Supreame Court | మమతా బెనర్జీకి షాక్.. ఆ 25వేల మంది టీచర్ల నియామకాలు చెల్లవన్న సుప్రీంకోర్టు

టీచర్ల రిక్రూట్ మెంట్ పై మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ!
విధాత : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక తీర్పు వెలువరించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25వేల టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్ధించింది.
2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST) టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని గతేడాది ఏప్రిల్ లో కలకత్తా హైకోర్టు తీర్పు నిచ్చింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తాజాగా తీర్పు వెలువరించింది. ఈ నియామక ప్రక్రియను అక్రమమైందిగా..కళంకమైనదిగా అభివర్ణించింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. ఆ నియామకాలు చెల్లవని స్పష్టంచేసింది. అయితే బాధిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
ఇక మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, దివ్యాంగ ఉపాధ్యాయులకు మానవతా కోణంలో ఊరట కల్పించింది. వారు విధుల్లో కొనసాగొచ్చని స్పష్టంచేసింది. ఇక, ఈ కుంభకోణం వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని గతంలో హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ దీదీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ పై ఏప్రిల్ 4న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.
2016లో బెంగాల్ సర్కార్ రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థా ఛటర్జీని ఈడీ గతంలో అరెస్టు చేసింది. మరికొద్ది నెలల్లో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా తాజాగా టీచర్ల రిక్రూట్ మెంట్ రద్ధు చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మమతా బెనర్జీ సర్కార్ కు రాజకీయంగానూ ఇబ్బందికరమేనని విశ్లేషకులు చెబుతున్నారు.