కేరళను తాకిన రుతుపవనాలు.. వేగంగా ముందుకు!

విధాత: హైదరాబాద్: రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. శనివారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లుగా వెల్లడించింది. సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందుగానే కేరళ నుంచి చెన్నైవరకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయని వెల్లడించింది. కర్ణాటక తమిళనాడులో కొత్త భాగంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయని.. మరో రెండు మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో కూడా విస్తరించే అవకాశముందని పేర్కొంది.
రుతు పవనాల ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతాయని అంచా వేసింది. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని తెలిపింది. సాధారణంగా జూన్ 1నాటికి కేరళ తీరానికి రుతు పవనాలు వస్తుంటాయి. ఈ ఏడాది మాత్రం ముందుగానే వచ్చేశాయి. ఇలా సాధారణం కంటే ముందు రావడం 16ఏళ్లతో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
చివరిసారిగా 2009లో మే 23న నైరుతి పవనాలు కేరళాను తాకాయి. 2023లో ఆలస్యంగా జూన్ 8న కేరళాకే చేరుకున్నాయి. కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది వ్యవసాయానికి అనుకూలంగా వర్షాలు ఉంటాయని రైతాంగం ధీమా వ్యక్తం చేస్తుంది.