పుచ్చకాయలో ఎలుకల మందు.. ముంబై కుటుంబ మరణాల కేసులో సంచలన ట్విస్ట్!

ముంబై కుటుంబ మరణాల కేసులో సంచలన మలుపు. పుచ్చకాయలో ఎలుకల మందును గుర్తించిన ఫోరెన్సిక్ అధికారులు. ఎలా జరిగింది? ప్రమాదమా? లేక ఉద్దేశపూర్వక విషప్రయోగమా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

పుచ్చకాయలో ఎలుకల మందు.. ముంబై కుటుంబ మరణాల కేసులో సంచలన ట్విస్ట్! ముంబై కుటుంబం తిన్న బిర్యానీ, పుచ్చకాయ ఆహారం — మరణాల తర్వాత దర్యాప్తులో ఉన్న అంశాలు

Watermelon Samples Test Positive for Rat Poison in Mumbai Family Death Case

⚠️ హైలైట్ పాయింట్స్

  • మృతుల శరీరాల్లో జింక్ ఫాస్ఫైడ్ ఆనవాళ్లు గుర్తింపు
  • పుచ్చకాయ నమూనాల్లో కూడా ఎలుకల మందు ఆనవాళ్లు
  • ఫుడ్ పాయిజనింగ్ కాదు.. విషప్రయోగం అనుమానాలు
  • అవయవాలు ఆకుపచ్చగా మారినట్టు ఫోరెన్సిక్ గుర్తింపు
  • ప్రమాదవశాత్తూ కలిసిందా? లేక ఉద్దేశపూర్వకమా? అన్న కోణంలో దర్యాప్తు

విధాత భారత్​ డెస్క్​ | మే 7, 2026 | హైదరాబాద్​:

Mumbai Family Deaths | ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన కేసులో కీలక ఫోరెన్సిక్ పరిశోధన వివరాలు బయటకు వస్తున్నాయి. మొదట ఫుడ్ పాయిజనింగ్‌గా భావించిన ఈ ఘటన ఇప్పుడు పూర్తి స్థాయి విషప్రయోగపు అనుమానాల వైపు మళ్లుతోంది. మృతుల శరీరాల్లోనే కాకుండా వారు తిన్న పుచ్చకాయ నమూనాల్లో కూడా ఎలుకల మందులో ఉపయోగించే ప్రమాదకర రసాయనం గుర్తించినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.

ఫోరెన్సిక్ పరీక్షల్లో జింక్ ఫాస్ఫైడ్ (Zinc Phosphide) అనే విషపదార్థపు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇది సాధారణంగా ఎలుకల మందుల్లో ఉపయోగించే అత్యంత ప్రమాదకర రసాయనం. ఈ కెమికల్​ కడుపులోకి వెళ్లిన తర్వాత రసాయన చర్య ద్వారా విష వాయువులను విడుదల చేస్తుంది. ఆ వాయువులు రక్తనాళాల్లోకి చేరి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు వంటి కీలక అవయవాలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రసాయనం అధిక మోతాదులో శరీరంలోకి వెళితే మొదట తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత శ్వాసలో ఇబ్బందులు, రక్తపోటు పడిపోవడం, గుండె స్పందన అస్థిరం కావడం వంటి పరిస్థితులు ఏర్పడి కొన్ని గంటల్లోనే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది.

గత వారం అబ్దుల్లా డోకాడియా కుటుంబం రాత్రి పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. అయితే అదే సమయంలో అదే బిర్యానీ తిన్న బంధువులకు ఎలాంటి సమస్యలు రాకపోవడంతో దర్యాప్తు మొదటి నుంచే పుచ్చకాయ వైపు మళ్లింది.

 

లుకల మందు పుచ్చకాయలోకి ఎలా వెళ్లింది?

ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే. పుచ్చకాయలో జింక్ ఫాస్ఫైడ్ ప్రమాదవశాత్తూ చేరిందా? లేక ఉద్దేశపూర్వకంగా కలిపారా? అన్న దానిపై ఫోరెన్సిక్ బృందాలు లోతుగా పరిశీలిస్తున్నాయి. పుచ్చకాయలోకి యాదృచ్ఛికంగా ఎలుకల మందు వెళ్లే అవకాశం సాధారణంగా ఉండదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మందును పండులోకి ఎక్కిస్తేనే సాధ్యం. అది డోకాడియా కుటుంబమే చేసి ప్రాణాలు తీసుకుందా? లేక బంధువుల్లో ఎవరైనా చేసారా అనేది తేలాల్సివుంది.

ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక పోస్ట్‌మార్టం పరీక్షల్లో మృతుల కొన్ని అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు వైద్యులు గుర్తించారు. ఇది కొన్ని విషప్రయోగ కేసుల్లో కనిపించే లక్షణాల్లో ఒకటిగా చెబుతున్నారు.

 

అదే సమయంలో అబ్దుల్లా డోకాడియా శరీరంలో మార్ఫిన్ ఆనవాళ్లు బయటపడటం కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. అయితే అది చికిత్సలో భాగమా? లేక మరో కోణమా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

ఫోరెన్సిక్ నివేదికపై ఉత్కంఠ

పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పుచ్చకాయ నమూనాలు, భోజన పదార్థాలు, నీటి నమూనాలు అన్నింటినీ మరోసారి విశ్లేషిస్తున్నట్లు సమాచారం. తుది ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే ఇది ప్రమాదవశాత్తూ జరిగిన విషప్రయోగమా? లేక ఉద్దేశపూర్వక హత్యా? అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.