Ramcharan, Sai Pallavi: చిట్టిబాబు సరసన.. భానుమతి? ఏం ఫ్లాన్ చేశారు మాష్టారు

  • By: sr    news    Jun 28, 2025 9:08 PM IST
Ramcharan, Sai Pallavi: చిట్టిబాబు సరసన.. భానుమతి? ఏం ఫ్లాన్ చేశారు మాష్టారు

మెగాపవర్ స్టార్ రామ్ చ‌రణ్ (Ramcharan), లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న సంగ‌తి అంద‌రికీ విధిత‌మే. అయితే ఇ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రంలో కథానాయికగా తెలంగాణ భానుమతి సాయిపల్లవి (Sai Pallavi) నటించనున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది (Peddi) తర్వాత రామ్‌చ‌రణ్ ఆర్సీ 17గా చేయబోయేది ఈ సినిమానే. కాగా ఈ సినిమా విష‌యంలో దర్శకులు అంతే శరవేగంగా మారి పోతున్నారు. అసలైతే ఇది సుకుమార్‌తో తీయాల్సిన చిత్రం. ఇప్పుడు త్రివిక్రమ్, సందీప్ వంగా తదితర పెద్ద దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సుకుమార్ మాత్రం చరణ్ తదుపరి సినిమా నేనే చేస్తున్నానని ఈ మధ్యే తన సొంతూరిలో ప్రకటించాడు.

పెద్ది దర్శకుడు బుచ్చిబాబు ఆ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. అనుకున్న సమయం కంటే ముందే కొబ్బరికాయ కొట్టేస్తాడని సుకుమార్ టీమ్ బల్లగుద్ది మరీ చెపుతున్నారు. అయితే, రామ్‌చ‌రణ్ ఒప్పుకున్న సినిమాల్లో ఒక్క సుకుమార్‌ది తప్ప మరో చిత్రమేదీ లేదు. త్రివిక్రమ్, సందీప్, కిల్ దర్శకుడు నిఖల్ నగేశ్ భట్ల పేర్లు వస్తూ పోతున్నాయి. మధ్యలో లోకేశ్ కనగరాజ్ పేరు కూడా వినబడింది. కానీ, ఏదీ ఖచ్చితమైన సమాచారంతో లేదు. కాబట్టి సుకుమార్తో సినిమానే నెక్స్ట్‌ పట్టాలెక్కబోయేదనే విషయం ఖరారే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. షరామామూలుగానే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఈ చిత్రం విషయంలో ఒక ఆసక్తికర కబురు ఫిల్మ్ న‌గ‌ర్‌లో చక్కర్లు కొడుతోంది. సుకుమార్ ఎంత పెద్ద స్టార్‌తో సినిమా తీసినా, హీరోయిన్‌కు కూడా అత్యంత ప్రాధాన్యత కల్పిస్తారనే విషయం విదితమే. సమంత, రష్మిక.. అంతకుముందు రకుల్ప్రీత్, కాజల్..ఇలా అందరు కథానాయికలకు ప్రాధాన్యమున్న పాత్రలు దక్కాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలిసింది.సాధారణంగా కథ నచ్చకపోతే, నిర్మొహమాటంగా తిరస్కరించే సాయిపల్లవి సుకుమార్ చెప్పిన లైన్‌కు ఇంప్రెస్ అయిందని, ఓకే చెప్పిందని కూడా వినిపిస్తోంది.

ఇంతకుముందు రష్మిక పేరు బాగా వినిపించినా రెండోసారి అదే హీరోయిన్‌తో పనిచేసే అలవాటు లేని సుకుమార్ ఈసారి సాయిపల్లవి పేరు తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్, రామ్‌చ‌రణ్ ఇద్దరూ విదేశాల్లో ఉన్నారు. సుకుమార్ ఈ చిత్రం స్క్రిప్ట్ పైనే సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు ఆయన టీమ్ ద్వారా తెలిసింది. సాయిపల్లవి ప్రస్తుతం హిందీలోకి కూడా అడుగుపెట్టింది. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఏక్ దిన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇంకో సినిమాగా, నితేశ్ తివారీ, యశ్ నిర్మిస్తున్న అంతర్జాతీయ ఇతిహాస చిత్రం రామాయణలో సీతమ్మగా నటిస్తోంది. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ హంగులతో, అవతార్ స్థాయి గ్రాఫిక్స్‌తో నభూతో అన్నట్టుగా రూపొందుతోంది.

ఇందులో జానకి పాత్రంటేనే ఇక సాయిపల్లవి భారత్లో ఇంటింటా సీతమ్మగా కొలవబడుతోందనేది అనుభవాలు చెబుతున్న సత్యం. ఇలా పాన్ ఇండియా వైడ్‌గా సాయిపల్లవి పాపులర్ అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే సుకుమార్–రామ్‌రణ్ పాన్ఇండియా ఫిల్మ్‌లో సాయిపల్లవిని తీసుకుంటే కథకూ తగిన నాయిక దొరికినట్లూ, దేశవ్యాప్తంగా పేరొచ్చిన హీరోయిన్ ఉన్నట్లూ ఉంటుందని లెక్కల మాస్టారు సమీకరణం. అన్నింట్లోనూ గుంభనంగా వ్యవహరించే సుకుమార్ తీరా దగ్గరకొచ్చేదాకా ఏదీ మాట్లాడరు. రామ్చరణ్‌తో సాయిపల్లవి అనే విషయం మాత్రం గ్లోబల్ స్టార్ అభిమానులను గిలిగింతలు పెడుతోంది. ఏదేమైనా తుది ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.