Loksabha exit polls । గత మూడు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? అసలు ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వం ఎంత?
లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ శనివారం ముగియనుండటంతో ఆ వెంటనే ఎగ్జిట్‌పోల్స్ హడావుడి మొదలుకానున్నది.

ఒక సర్వేకూ మరో సర్వేకూ పొంతన లేని లెక్కలు
శనివారం సాయంత్రం నుంచి ఎగ్జిట్‌పోల్స్ హడావుడి
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ శనివారం ముగియనుండటంతో ఆ వెంటనే ఎగ్జిట్‌పోల్స్ హడావుడి మొదలుకానున్నది. ఈ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ముగిసిన 43 రోజుల తర్వాత వెల్లడయ్యే ఎగ్జిట్‌పోల్స్ కోసం ఔత్సాహికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తుది విడత పోలింగ్ ముగిసే జూన్ 1 సాయంత్రం నుంచి వాస్తవ ఫలితాలు వెలువడే జూన్ 4 మధ్య రోజుల్లో పత్రికల పతాక శీర్షికల్లో, మీడియాలో ఇవే ప్రధానం కానున్నాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వం ఎంత? అవి పేర్కొన్నట్టుగా 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజార్టీలు దక్కాయా? 2014 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు నిర్వహించగా.. మే 16న ఫలితాలు ప్రకటించారు. 2019 ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు సాగాయి. ఫలితాలు మే 23న వెలువడ్డాయి.
2014 ఎగ్జిట్ పోల్స్
2014 ఎన్నికల్లో ఎనిమిది ఎగ్జిట్ పోల్స్ సగటు గమనిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 283 స్థానాలు గెల్చుకుంటుందని, కాంగ్రెస్ నాయకత్వంలోని అప్పటి యూపీఏ 105 సీట్లు సాధిస్తుందని పేర్కొన్నాయి. వాస్తవానికి ఆ ఎన్నికల్లో ఉన్న మోదీ గాలిని అవి గుర్తించలేక పోయాయి. చివరకు ఫలితాలు వెలువడే నాటికి ఎన్డీయే 336 సీట్లు గెల్చుకున్నది. యూపీఏకు 60 సీట్లు మాత్రమే దక్కాయి. ఇందులోనూ బీజేపీ 282 సీట్లలో, కాంగ్రెస్ 44 సీట్లలో గెలిచాయి. అంటే.. ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ పప్పులో కాలేశాయన్నమాట.
ఎగ్జిట్‌పోల్ సంస్థ | ఎన్డీయే | యూపీఏ |
న్యూస్ 24-చాణక్య | 340 | 70 |
ఇండియా టీవీ సీ వోటర్ | 289 | 101 |
సీఎన్‌ఎన్ ఐబీఎన్ – సీడీఎస్ | 280 | 97 |
ఎన్డీటీవీ హన్సా రిసెర్చ్ | 279 | 103 |
సీఎన్‌ఎన్ ఐబీఎన్ సీఎస్‌డీఎస్- లోక్‌నీతి | 276 | 97 |
ఏబీపీ న్యూస్- నీల్సన్ | 274 | 97 |
ఇండియా టుడే -సిసిరో | 272 | 115 |
టైమ్స్ నౌ-ఓఆర్‌జీ | 249 | 148 |
సగటు | 283 | 105 |
వాస్తవ ఫలితం | 336 | 60 |
తేడా | 53 | 45 |
2019 ఎగ్జిట్ పోల్స్
2019లో 13 ఎగ్జిట్ పోల్స్ సగటున ఎన్డీయేకు 306, యూపీఏకు 120 వస్తాయని అంచనా వేశాయి. ఇక్కడ కూడా ఎన్డీయే ప్రభావాన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయలేక పోయాయి. ఆ ఎన్నికల్లో ఎన్డీయే 353 సీట్లలో విజయం సాధించింది. యూపీఏకు 93 సీట్లు వచ్చాయి. వీటిలో కాంగ్రెస్‌కు 52 సీట్లు రాగా, బీజేపీకి 303 సీట్లు వచ్చాయి.
ఎగ్జిట్‌పోల్ సంస్థ | ఎన్డీయే | యూపీఏ |
ఇండియా టుడే – యాక్సిస్ | 352 | 93 |
న్యూస్24-టుడేస్ చాణక్య | 350 | 95 |
న్యూస్18-ఐపీఎస్‌వోస్ | 336 | 82 |
వీడీపీ అసోసియేట్స్ | 333 | 115 |
సుదర్శన్ న్యూస్ | 313 | 121 |
టైమ్స్ నౌ-వీఎంఆర్ | 306 | 132 |
సువర్ణ న్యూస్ | 305 | 124 |
ఇండియా టీవీ – సీఎన్‌ఎక్స్ | 300 | 120 |
ఇండియా న్యూస్-పోల్‌స్ట్రాట్ | 287 | 128 |
సీవోటర్ | 287 | 128 |
న్యూస్ నేషన్ | 286 | 122 |
ఏబీపీ-సీఎస్‌డీఎస్ | 286 | 122 |
న్యూస్‌ఎక్స్-నేత | 242 | 164 |
సగటు | 306 | 120 |
వాస్తవ ఫలితం | 353 | 93 |
తేడా | 47 | 27 |
2009 ఎగ్జిట్ పోల్స్
యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన 2009లో కూడా నాలుగు ఎగ్జిట్‌పోల్స్ సగలు వాస్తవ ఫలితాలకు భిన్నంగానే ఉన్నది. యూపీఏకు 195, ఎన్డీయేకు 185 సీట్లు సగటున వస్తాయని అంచనా వేయగా.. వాస్తవ ఫలితాల్లో యూపీఏ 262 సీట్లు, ఎన్డీయే 158 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. ఇందులో కాంగ్రెస్ 206 సీట్లు, బీజేపీ 116 సీట్లు గెల్చుకున్నాయి.
ఎగ్జిట్‌పోల్ సంస్థ | యూపీఏ | ఎన్డీయే |
స్టార్- నీల్సన్ | 199 | 196 |
సీఎన్‌ఎన్ ఐబీఎన్ -దైనిక్ భాస్కర్ | 195 | 175 |
ఇండియా టీవీ – సీవోటర్ | 196 | 189 |
హెడ్‌లైన్స్ టుడే | 191 | 180 |
సగటు | 195 | 185 |
వాస్తవ ఫలితం | 262 | 158 |
తేడా | 54 | 22 |