మ‌హిళా బిల్లు త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాలి: ప్రియాంక‌గాంధీ

మ‌హిళా బిల్లు త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాలి: ప్రియాంక‌గాంధీ
  • లేనిప‌క్షంలో ఎన్నిక‌ల వేళ ఎందుకు బిల్లు పెట్టారు?
  • డీలిమిటేష‌న్ ప‌దేండ్లు ప‌డుతుంద‌ని ముందు తెలియ‌దా?
  • మోదీ స‌ర్కారు తీరుపై ప్రియాంక‌గాంధీ ఆగ్ర‌హం


విధాత‌: దేశంలోని మ‌హిళ‌ల‌ను కేంద్రంలోని మోదీ స‌ర్కార్ జోక్‌గా చూస్తున్న‌ద‌ని కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక‌గాంధీ వాద్రా మండిప‌డ్డారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కొత్త చట్టాన్నితక్షణమే అమలు చేయలేకపోతే కేంద్రం ప్రభుత్వం ఎన్నిక‌ల ముందు ఎందుకు బిల్లును తీసుకొచ్చిందని ఆమె ప్రశ్నించారు.


మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని మోహన్‌ఖేడాలో గురువారం నిర్వ‌హించిన జ‌న్ఆ క్రోశ్‌ ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును తీసుకొచ్చింది. ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చాయి.

పదేండ్ల‌పాటు రిజ‌ర్వేష‌న్ బిల్లును చేయలేమ‌ని ఇప్పుడు చెప్పున్న‌ది. ముందుగా జనాభా గణన చేప‌ట్టాల‌ని సెల‌విస్తున్న‌ది. ఇదంతా ముందే తెలిసిన‌ప్పుడు బీజేపీ ప్ర‌భుత్వం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పెట్ట‌డం వెనుక ఉద్దేశం ఏమిటి? మీరు మహిళలను జోక్‌గా భావిస్తున్నారు అంతేగా’’ అని ప్రియాంక విమ‌ర్శించారు.


కొత్త చట్టాన్ని (లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు) అమలు చేయడానికి ముందు ప్రభుత్వం డీలిమిటేషన్ కసరత్తును చేపట్టవలసి ఉంటుంది, దీనికి పదేండ్ల‌ పడుతుందని ఆమె పేర్కొన్నారు. “అందరికీ సమాన హక్కులు ఉంటే, కుల గణన ఎందుకు నిర్వహించడం లేదు? బీహార్ కుల గణనలో, జనాభాలో 84 శాతం ఓబీసీలు, దళితులు ఉన్న‌ట్టు తేలింది. అయితే ఆ వ‌ర్గాల‌ వ్యక్తులు ప్రభుత్వ పదవుల్లో లేదు. ఈ విష‌యంపై వారిని అడిగితేవారు (బీజేపీ) మౌనంగా ఉంటారు” అని ప్రియాంక‌గాంధీ మండిప‌డ్డారు.