సర్దుకున్నారా? సమయం కోసం చూస్తున్నారా? కొండా ‘శుభాకాంక్ష’ల పై సర్వత్రా చర్చ..
మొన్నటిదాకా తిట్టుకున్నారు. తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇప్పుడు మౌనం దాల్చారు.. శుభాకాంక్షలు చెప్పుకొంటున్నారు. ఇంతకీ కొండా సురేఖ.. దక్కన్ సిమెంట్స్ విషయంలో సర్దుకుపోయారా? లేక సమయం కోసం వేచి చూస్తున్నారా?

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా తీవ్ర విమర్శలు చేసుకుని రాజకీయాన్ని హీటెక్కిస్తూ.. మరో వైపు ఇళ్ళల్లో శాలువాల సత్కారం మధ్య, కావాల్సిన వేదికలపై కరచాలనాలతో కలిసిపోతుంటే మధ్యలో ఇక ఏదో జరుగుతుందనుకునే వారూ తెల్లముఖం వేస్తున్నారు. నాయకులు వాళ్ళు వాళ్లు మంచిగనే ఉంటున్నారని, మధ్యలో మాట్లాడే కొందరు నాయకులు తమ కడుపు ఉబ్బరం తీర్చుకుంటున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కేంద్రంగా రెండు రోజులు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ‘దక్కన్ సిమెంట్’ వ్యవహారం ఒక్కసారిగా చల్లారినట్టు కనిపిస్తున్నది. ఈ సమస్య నిజంగానే సద్దుమణిగిందా? లేక లేక సమయం కోసం వేచిచూసే ధోరణితో ఉన్నారా? అనే చర్చ ఇప్పుడు అంతర్గతంగా సాగుతోంది. మంత్రులు, సీఎం పర్యటలకు దూరముంటూనే, పరస్పరం దూషించుకుంటూ, ఫిర్యాదులు చేసుకుంటూనే మరోవైపు ‘అవసరమైన’ వేదికలపై కలిసిమెలిసి పోతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పర్యటనల్లో భాగస్వాములవుతూ పరస్పర శుభాకాంక్షలు తెలియజేసుకోవటం చూస్తుంటే.. ‘కలిసిపోతూనే కలహించుకుంటున్నారని, ఇదే కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని చమత్కరిస్తున్నారు. ఈ పరిణామాలను చూసి కొందరైతే నోరెళ్ళబెడుతున్నారు.
సీఎం రేవంత్ పై సుస్మిత విమర్శలు
దక్కన్ సిమెంట్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తూ ఈ కుట్రలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ సుధారాణి భాగస్వాములంటూ కొండా సురేఖ కుమార్తె సుస్మిత మీడియాలో తీవ్ర విమర్శలు చేసిన విషయం రాష్టంలో కాక పుట్టించింది. దీనికి ముందు మంత్రి సురేఖ ప్రైవేటు ఓఎస్డీ సుమంత్ ఆకస్మిక టెర్మినేషన్ సంచలనం రేపింది. అటవీ, పర్యావరణ శాఖ పరిధిలో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని దక్కన్ సిమెంట్ యజమాన్యానికి తుపాకితో బెదిరింపుల వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే అరోపణలతో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ఈ డీల్ లో కీలక సూత్రధారిగా భావించిన సురేఖ ఓఎస్డీ సుమంత్ ను ఆకస్మికంగా ఉద్యోగం నుంచి టర్మినేషన్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. అర్ధరాత్రి హైదరాబాద్ లోని మంత్రి సురేఖ ఇంటికి వెళ్ళి సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు టాస్క్ ఫోర్సు పోలీసులు చేసిన ప్రయత్నాలను మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. అదే సమయంలో సుమంత్ ను మంత్రి తన కారులో తీసుకుని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్ళడం తీవ్ర వివాదమైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట, కాంగ్రెస్ పరువు బజారుకెక్కింది.
శుభాకాంక్షలతో ముగింపు!?
మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంత్ కేంద్రంగా చెలరేగిన వివాదం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తుందనుకున్నారు. ఈ వ్యవహారంలో సీఎం, పలువురు మంత్రుల పై ఆరోపణలు చేశారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు జోప్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే సర్ధుబాటు చేసుకున్నారా? సమస్యను పరిష్కరించుకున్నారా? ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవనుకున్నారా? సమయం కోసం ఎదురుచూద్ధామనే ధోరణితో ఉన్నారా? ఏం జరిగిందో, ఏమోగానీ ‘దీపావళి’ పర్వదినం సాక్షి సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ దంపతులు, ఉపముఖ్యమంత్రి భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ తో కలిసి వెళ్ళి శాలువాతో సత్కరించి, ‘శుభాకాంక్షలు’ చెప్పడంతో ప్రస్తుతం ఈ పంచాయతీకి తెరపడింది. ఈ పరిణామం ఇప్పుడు ఆసక్తికర చర్చకు కేంద్రంగా మారింది.
పర్యటనలకు దూరం…పరస్పర విమర్శలు
మంత్రి ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ కు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా మంత్రి సురేఖ దంపతులకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, బస్వరాజు సారయ్యకు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎటూ తేల్చకుండానే కోల్డ్ స్టోరేజీలో పెట్టింది. ఈ సమస్య తీరకుండానే సీఎం రేవంత్ మేడారం పర్యటనలో అందరూ భాగస్వామ్యమయ్యారు. అభివృద్ధి అంశాల్లో భాగస్వామ్యమవుతున్నారనే భావన నెలకొనే లోపు మేడారం టెండర్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మధ్య మరో వివాదం చెలరేగి పరిస్థితిని వేడెక్కించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మకు సీఎం రేవంత్ హనుమకొండకు వస్తే జిల్లా మంత్రి సురేఖ కనీసం పట్టించుకోలేదు. ఈ వేడి తగ్గకముందే సురేఖ ఓఎస్డీని ఆకస్మికంగా టర్మినేట్ చేయడంతో రచ్చ పతాకస్థాయికి చేరింది. ఈ రచ్చలో కోట్ల వ్యవహారం, తుపాకి వినియోగం, సీఎం పై మంత్రి కుమార్తె తీవ్ర ఆరోపణలతో ఏదో జరుగుతుందనుకుంటే వరిగడ్డి మంట మాదిరి సప్పున చల్లారింది. చిచ్చుబుడ్డి మాదిరి అంటుకుని దీపావళి శుభాకాంక్షలు, శాలువా సత్కారంతో చల్లారింది. కాంప్రమైజ్ అయ్యారా? కలిసి పరిష్కరించుకున్నారా? కాలానికి వదిలేశారా? ఏం జరిగిందనే చర్చ మాత్రం ఇప్పుడు సర్వత్రా సాగుతోంది.