ఏపీ, తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

విధాత: ఈశాన్య బంగాళాఖాతంలోని ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఏపీలో మూడు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలోనూ మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉరుములు మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
శుక్రవారం వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, ఉమ్మడి నల్గొండ, నాగర్‌కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. అయితే హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, బస్తీల్లో వరద పోటెత్తింది. రాష్ట్రంలో అత్యధికంగా ఉప్పల్‌లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో తాజా వర్షాలు మెట్ట పంటల సాగులో ఉన్న రైతాంగానికి మేలు చేసింది.