BMW M 1000 XR | ఈ బైక్ ధరెంతో తెలుసా? వింటే కాసేపు మెదడు పనిచేయదు.!
ధర అరకోటికి పైగా ఉన్న BMW M 1000 XR ఇండియా ధర. ఈ సూపర్‌బైక్–టూరింగ్ క్రాస్‌ఓవర్ ప్రత్యేకతలు, ఇంజిన్ పవర్, ఫీచర్లు, ఎక్స్‌షోరూమ్–ఆన్‌రోడ్ ధర, లభ్యత – అన్నీ ఒకసారి తెలుసుకుందాం. కొనడానికి కాదు సుమా..!
BMW M 1000 XR India Price: Superbike-Tourer That Will Shock You
మనకు బాగా తెలిసిన కారొకటుంది. అదే బిఎండబ్ల్యూ. అబ్బా.. ఎంత బాగుందో.. కానీ, ధర 50 లక్షల పైమాటే. బాగా డబ్బున్నోళ్లు కొనుక్కునే కారది..అని నిట్టూరుస్తాం. కానీ, అదే కంపెనీ అదే ధరతో ఒక బైక్ కూడా అమ్ముతోందంటే నమ్ముతారా..? నవ్వుతారు.. బట్, అదే నిజం.
(విధాత టెక్ డెస్క్), హైదరాబాద్:
BMW M 1000 XRతో బిఎండబ్ల్యూ మనకు ఓ సినిమా చూపిస్తోంది. అమెరికాలో ఈ క్రాస్‌ఓవర్ స్పోర్ట్ టూరర్ బేస్ ధర 25,475 డాలర్లు; భారతీయం కరెన్సీలో చూసుకుంటే సుమారు 21 లక్షల రూపాయలు. కానీ మన దగ్గరకు CBU(Completely Built Unit – పూర్తిగా దిగుమతి చేసిన వాహనం) వచ్చేసరికి, పన్నులు, సెస్‌లు, ఇన్సూరెన్స్ అన్నీ కలిపి భారత మార్కెట్‌లో ఎక్స్‌షోరూమ్ ధరనే ₹48.63 లక్షలు. ఢిల్లీ లాంటి మెట్రోలో ఆన్‌రోడ్ ధర దాదాపు ₹49.24 లక్షలు, కొన్ని రాష్ట్రాల్లో అది ₹50 లక్షల గీత కూడా దాటేస్తుంది. సూటిగా చెప్పాలంటే, మంచీ ఎస్యూవీ వచ్చే ధరకు కొనాల్సిన లెవెల్ బైక్ ఇది.

సాధారణ టూరింగ్ బైక్ కాదు, “ఓ మోస్తరు వేగం – ఓ మోస్తరు కంఫర్ట్” కాదు – ఏకంగా BMW ‘M’ డివిజన్ నుంచి వచ్చిన మోడల్ ఇది. అదే M బ్యాడ్జ్ ఉన్న కార్లు రేస్‌ట్రాక్‌ల్లో ఎలాంటి బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇస్తాయో, అదే స్థాయి ప్రదర్శన ఈ M 1000 XRపై BMW మళ్లీ రిపీట్ చేసింది. 200 హెచ్‌పీ దాటేసిన పవర్, సూపర్‌బైక్ స్థాయిలో సస్పెన్షన్, కార్బన్ పార్ట్స్, టన్నెత్తు ఎలక్ట్రానిక్ సేఫ్టీ నెట్స్ – ఇవన్నీ చూసిన తర్వాతే దాని ధర గురించి మాట్లాడాలి.
సూపర్‌బైక్ హృదయం, టూరింగ్ బాడీ – M 1000 XR ప్రత్యేకతలు
M 1000 XRలో 999 సీసీ, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇదే ఇంజిన్ ప్లాట్‌ఫాం S 1000 RR సూపర్‌బైక్ నుంచి వచ్చింది. షిఫ్ట్‌క్యామ్ టెక్నాలజీ (BMW వేరియబుల్ వాల్వ్ టైమింగ్) వల్ల తక్కువ ఆర్‌పీఎం నుంచే బైక్ చురుగ్గా లాగుతూనే, పై రేంజ్‌లో 201 HP @ 12,750 RPM వరకు పెరుగుతుంది. టార్క్ 113 Nm @ 11,000 RPM వద్ద అందుతుంది; ప్రపంచ మార్కెట్ డేటా ప్రకారం గరిష్ట వేగం సుమారు 278 kmph వరకు వెళ్తుందని BMW చెబుతోంది.
సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌కు బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ జత చేశారు. అంటే క్లచ్ పట్టకుండా గేర్ అప్–డౌన్ చేయొచ్చు; ట్రాక్ మీదా, హైవే మీదా “ఫుల్ థ్రాటిల్” ఫీలింగ్. రేస్, రేస్ ప్రో, డైనమిక్, రోడ్, రెయిన్ లాంటి రైడింగ్ మోడ్‌లు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, స్లైడ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, రేస్ ABS – ఇవన్నీ S 1000 RR నుంచి దిగుమతి చేసిన సాంకేతిక పరిజ్ఞానం.
చాసీసు పరంగా చూస్తే అల్యూమినియం బ్రిడ్జ్ ఫ్రేమ్, 45 మిల్లీమీటర్ల USD ఫోర్కులు, మోనోషాక్ – ఇవన్నీ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్‌తో వస్తాయి. శరీరానికి బరువుగా అనిపించకూడదనే ఉద్దేశంతో తేలికైన ఫోర్జ్డ్ అల్యూమినియం వీల్స్, ఇంకా M కాంపిటిషన్ ప్యాక్ తీసుకుంటే కార్బన్ వీల్స్ కూడా వస్తాయి. ఫ్రంట్‌లో డబుల్ 320 మిమీ డిస్క్‌లు, రియర్‌లో 265 మిమీ డిస్క్ బ్రేక్, ప్రత్యేక M బ్రేక్ కాలిపర్స్ – ఇవన్నీ కలిపి బైక్ వేగాన్ని అదుపులో ఉంచే బాధ్యత తీసుకుంటాయి.

టూరింగ్ కంపోర్ట్ కోసం అడ్జస్టబుల్ విండ్స్‌క్రీన్, M స్పోర్ట్ సీట్, వెనుక ప్రయాణికుడి కోసం మంచి గ్రాబ్ హ్యాండిల్స్, 20 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. హీటెడ్ గ్రిప్స్, క్రూజ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ కంట్రోల్ ప్రో, కీ-లెస్ స్టార్ట్, టైర‍్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), USB ఛార్జింగ్ – ఇవన్నీ టూరింగ్ సైడ్‌లో దానికున్న బలం. 6.5 అంగుళాల TFT డిస్ప్లేలో ప్రత్యేక M స్టార్ట్–అప్ యానిమేషన్ తోనే ఈ బైక్ తన గర్వాన్ని ప్రదర్శిస్తుందంటే అతిశయోక్తి కాదు.
ALSO READ : లొట్టపీసు కేసులో కేటీఆర్‌కు జైలు తప్పదా? పకడ్బందీగా కేసు..
డిజైన్ విషయానికి వస్తే, భారత మార్కెట్‌లో ప్రస్తుతం Black Storm Metallic/M Motorsport కలర్‌లో మాత్రమే లభిస్తుంది. ప్రపంచ మార్కెట్‌లో అయితే కొత్తగా వచ్చిన Aurelius Green Metallic స్కీమ్ చాలా డిమాండ్ తెచ్చుకుంది; గ్రీన్ ట్యాంక్‌పై మినిమల్ M స్ట్రిప్స్ తో “రేసింగ్ బైక్‌కు కోట్ సూట్ వేసి పంపించేసినట్టుంది” అనే గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది.
భారత ధర, లభ్యత: ఎందుకింత ఖరీదు?
BMW M 1000 XRను BMW Motorrad ఇండియా 2024 మే 13న అధికారికంగా లాంచ్ చేసింది. ఇది పూర్తిగా CBUగా దిగుమతి చేసుకుంటున్నారు. అంటే జర్మనీ నుంచి బైక్ రెడీమేడ్‌గా వస్తుంది; మన దేశంలో అసెంబ్లీ లేదు. అందుకే బేస్ ధరపై కస్టమ్స్ డ్యూటీ, GST, సెసెస్, లోకల్ టాక్స్‌లు, ఇన్సూరెన్స్, హ్యాండ్లింగ్ ఛార్జీలు – అన్నీ ఒక్కటొక్కటిగా చేరి, చివరికి అది ₹48.63 లక్షల ఎక్స్‌షోరూమ్ వరకు పెరిగింది.
ప్రస్తుతం ఈ బైక్ ఒకే వేరియంట్ – M 1000 XR Competitionగా మాత్రమే లభిస్తోంది. బుకింగ్స్ అన్ని BMW Motorrad ఇండియా డీలర్‌షిప్‌లలో ఓపెన్‌లో ఉన్నాయి; డెలివరీలు ఇప్పటికే మొదలయ్యాయి. ఢిల్లీలో ఆన్‌రోడ్ ధర ₹49.24 లక్షలుగా ఆటోకార్ ఇండియా తెలిపింది; ఇతర రాష్ట్రాల్లో రోడ్ టాక్స్, ఆర్‌టిఓ ఛార్జ్‌ల ఆధారంగా ₹50 లక్షలు దాటే అవకాశమే ఎక్కువ.
అయితే ఇంత ఖరీదైన బైక్ ఎవరు కొంటారు? సాధారణ కమ్యూట్ కోసం రోజూ ట్రాఫిక్‌లో పరుగులు పెట్టే వాళ్ల కోసం కాదు ఇది. లగ్జరీ కార్ తీసుకునే బడ్జెట్ ఉన్న, ఇప్పటికే ఒక్కటి కాదు రెండు మూడు బైక్‌లు కలిగిన ధోనీ లాంటి హార్డ్‌కోర్ మోటార్సైక్లిస్ట్ల ఛాయిస్ ఇది. హైవేలో 200 kmph వేగంతో వెళుతున్న ఏమాత్రం కదలక, మెదలక పూర్తి నియంత్రణలో ఉంటుంది. ట్రాక్‌లో లాప్‌టైమ్స్, వీకెండ్ టూర్లలో క్రూజ్ కంఫర్ట్ – ఇవన్నీ ఒకేసారి కావాలి, అంతకుమించి “నా బైక్ ధర వింటే మనుషులు వామ్మో.. అనాలి” అనే స్టేటస్ సింబల్ కోరిక కూడా ఉంటే, అప్పుడు M 1000 XRను చూడొచ్చు.
క్లుప్తంగా చెప్పాలంటే, M 1000 XRతో … BMW “బైక్ అంటే 1–2 లక్షల వ్యవహారమని అనుకునే మన మనస్తత్వానికి ఒక స్ట్రెయిట్ యాక్టివ్ షాక్” ఇచ్చింది. అరకోటికి దగ్గర్లో ఉన్న ధర, రేస్‌ట్రాక్ లెవల్ పనితీరు, టూరింగ్ కంఫర్ట్ – వీటన్నింటి మిక్స్‌తో ఈ బైక్ ఇప్పటికి భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అత్యంత హై–ఆక్టేన్ స్పోర్ట్ టూరింగ్ మోటార్‌సైకిల్‌గా చెప్పుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram