High Court | గ్రూప్ 1పై విచారణ ఈ నెల 30కి వాయిదా!

High Court | గ్రూప్-1పై పరీక్షల మూల్యాంకనం కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది. గ్రూప్-1 నియామకాలపై స్టే ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు విచారణ సందర్భంగా స్టే వెకెట్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. కౌంటరు దాఖలు చేయడానికి టీజీపీఎస్సీ, ఇతర న్యాయవాదులు సమయం కోరారు. విచారణను ఆలస్యం చేయొద్దని, దీని వల్ల ఎంపికైన అభ్యర్థులకు ఇబ్బందులు ఉంటాయని హైకోర్టు తెలిపింది. గత విచారణ సందర్భంగా వినిపించిన వాదనలు కాకుండా.. ఈనెల 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
గతంలో పరీక్ష కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణలో వాదనలు విన్న న్యాయస్థానం గ్రూప్-1 నియామకాలపై స్టే విధించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చని ఆదేశించింది. అభ్యర్థులు కేవలం అపోహపడుతున్నారని, నిపుణులతో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేయించామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నియామకాలు ఆలస్యమైతే ఎంపికైన అభ్యర్థులు నష్టపోతారని నివేదించారు