Fake Hair Growth | బట్టతలపై జుట్టు మొలిపిస్తానని మోసం.. గుండ్లు కొట్టి పరార్! ఆసుపత్రికి బాధితుల పరుగు

Fake Hair Growth |
విధాత: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఓ వ్యక్తి చేసిన మోసం వికటించి బాధితులు ఆసుపత్రికి పరుగులు తీయాల్సివచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన షకీల్ అనే వ్యక్తి పాతబస్తీ ఫతే దర్వాజా ప్రాంతంలో సెలూన్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల తాను బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేసుకోవడంతో యువకుల నుండి వృద్ధుల వరకు షకీల్ సెలూన్ వద్ధ క్యూలు కట్టారు. కేవలం రూ.200లకే తాను బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ షకిల్ నమ్మబలికాడు.
ఢిల్లీకి చెందిన బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌కి జట్టు మొలిపించానంటూ ప్రచారం చేసుకున్నాడు. అతని మాటలు నమ్మిన బట్టతల బాధితులు పెద్ధ సంఖ్యలో షకీల్ సెలూన్ కు బారులు కట్టి గంటలు గంటలు పడిగాపులు పడి మరి మందు రాయించుకోవడం మొదలు పెట్టారు. జుట్టు వస్తుందన్న ఆశతో తన సెలూన్ కు వచ్చిన వారందరికి షకీల్ గుండు గీసి కెమికల్స్ రాసి పంపిస్తున్నాడు.
ఇప్పటివరకు అయితే ఇలా మందు రాయించుకున్న వారికి జుట్టు వచ్చిందని ఫలితం చూపించినవాళ్లు మాత్రం ఇంకా ఎవరూ ముందుకురాలేదు. సరే కొన్ని రోజులు వేచి చూద్దామనుకుని వారు ఆశతో తమ గుండుపై జుట్టు మొలకల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే జుట్లు మొలవడం సంగతి దేవుడెరుగు కాని..షకీల్ మందు రాసుకున్న వారిలో పలువురికి సైడ్ ఎఫెక్ట్ రావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చికిత్స కోసం బాధిత యువకులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు.