High Court | ఎమ్మెల్యే కూనంనేనికి హైకోర్టులో బిగ్ రిలీఫ్..

High Court | కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్నికల అఫిడవిట్ లో వివరాలు నమోదు చేయనందున ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన భార్య పేరు ప్రస్తావించలేదని.. వివరాలు దాచిపెట్టారని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. కూనంనేనికి భారీగా జరిమానా విధించాలని.. శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కోరారు. కాగా ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. భార్య పేరును ప్రస్తావించలేదన్న కారణంతో ప్రజలు ఇచ్చిన తీర్పును కొట్టేయలేమంటూ కోర్టు వ్యాఖ్యానించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ సమర్పించే సమయంలో ఆయన తన భార్య వివరాలు నమోదు చేయలేదంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెల్లడించారు. కూనంనేటి తన అఫిడవిట్ లోని కాలమ్ లో తన భార్య పేరు ప్రస్తావించనప్పటికీ.. ఆమెకు సంబంధించిన ఆస్తి వివరాలు వెల్లడించారని న్యాయస్థానం పేర్కొన్నది. పాన్ కార్డులో కూనంనేని భార్యకు సంబంధించిన వివరాలు ఉన్నాయని.. కేవలం ఎన్నికల అఫిడవిట్ లో పేరు వెల్లడించనంత మాత్రాన ఎన్నిక చెల్లదని చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ ను కొట్టేసింది.