యేలు 106 మంది, కాంగ్రెస్ (5), సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ కు చెందిన ఇద్దరేసి చొప్పున ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. అలాగే అన్నాడీఎంకే చీలీక వర్గం ఎమ్మెల్యేలు 25 మంది విజయ్ కి అనుకూలంగా ఓటు వేశారు. ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ కూడా విజయ్ బయట నుంచి మద్దతు తెలిపారు.
సెక్యులర్ పాలన అందిస్తాం : విజయ్
మా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఉంటాయని, సెక్యులర్ పాలన అందిస్తామని సీఎం విజయ్ స్పష్టం చేశారు. మాపై నమ్మకం ఉంచిన ప్రజలకు, మద్దతునిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మాది ప్రజా ప్రభుత్వం అని, ప్రజాపాలన సాగుతుందని, బలహీన వర్గాల ప్రభుత్వం అని ఈ సందర్బంగా విజయ్ చెప్పుకొచ్చారు. మూడేళ్లలోనే 34.92శాతం ఓటింగ్ సాధించామని, విజిల్ అలలు విజయ్ విజయ అలలుగా వ్యాపించాయన్నారు. కోటి 72 లక్షల మంది మాకు ఓటేశారు. అతిపెద్ద పార్టీగా ప్రజలు మమ్మల్ని ఇక్కడికి పంపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మాకు మద్దతు ఇచ్చారు. కాబట్టి ప్రజా భద్రతే మాకు ముఖ్యం అన్నారు.
మేం నిజమైన లౌకిక ప్రభుత్వాన్ని నడిపిస్తాం. అదే మా లక్ష్యం. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మేం ప్రయత్నించలేదు.మా ప్రభుత్వం రేసు గుర్రంలా పరిగెడుతుంది. వేరే గుర్రాలను కొనాల్సిన అవసరం లేదు. మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్లకు కూడా మంచి పాలన అందిస్తాం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. గత ప్రభుత్వంలోని మంచి పథకాలను కొనసాగిస్తాం. మా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. మా ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటుంది’’ అని అన్నారు.
విజయ్ ప్రభుత్వంపై విపక్షాల విమర్శల దాడి
ప్రభుత్వం బల పరీక్షకు ముందు సీఎం విజయ్ టార్గెట్‌గా అసెంబ్లీలో డీఎంకే పక్ష నే ఉదయనిధి స్టాలిన్ పలు కీలక ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ప్రజామోదం పొందడంలో టీవీకే విఫలమైందని, 65 శాతం ఓటర్లు విజయ్‌ను తిరస్కరించారు. టీవీకేకు వ్యతిరేకంగా 3.1 కోట్ల మంది ఓటేశారని గుర్తు చేశారు. విజయ్‌కి తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్లే రెండు చోట్ల పోటీ చేశారని, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి టీవీకేకు లేదు అని చురకలేశారు. టీవీకే ప్రభుత్వానికి అసలు మెజార్టీ లేదని, మిత్రపక్షాల మద్దతుతో మాత్రమే ప్రభుత్వం నిలబడుతోందని ఆరోపించారు. డీఎంకే కూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న సంగతి మరిచిపోవద్దు అంటూ హెచ్చరికలు చూడా చేశారు. “రాష్ట్రానికి రియల్ ప్రభుత్వం కావాలి, రీల్ ప్రభుత్వం కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ మనుగడ కోసం టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోందంటూ విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం కలవడం విడ్డూరంగా ఉందని, సీఎం కన్నా ముందు మద్దతునిస్తున్న పార్టీ కార్యాలయాలకు పుష్పా సినిమా తరహాలో సోఫాసెట్లు వెళ్తున్నాయి అని, ఆ తర్వాత పూల గుచ్ఛాలతో సీఎం వెళ్తున్నారు అని ఆరోపించారు. దీంతో ఉదయనిధి ప్రసంగాన్ని ఏఎంఎంకే ఎమ్మెల్యే(బహిష్కృత) కామరాజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రతిగా డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
మా ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం : పళని స్వామి
అంతకుముందు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా విజయ్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ఘాటు విమర్శలు చేశారు. బలపరీక్ష పై చర్చ సందర్బంగా అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యే వేలుమణికి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వడంపై పార్టీ జనరల్ సెక్రటరీ పళని స్వామి మండిపడ్డారు.వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకుని.. సంచలన ఆరోపణలకు దిగారు. ఏ రాజకీయ పార్టీలోనైనా విబేధాలు సహజమని, దానిని అనుకూలంగా తీసుకుని సీఎం విజయ్ మా పార్టీ రెబల్ వర్గ ఎమ్మెల్యేలను ఎందుకు కలిశారు? అని, వాళ్లతో ఆయనకేం పని? అని ప్రశ్నించారు. విజయ్ సంఖ్యా బలం కోసం మా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని పళని స్వామి ఆరోపించారు. పళిన ఆరోపణలపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండుగా చీలి వాగ్వాదానికి దిగారు. మాకు పదవులు వద్దు.. టీవీకేకు మా మద్దతు అంటూ ) సీవీ షణ్ముగం వర్గం రెబల్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీవీకేకు మేం మద్దతు ఇవ్వబోం అని పళని వర్గం నినాదాలు చేసింది.
ఓఎస్డీడీగా జ్యోతిష్యుడి నియామకంపై వ్యతిరేకత
బల పరీక్ష తీర్మాణ చర్చలో డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్‌కాంత్(విజయ్‌కాంత్ సతీమణి) విజయ్‌పై ఎదురు దాడికి దిగారు. ప్రముఖ జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారిగా (OSD) నియమించడంపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మద్యం షాపులను దేవాలయాలకు దూరం పెట్టడం మంచిదేనని..అయితే యువత మీకు ఓటేసి గెలిపిస్తే, మీరు జ్యోతిష్యులని నమ్ముతున్నారంటూ విమర్శలు చేశారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించుకుని యువతకు ఏం సందేశం ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. జ్యోతిష్యుడి కావాలనుకుంటే వ్యక్తిగతం వరకే పరిమితం చేయాలన్నారు. విజయ్ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఎన్డీయే కూటమిలోని బీజేపీ, పీఎంకేతో కలిసి ఆమె వాకౌట్ చేశారు. జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివెల్‌ను సీఎం విజయ్ ఒఎస్డీగా నియమించుకోవడాన్ని మిత్ర పక్షం వీసీకే కూడా తప్పబట్టింది. మద్దతునిస్తున్నామంటే అన్నింటికి తలూపడం కాదంటూ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి :
బలపరీక్షలో నెగ్గిన సీఎం విజయ్
విజయ్ కి ఊరట..ఒక్కడు తగ్గితే 31మంది వచ్చారు!
