Betting Apps: షారుఖ్ ఖాన్, సచిన్, విరాట్ కోహ్లీలపై ఫిర్యాదు

Betting Apps
విధాత: రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ నుంచి మొదలైన కేసులు సినీ సెలబ్రెటీలు, స్టార్ హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్, విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాశ్ రాజ్, హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణిత, అనన్య నాగెళ్ల, మంచులక్ష్మిల వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. చివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని షారుఖ్ ఖాన్, సచిన్, విరాట్ కోహ్లీ లపై కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అర్జున్ గౌడ్ అనే వ్యక్తి వారిపై ఫిర్యాదు చేశాడు. చిన్న వాళ్లనే కాదు పెద్ద యాడ్స్ చేసి కోట్లు సంపాదించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలన్న అర్జున్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సచిన్, విరాట్, షారూఖ్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11మందిపైన, మియాపూర్ లో 25మందిపైన కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ ఇప్పుడు అర్జున్ గౌడ్ ఫిర్యాదుపై ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రమోషన్ చేసిన సెలబ్రేటీలను సాక్షులుగా పరిగణించి యాప్స్ యజమానులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించడం విమర్శలకు దారి తీస్తుంది. ప్రమోషన్ చేసిన వారిని కూడా నిందితులుగానే పరిగణించాలన్న డిమాండ్ ను బాధితులు వినిపిస్తున్నారు.