Supreme Court: ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధం.. హద్దులు దాటొద్దు.. సుప్రీంకోర్టు మండిపాటు
ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ పరిధిదాటి వ్యవహరిస్తున్నదంటూ మండిపడింది. తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది.

Supreme Court: ఈడీ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట.. ప్రతిపక్ష నేతలనే ఈడీ టార్గెట్ చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీంకోర్టు ఈడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈడీ హద్దులు దాటుతోందని హెచ్చరించింది.
ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ మండిపడింది. తమిళనాడులోని టాస్మాక్ పై ఈడీ దాడులను చేయడాన్ని అత్యున్న న్యాయస్థానం తప్పుపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈ మేరకు ఈడీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో రూ. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఈడీ ఆరోపించింది.
తమిళనాడుకు చెందిన టాస్మాక్ పై దాడులు చేస్తోంది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పిటిషన్ కొట్టేసి ఈడీ దాడులకు అనుమతి ఇచ్చింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈడీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నదని అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. అంతేకాకుండా టాస్మాక్ ఉద్యోగులను, మహిళా సిబ్బందిని ఈడీ వేధిస్తున్నదంటూ సుప్రీంకోర్టుకు తెలిపింది.
దీంతో సుప్రీంకోర్టు ఈడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తక్షణమే ఈడీ దాడులను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం వర్గాలు ఈడీపై తీవ్ర ఆరోపణలు చేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఈడీ దాడులు చేస్తున్నదని ఆరోపించారు. అంతేకాక ఈడీ మానవహక్కులను, ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదంటూ విమర్శించారు.