ఈ ఏడాది ఐటీ రిఫండ్లు లేట్‌ అవుతాయా? ప్రచారంలో ఉన్నదాంట్లో వాస్తవమెంత?

ఈ ఏడాది ఆదాయం పన్ను రిఫండ్‌లు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆనంద్‌ లుహార్‌ చెబుతున్నారు. ఈసారి ఐటీ రిటర్న్స్‌ను కఠినంగా స్ర్కూటినైజ్‌ చేయబోతున్నారని,

ఈ ఏడాది ఐటీ రిఫండ్లు లేట్‌ అవుతాయా? ప్రచారంలో ఉన్నదాంట్లో వాస్తవమెంత?

ముంబై: ఈ ఏడాది ఆదాయం పన్ను రిఫండ్‌లు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆనంద్‌ లుహార్‌ చెబుతున్నారు. ఈసారి ఐటీ రిటర్న్స్‌ను కఠినంగా స్ర్కూటినైజ్‌ చేయబోతున్నారని, ఇందుకోసం కృత్రిమ మేధ ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన సెల్ఫ్‌ ఆటోమేటెడ్‌ విధానాన్ని అనుసరించబోతున్నారని చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆనంద్‌ లుహార్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఒక కథనాన్ని పొందుపర్చారు. కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీడబ్ల్యూఏఐ)కి చెందినట్లు ఆయన బయో ద్వారా తెలుస్తున్నది. పాన్‌కార్డులతో అనుసంధానమై ఉన్న అన్ని ఖాతాల వివరాలను ఈ ప్రోగ్రాం సేకరిస్తుందని, అనంతరం అది ఆటోమెటిక్‌గా ఆధార్‌ కార్డుతో లింక్‌ అయి ఉన్న డాటాను అనుసరిస్తుందని ఆయన చెబుతున్నారు. అనంతరం ఏఐ పరిజ్ఞానంతో ఆధార్‌, పాన్‌ కార్డులతో అనుసంధానం అయి ఉన్న ఖాతాల్లోని ట్రాన్సాంక్షన్స్‌ను సరిపోలుస్తుందని అంటున్నారు. తద్వారా మీకు సంబంధించిన అన్ని ఖాతాల్లోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, క్రెడిట్‌ అయిన త్రైమాసిక వడ్డీలు, డెవిడెండ్‌ షేర్‌లు, షేర్‌ ట్రాన్సాక్షన్లు, లాంగ్‌ టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్‌ గెయిన్స్‌ తదితర అన్ని వివరాలను అది సేకరిస్తుందని పేర్కొంటున్నారు.

తదుపరి మీ పేర్లపై మీరు వెల్లడించని ఖాతాలను ట్యాలీ చేస్తుంది. మీరు రెండవ లేదా మూడవ ఖాతాదారుగా ఉన్న జాయింట్‌ ఎక్కౌంట్ల వివరాలను కూడా ట్యాలీ చేస్తుందని ఆయన రాశారు. పోస్టల్‌, సహకార బ్యాంకులు, స్థానిక రుణ సంస్థలు, పోస్టల్‌ ఎఫ్‌డీలు, వడ్డీలు, పోస్టల్‌ రికరింగ్‌ డిపాజిట్లు, ఎంఐఎస్‌, సీనియర్‌ సిటిజన్‌ పొదుపు ఖాతాలు ఇలా అన్నింటి వివరాలు సేకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఐటీ పరిధిలోకి రాని మీ కుటుంబ సభ్యుల వివరాలూ సేకరిస్తుందని చెబుతున్నారు. గడిచిన మూడేళ్లలో భూమి లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసి ఉంటే వాటి వివరాలను సైతం మీ పాన్‌ ఆధారంగా తనిఖీ చేస్తుందని ఆనంద్‌ లుహార్‌ పేర్కొన్నారు. ఈ పని మొత్తం ముగిసిన తర్వాత డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై చేసిన లావాదేవీలు, వాహనాల కొనుగోళ్లు, ప్రయాణాలు ఇలా అన్ని వివరాలు తీసుకుని, వాటి ఆధారంగా మీకు రిఫండ్‌ ఏమైనా వచ్చేది ఉంటే ఇస్తారని, ఈ ప్రక్రియ కోసమే ఈ సారి ఆదాయం పన్ను రిఫండ్‌ జాప్యం జరిగే అవకాశం ఉందనేది ఆయన వాదన. ఐటీ రిటర్న్స్‌ను గరిష్ఠంగా ఆగస్ట్‌ మొదటివారంలో ప్రాసెస్‌ చేస్తారని ఆయన అంచనా వేశారు.

ఏకీభవించని నెటిజన్లు

ఈ అభిప్రాయాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటనలు అయితే ఏమీ లేవు. దీన్నే ప్రస్తావించిన పలువురు నెటిజన్లు ఆయన అభిప్రాయాలతో ఏకీభవించలేదు. కొంతమంది దీన్ని జోక్‌గా కొట్టిపారేశారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనే రహస్య సమాచారాన్ని డిపార్ట్‌మెంట్‌ రెగ్యులర్‌గా ఈ ఖాతాకు వివరాలు అందిస్తున్నదేమో అని ఒకరు ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఐటీ వెబ్‌సైట్‌నే ఇంకా మెరుగుపర్చాల్సి ఉన్నదని, ఈ సమయంలో ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పవద్దని కొందరు సలహా ఇచ్చారు. అసలు ఇలా చేస్తారనేందుకు ఆధారాలేంటని కొందరు నిలదీశారు. తాము ఇప్పటికే రిటర్న్స్‌ పొందామని పలువురు వెల్లడించారు.