Election: స్థానిక పోరు ఎవరెవరికి!

Election:
తిప్పన కోటిరెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలను ఏప్రిల్ లో నిర్వహించడానికి సర్కారు సన్నద్దం అవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. గ్రామ పంచాయతీ, మండల,జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల్లో పట్టు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెట్టాయి. అయితే ఈ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పాగా వేయడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమకున్న 8 మంది ఎంపీలతో తెలంగాణ వ్యాప్తంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో మోదీ హవాకు తోడు రాష్ట్రంలో ఎం ఆర్‌పీఎస్ మద్దతు ఇవ్వడంతో బీజేపీ 8 సీట్లు సాధించుకోగలిగింది. అయితే గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల్లో గెలుపు ఓటములను పూర్తిగా స్థానిక పరిస్థితులే నిర్ణయిస్తాయి.
ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా… స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే ప్రజలు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపిస్తారు. దీనికి ప్రధాన కారణం అభివృద్ధి కోసం నిధులు గ్రామానికి రావాలంటే అధికార పార్టీ బలపరిచన అభ్యర్థులే ఉండాలన్న ప్రజల ఆలోచనే ప్రధాన కారణం అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజల ఆలోచన విధానం వల్లనే అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థులే మెజార్టీగా సర్పంచ్‌లుగా, ఎంపీపీ, జెపీపీలుగా ఎంపీటీసీ, జెడ్ పీటీసీలుగా గెలుస్తారన్న టాక్ మొదటి నుంచి ఉంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరు కూడా తాము గెలువగానే ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని కాబట్టి ప్రజల్లో మాకు సానుకూల వాతావరణం ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాదేనన్న ధీమాతో ఉన్నారు. కానీ ఏ పార్టీకి లేని విధంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో వ్యతిరేకతను మూట కట్టుకున్నదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఎందుకు తమపై ఏడాదిలో వ్యతిరేకత వచ్చిందన్న దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రధానంగా రైతు భరోసా అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో పాటు రకరకాల నిబంధనలతో రుణమాఫీ సరిగ్గా అమలు చేయలేదన్న చర్చ గ్రామస్థాయిలో జోరుగా జరుగుతోంది. రుణమాఫీ అమలు విషయంలో స్థానిక కాంగ్రెస్ నేతలు రైతులకు సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందని స్థానిక నాయకుడొకరు చెప్పారు. మా పార్టీ నేతలు పథకాలను అమలు చేస్తున్నారు కానీ అదే స్థాయిలో ప్రజాభిమానం సంపాదించుకోవడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నష్ట నివారణకు చర్యలు చేపట్టిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అందులో భాగంగానే ఈ నెల26వ తేదీన రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 6 వేలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. ఈ పథకాలను ఒకేసారి అమలు చేయడం ద్వారా ప్రజా వ్యతిరేకతకు అడ్డుకట్ట వేసి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుకూల వాతావరణం కల్పించవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తమకు బ్రహ్మాస్త్రంగా మారుతుందని బీఆరెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది తమకు కలిసి వస్తుందన్న భరోసాతో బీఆరెస్ నేతలున్నారు. కానీ బీఆరెస్ నేతలు ఇప్పడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలరా? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆరెస్ అధినేత కేసీఆర్ ఇంకా కోలుకోలేదు. ఆ పైగా పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆరెస్ గెలుచుకోలేక పోయింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్ స్థానాన్ని పూర్తిగా బీజేపీ ఆక్రమించింది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకున్నది. ఈ ఓటమిని మానసికంగా అంగీకరించలేక పోయిన బీఆరెస్ అధినేత కేసీఆర్ బయటి ప్రపంచానికి మొఖం చాటేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అధినేత ఇంటి నుంచి బయటకు రాని పరిస్థితి. ఆ తరువాత పార్టీ నాయకుడిగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావు, కవితలపై కేసుల పరంపర అందరికి తెలిసిందే. ఫార్ములా-ఈ కార్ రేసులో కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానాలలో కూడా కేటీఆర్‌కు చుక్కెదురైంది. ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కరొంటున్నారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ ఎండీఏ సీనియర్ ఇంజనీర్ బీఎన్ రెడ్డిలు ఏసీబీ విచారణలో కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు చెల్లించామని చెప్పారు. కాగా డబ్బుల చెల్లింపు విషయంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16వ తేదీన కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ పరిస్థితులు బీఆరెస్‌కు క్షేత్ర స్థాయిలో నిరుత్సాహ వాతావరణం ఏర్పడిందన్న చర్చ కూడా ఉంది. ఆతరువాత హరీశ్‌రావు కూడాఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. కవిత ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో జైలుకు వెల్లి వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
బీఆరెస్‌కు ఉన్న అననుకూల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ పట్టు కోసం వేగంగా పావులు కదుపుతున్నది. ఇప్పటి వరకు తెలంగాణలో అక్కడక్కడ పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ ఇక గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోసం ప్రయత్నాలను వేగవంతం చేసింది. 8 ఎంపీలను తెలంగాణలో గెలుచుకోవడంతో బీజేపీ పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్రంలో రెండు మంత్రి పదవులను తెలంగాణకు ఇచ్చింది. అంది వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని పార్టీని బలో పేతం చేయాలన్న అగ్ర నాయకత్వం ఆదేశాల మేరకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్న బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను రంగంలోకి దించి బీఆరెస్‌తో పాటు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి స్థానిక ఎన్నికలు, బీఆరెస్ నేతలపై ఉన్న కేసులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్- బీఆరెస్‌ల మధ్య ఉన్న తగదాలు తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో బీఆరెస్ వీక్ అవుతుందన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒడ్డున కూర్చొని ఈ రెండు పార్టీల మధ్య ఫైట్‌ను ఎంజాయ్ చేస్తూ రాజకీయంగా వచ్చే గ్యాప్‌ను తమ పార్టీలో బలోపేతంలో పిల్ చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడానికి మరో రెండ నెలలు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఏ పార్టీ ఏవిధంగా ప్రజల్లోకి రానున్నదో చూడాలి.