Supreme Court : స్థానికత అంశంపై తెలంగాణ సర్కార్ కు సుప్రీం ఊరట!
సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట కల్పించింది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం నాలుగేళ్ల స్థానికత నిబంధనను సమర్థించింది. అంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులకే మెడికల్ సీట్లు లభ్యం అవుతాయి. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద విజయమే దక్కింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విధాత):
రాష్ట్రంలో మెడిసిన్ చదవాలనుకొనే విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 33ను సుప్రీంకోర్టు సోమవారం సమర్ధించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం స్థానికత నిర్ధారణకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవాల్సిందేనన్న నిబంధనతీసుకొచ్చింది. ఈ అంశంపై గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. స్థానికత అంశంపై నిర్ణయాలను తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని స్పష్టం చేసింది. 2024 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 85 శాతం , ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లోకల్, నాన్ లోకల్ కోటాను నిర్ణయించేందుకు 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం 114 జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం తొలి క్లాజ్ లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కనీసం 4 ఏళ్ల పాటు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణిస్తారు. ఇక రెండో క్లాజు ప్రకారం 9 నుంచి 12 వరకు ఒకే దగ్గర చదివిన విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తారు. ఈ రెండింటిలో ఏదో ఒక్క ఆప్షన్ను ఎంచుకోవాలి.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 114 జీవోను సవరిస్తూ 33 జీవోను తెచ్చారు. 2024 జూలై 19న ఈ జీవో తెచ్చారు. 114 జీవోలో ఉన్న 6 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ నాలుగేళ్లు చదివితే అక్కడే స్థానికులు అనే నిబంధనను తొలగించారు. 9 నుంచి 12 వరకు చదివినవారే స్థానికులుగా ఈ జీవో ద్వారా తేల్చారు. మెడికల్ ఆడ్మిషన్లు నీట్ పరీక్ష ద్వారా జరుగుతాయి. నీట్ పరీక్షకు నాలుగేళ్ల తెలంగాణలో చదివిన విద్యార్థులకే నీట్ ద్వారా అర్హత సాధిస్తే తెలంగాణలో మెడికల్ సీట్లు లభిస్తాయి. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ కల్లూరి అభిరామ్ తో పాటు మరో 160 మంది హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో నివాసానికి సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్ లేవని దీన్ని రూపొందించాలని హైకోర్టు 2024 సెప్టెంబర్ 5 ఆదేశించింది. ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వ వాదనను సమర్ధించింది.