Pithapuram: ఏపీలో రికార్డింగ్ డాన్సులు.. సినిమాలు బలాదూర్!

  • By: sr    news    Mar 28, 2025 12:55 PM IST
Pithapuram: ఏపీలో రికార్డింగ్ డాన్సులు.. సినిమాలు బలాదూర్!

Pithapuram | Ap| Pawan Kalyan

విధాత : ఆంధ్రప్రదేశ్ లో రికార్డింగ్ డాన్స్ ల ప్రదర్శన శృతి మించిపోతుంది. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం.. మహిళా కమిషన్..పోలీస్ శాఖలు చోద్యం చూస్తుండటంతో అరుబయట నృత్య ప్రదర్శనలు కాస్తా..అశ్లీలంగా..అర్థ నగ్న..అంగాంగ.. శృంగార భంగిమల ప్రదర్శనలుగా మారిపోతున్నాయి. వాటిని చూసిన జనం కామోద్రేకాలతో రెచ్చిపోతు ఒక్కోసారి స్టేజీ మీద ప్రదర్శనలు చేస్తున్న మహిళా డాన్సర్లపైన పడి అసభ్యకరంగా వ్యవరిస్తున్నారు. ఇంకొందరు అశ్లీల డాన్స్ ల మత్తులో జాతరకు వచ్చిన మహిళల పట్ల అభ్యంతకరంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో జోరుగా రికార్డింగ్ డాన్సులు సాగుతున్నాయి. యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ జాతరలో 12 మంది అమ్మాయిలతో అర్ధరాత్రి వరకు జరిగిన రికార్డింగ్ డాన్సులు చివరకు అశ్లీల స్థాయికి చేరాయి. వాటిని రికార్డింగ్ డాన్స్ లని అనేకంటే కామసూత్ర స్టెప్పులని పిలవడమే బెటర్ అన్న విమర్శలు వినవస్తున్నాయి. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఇటువంటి వాటికి ఏలా పర్మిషన్ ఇస్తున్నారంటూ జనం మండిపడుతున్నారు.

మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు..!

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం ముదివేడు గ్రామంలో జరిగిన దండు మారెమ్మ జాతరలోనూ తాజాగా రికార్డింగ్ డాన్స్ ల పేరుతో పలువురు మహిళలు, హిజ్రాలు అశ్లీల నృత్యాలను చేశారు. అర్ధనగ్నంగా శృంగార భంగిమలు..అంగాంగ ప్రదర్శనలు చేశారు. అది చూసిన కొందరు వారితో పాటు స్టెప్పులేయగా.. భక్తులు మాత్రం దేవుడి జాతరలో ఈ పైత్యం ఏమిటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తుంటే, ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల సినిమాలో డాన్స్ స్టెప్పులు అసభ్యంగా ఉండరాదంటూ తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మహిళా కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన డాన్స్ స్టెప్పుల కంటే ఘోరంగా ఏపీలో రికార్డింగ్ డాన్స్ స్టెప్పులు ఉంటున్నాయి. ప్రత్యక్షంగా కళ్ల ముందే ప్రదర్శితమవుతున్న అశ్లీల రికార్డింగ్ డాన్స్ ల కారణంగా సమాజంలో విచ్చలవిడి తనం పెరిగిపోకముందే ప్రభుత్వాలు కళ్లు తెరవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.