Pm Modi | అమరావతి.. పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ!

విధాత: ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శుక్ర పునఃప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి రాష్ట్ర యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రులు అనితా, నారాయణ, పయ్యావల కేశవ్ ,నాదేండ్ల మనోహర్ లు ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. రాజధాని పునఃప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వారిని స్వయంగా ఆహ్వానించారని చెప్పారు.
శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రధాని మోదీ అమరావతికి చేరుకుంటారని ఆయన తెలిపారు. అమరావతి పునఃప్రారంభోత్సవం కోసం సభా ప్రాంగణం పూర్తయిందని తెలిపారు. పార్కింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు. రాజధాని కార్యక్రమం మనది అనే భావన అందరికీ వచ్చిందని, సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కాగా అమరావతి పునఃప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు మాజీ సీఎం వైఎస్.జగన్ కు కూడా ఆహ్వానం పంపించారు.
మెగాస్టార్ చిరంజీవిని ఆయన స్వయంగా ఆహ్వానించారు. ప్రధాని అమరావతి పర్యటనలో భాగంగా రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రూ.57వేల కోట్లతో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. రాజధానికి తరలివచ్చే ప్రజల కోసం రవాణా వసతి కల్పిస్తుంది. ఇందుకోసం 8 వేల బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.