Congress | కట్టు తెగుతున్న.. కాంగ్రెస్ క్రమశిక్షణ! గర్జిస్తున్న అసమ్మతి గళాలు

- క్యాబినెట్ విస్తరణపై కొందరు..
- సీడీఎఫ్ నిధులు దక్కక మరికొందరు
- క్షేత్రస్థాయిలో ఆధిపత్యపోరు సరేసరి
- కొత్తగా చేరిన పారాచూట్ పంచాయతీ
హైదరాబాద్, (విధాత): తెలంగాణ అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో అసమ్మతి గళాలు క్రమంగా గర్జిస్తున్నాయి. క్యాబినెట్ విస్తరణలో ఆశావహులైన ఎమ్మెల్యేల్లో రేగిన అసమ్మతి ఒకవైపు.. ఏడాదిన్నర గడుస్తున్నా ప్రభుత్వం నుంచి నియోజకవర్గాలకు ఆశించిన నిధులు దక్కడం లేదన్న పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి ఇంకోవైపు.. పార్టీ పదవులు ఆశిస్తున్న జిల్లా, మండల నాయకుల అసహనం మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలను రగిలిస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్.. కొత్త కాంగ్రెస్ మధ్య ఆధిపత్య పోరు వచ్చి చేరింది. పారాచూట్ నేతల ఆధిపత్యం చెల్లదంటూ సీనియర్లు, జూనియర్లుగా కాంగ్రెస్ నాయకులు పరస్పరం ఘర్షణ పడుతున్నారు. కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు సాధారణమే అయినా.. ఏడాదిన్నరగా కొంత తగ్గి ఉన్న ఈ ఘర్షణలు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ జూలు విదుల్చుతుండటం పార్టీలో కాక రేపుతున్నది.
రచ్చకెక్కుతున్న వర్గపోరు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో సాగుతున్న జిల్లా కాంగ్రెస్ సమావేశాలు నాయకుల మధ్య విభేధాలకు వేదికవుతున్నాయి. తాజాగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షలంలోనే నేతల మధ్య కుమ్ములాట సాగింది. సమావేశంలో పీసీసీ మాజీ సీనియర్ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు.. అధికారం వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా నాయకులకు పదవులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీంతో ఆయనపై ఆగ్రహంతో వ్యతిరేక వర్గీయులు వేదికపైకి దూసుకురావడంతో సమావేశం రసాభాసగా మారింది. మానకొండూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వకపోవడానికి ఓ ముఖ్యనేత కారణమంటూ ఆరోపించారు. దీంతో మంత్రి పొన్నం వర్గీయులు రభసకు దిగారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ విశ్వనాథన్ పెరుమాళ్ సమక్షంలోనే ఈ రచ్చ నెలకొంది.
బుధవారం తుంగతుర్తిలో జరిగిన సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పార్టీ నాయకులు ఎమ్మెల్యే మందుల సామేల్‌పై తిరగబడ్డారు. నీ గెలుపు కోసం కష్టపడ్డ మమ్మల్ని పట్టించుకోవా? మాకే సంక్షేమ పథకాలు రాకుంటే సామాన్య జనానికి ఎం వస్తాయి? అంటూ సామేల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గొడవకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సామేల్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణమైందంటున్నారు. అటు సూర్యాపేట జిల్లాలో సైతం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, టూరిజం అభివృద్ధి సంస్ధ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతున్నదనే వాదనలు ఉన్నాయి. పార్టీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా సాగుతున్న జిల్లా సమావేశాలే ఇలా ఉంటే.. మే 4నుంచి 10వరకు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సమావేశాలు.. 13నుంచి 20వరకు జరిగే మండల కాంగ్రెస్ సమావేశాలు మరింత హాట్ హాట్ గా ఉంటాయంటున్నారు. ఆ సమావేశాల సందర్భంగా నూతన మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికకు పేర్లను ప్రతిపాదించాల్సిఉంది. ఈ క్రమంలో అంతర్గత ప్రజాస్వామ్యం అతిగా ఉండే కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలు రచ్చ రేపడం ఖాయమంటున్నారు.
ఆ నియోజకవర్గాల్లో బాహాబాహీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నాయకత్వానికి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరితకు మధ్య అధిపత్య పోరు రోజురోజుకు ముదురుతున్నది. ఈ వివాదంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన సందర్భంగా కారులో వెళుతున్న క్రమంలో జరిగిన చర్చ అదుపుతప్పి ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ఎంపీ మల్లు రవిల మధ్య ఘర్షణకు దారితీసినట్లుగా ప్రచారం వైరల్ అయింది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్‌తో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి నిత్యం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో పొసగడం లేదని చెబుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు పాత కాంగ్రెస్ నాయకులకు మథ్య బాహాబాహీ సాగుతోంది. తమకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఫోన్ చేసి, దుర్భాషలాడాడని.. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకే చెందిన నవాబుపేట మండల అధ్యక్షుడు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి, యూత్ అధ్యక్షుడు శేఖర్ వేర్వేరుగా మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నీలం మధు ముదిరాజ్, బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల మధ్య మూడుముక్కలాట నడుస్తుంది. వారి మధ్య సయోధ్యకు వేసిన త్రిసభ్య కమిటీ కూడా సయోధ్యలో విఫలమవుతోంది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య, వరంగల్ వెస్ట్ లో ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య పొసగడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డిపై కినుకగా ఉన్నారన్న గుసగుసలున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి, కావ్య, అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీహరిపై ఓడిన శనిగపురం ఇందిరాల మధ్య వర్గపోరు సాగుతోంది. నల్లగొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మళ్లీ వర్గపోరు నెలకొంది.
అసమ్మతి రాజేసిన కేబినెట్ విస్తరణ
కేబినెట్ విస్తరణపై అధిష్ఠానం నాన్చుడు ధోరణి.. ఆశావహ ఎమ్మెల్యేలలో అసమ్మతిని రాజేసింది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నేత జానారెడ్డిపైన ఫైర్ అయ్యారు. అదిలాబాద్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామి, నిజమాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, దేవరకొండ ఎమ్మెల్యే ఎన్ బాలునాయక్ కేబినెట్ పదవుల విషయంలో పార్టీ వైఖరిపై తమ అసహనం వెళ్లగక్కారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేబినెట్ విస్తరణపై ఎవరు బహిరంగంగా మాట్లాడవద్దని.. హైకమాండ్ చూసుకుంటుందని హెచ్చరించారు. ఈ హెచ్చరికల పిదప అసమ్మతి ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
కేబినెట్ విస్తరణను సామాజిక సమీకరణలు.. జిల్లాల ప్రాతినిథ్యం.. పార్టీ రాజకీయ అవసరాలు.. గత హామీలు వంటి అంశాల క్రమంలో నాన్చుతూ అధిష్ఠానమే అసమ్మతికి స్వయంగా ఆజ్యం పోస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. అశావహ ఎమ్మెల్యేలకు సర్ది చెప్పుకోలేక ఏకంగా విస్తరణ అంశాన్నే అటకెక్కించడం సరైందకాదన్న వాదన బలపడుతోంది. కేబినెట్ లో ఆరు ఖాళీలుండగా..వాటిని భర్తీ చేస్తే ఇప్పటికే కొందరు మంత్రులుగా సంతృప్తి చెందేవారు. మునుముందు పునర్ వ్యవస్థీకరణ చేసుకోవడం ద్వారా మార్పులు, చేర్పులతో మరికొంత మందికి అవకాశమివ్వవచ్చు. ఈ దిశగా ఆలోచన చేయకుండా అసమ్మతికి జంకి ఏకంగా విస్తరణ అటకెక్కించిన తీరు ఆ పార్టీ రాజకీయ బేలతనమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.